కాయ్‌ రాజా.. కాయ్‌! | Cricket Betting In Mahabubnagar | Sakshi
Sakshi News home page

కాయ్‌ రాజా.. కాయ్‌!

Published Mon, Apr 16 2018 12:15 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Cricket Betting In Mahabubnagar - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీఐ బాలరాజు, చిత్రంలో పట్టుబడిన బెట్టింగ్‌ రాయుళ్లు

మహబూబ్‌నగర్‌ క్రైం: ఐపీఎల్‌ పోటీలు మొదలవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బెట్టింగ్‌రాయుళ్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొందరు గుట్టుచప్పుడు కాకుండా పట్టణ కేంద్రాల శివారుల్లో ప్రత్యేకంగా ఇల్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా.. మరికొందరు అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో సెల్‌ఫోన్‌లోనే బెట్టింగ్‌ వ్యవహారం నడిపిస్తున్నారు. బెట్టింగ్‌ మూలంగా ఎంతోమంది తీవ్రంగా నష్టపోయి సర్వస్వం కోల్పోగా.. ఈ విష సంస్కృతికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పోలీసులు సైతం విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహిస్తున్నా.. తిరిగి యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి..

అంతా సెల్‌ఫోన్లపైనే..
ప్రస్తుత కాలంలో అన్ని అంశాలకు ఆధారంగా మారిన సెల్‌ఫోన్‌ను.. బెట్టింగ్‌కు కూడా పలువురు ఉపయోగించుకంటున్నారు. గతంలో మాదిరి అందరూ కలిసి ఒక గదిలో టీవీ ఏర్పాటు చేసుకుని మ్యాచ్‌ చూస్తూ పందెం కాసే రోజులు పోయాయి. ఇంటా, బయట ఎక్కడ ఉన్నా చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు బెట్టింగ్‌ వేయడానికి అవకాశం ఉంది. ఓడిన వ్యక్తుల నుంచి మరుసటి రోజు ఉదయం డబ్బు వసూలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కొన్ని అడ్డాల్లో ఈ వ్యవహారం ప్రముఖంగా కొనసాగుతోంది. సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్‌లు మొదలవుతుండగా.. మూడు గంటల నుంచే పందెలు షూరూ అవుతున్నాయి. ఎవరు టాస్‌ గెలుస్తారు, ఎవరు బ్యాటింగ్‌ ఎంచుకుంటారు. ఎవరు ఫీల్డింగ్‌ చేస్తారనే అంశం మొదలు... ఒక్కో క్రీడాకారుడు ఎన్ని పరుగులు చేస్తాడు.. ఎవరెన్ని వికెట్లు తీస్తారు.. ఎవరు ఎక్కువ క్యాచ్‌లు పడతారు.. ఏ ఆటగాడు ఎక్కువ సిక్స్‌లు కొడతాడు... అంటూ బెట్టింట్‌లు ప్రారంభిస్తున్నారు. ఆటను చూస్తున్నప్పుడు చేతిలో డబ్బులు లేని వారికి ప్రతీ రూ.వెయ్యికి రూ.10 చొప్పున కమీషన్‌గా తీసుకుంటూ కొందరు అక్కడే ఉండి డబ్బు సమకూరుస్తున్నట్లు సమాచారం. ఇక పోలీసులు కానీ ఇంకా ఎవరికైనా బెట్టింగ్‌ కాసే విషయం తెలియకుండా జట్టు సభ్యుల దుస్తుల రంగు, ఇతరత్రా అంశాలను కోడ్‌గా ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో
ఈసారి బెట్టింగ్‌లో సాంకేతికత ప్రవేశించిందని సమాచారం. వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు కొన్ని యాప్‌లను దీనికి ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. కేవలం మహానగరాలకే పరిమితమైన ఈ పరిజ్ఞానాన్ని నిర్వాహకులు ఇక్కడా వాడుతున్నారు. ప్రధానంగా యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని బుకీలు దందా కొనసాగిస్తున్నారు. వాట్సప్‌లో రూ.3వేలు వెచ్చించి ఒక లైన్‌ తీసుకుంటుండగా.. ఈని ద్వారా మ్యాచ్‌ స్థితిగతులు బుకీలకు తెలుస్తాయి. టాస్‌ వేసిన క్షణం నుంచి చివరి బంతి వరకు బెట్టింగ్‌ స్వరూపం మారుతుంటుంది. కొందరు మ్యాచ్‌ ఓడిపోతుందనే అంచనాకు రాగానే ఎక్కువ రేటింగ్‌ ఇచ్చి వేరే జట్టుకు తమ పందేన్ని మార్చుకుంటారు. ఇలా చేయడం వల్ల నిర్వాహకులకు అధిక లాభాలు ఉంటాయి. రేటింగ్‌ ఎక్కువ ఉన్న జట్టును అప్పటికప్పుడు తీసుకుంటే రూ.10వేలకు రూ.15వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక బెట్టింగ్‌లో ఓడిపోయిన వారి దగ్గర మరుసటి రోజు ఉదయం ఒక వ్యక్తి వచ్చి డబ్బు తీసుకుంటారని.. ఇదంతా మధ్యవర్తుల ద్వారానే సాగుతుంది తప్ప అసలు సూత్రధారులు ఎవరు కూడా తెరపై కనిపించని తెలుస్తోంది

అలవాటైన వారు మళ్లీ..
ఒకసారి పందెంలో పాల్గొని గెలిచినా లేదా ఒడిన వారు మళ్లీమళ్లీ పాల్గొంటున్నారు. జిల్లాలో ముఖ్య పట్టణ కేంద్రాలకు చెందిన కొందరు వ్యాపారులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. కొందరైతే ఈ సీజన్‌ జరిగినన్ని రోజులు వ్యాపారాలకు స్వస్తి పలికి బెట్టింగ్‌లోనే మునిగి తేలుతున్నారని చెబుతున్నారు. ఇక ఎలాంటి కష్టం లేకుండా.. కూర్చున్న దగ్గర డబ్బు సంపాదించాలనే ఆశతో ఐపీఎల్‌ బెట్టింగ్‌లో యువత పాల్గొంటున్నారు. అయితే, ఈ పందెంలో కొందరే గెలుస్తుండగా.. ఎక్కువ మంది ఓడిపోయి రూ.లక్షల్లో నష్టపోతున్నారు. ఇదేసమయంలో డబ్బు చెల్లించలేక పలువురు విలువైన వస్తువులు, ఆభరణాలు, వాహనాలు తాకట్టు పెడుతున్నారని.. కొందరు కనిపించకుండా తిరుగుతున్నారని తెలుస్తోంది. కాగా, జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు.. పట్టణంలోని అపార్టుమెంట్లు, హోటళ్లు, దుకాణాల్లో బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. కాగా. పందెంలో పాల్గొంటున్న వారిలో ఎస్సెస్సీ విద్యార్థులు మొదలు పీజీ చదువుతున్న వారు కూడా ఉంటున్నారని చెబుతుండడం ఆందోళన కలిగించే విషయం.

నిఘా ఏర్పాటు చేస్తాం
బెట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశాం. ఎంతటి వారైనా వదిలేది లేదు. బెట్టింగ్‌ ద్వారా యువత, వారి కుటుంబాలు భారీగా నష్టపోతాయి. ఈజీ మనీ కోసం కొందరు ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. ఐపీఎల్‌ క్రికెట్‌పై ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడినా, మోసపూరిత చర్యలకు దిగినా కఠిన చర్యలు తీసుకుంటాం. బెట్టింగ్‌ జరుగుతున్న ప్రాంతాలు, బాధ్యుల సమాచారాన్ని మాకు అందిస్తే వివరాలు గోప్యంగా ఉంచి నిందితులను పట్టుకుంటాం.– బి.అనురాధ, ఎస్పీ, మహబూబ్‌నగర్‌ జిల్లా  

క్రికెట్‌ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్‌
జడ్చర్ల: ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్‌ కాస్తున్న వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాదేపల్లి గౌరీశంకర్‌కాలనీ సమీపంలో మైనార్టీ గురుకుల పాఠశాల వెనకాల ఓ ఇంటిలో బెట్టింగ్‌ కాస్తున్నట్లు అందిన సమాచారంతో ఆదివారం సీఐ బాలరాజుయాదవ్‌ ఆధ్వర్యాన పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్చర్లకు చెందిన శ్యాం, సౌసిక్, పవన్, మోసిన్, నవీన్, ఉదయ్, హరీష్, రాకేష్‌బాబును అదుపులోకి తీసుకోవడంతోపాటు వారి నుంచి రూ.39 వేల నగదు, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఐపీఎల్‌ టోర్నీల ప్రారంభం నుంచి శ్యాం అనే యువకుడు ఓ గది అద్దెకు తీసుకుని బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement