సాక్షి, గుంటూరు: పల్నాడులో కీలక క్రికెట్ బుకీల్ని టాస్క్‌ఫోర్స్ బృందాల ద్వారా అదుపులోకి తీసుకుని మూలాల్ని వెతికే పనిలో పోలీసు అధికారులు పడ్డారు. వారి ద్వారా బెట్టింగ్ తీగను లాగుతూ డొంకను కదిల్చే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న క్రికెట్ బుకీల్లో అధికార పార్టీకి చెందిన పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిలర్‌తోపాటు, పలువురు టీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి వారిని వదిలేయాలంటూ పోలీస్ బాస్‌ల ద్వారా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చే పనిలో ఉన్నట్లు తెలిసింది. అయితే, రూరల్ ఎస్పీ సీహెచ్.వెంకటప్పలనాయుడు మాత్రం బుకీలు అందించిన కీలక సమాచారంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలువురిని అదుపులోకి తీసుకుని ఆట కట్టించే దిశగా సీరియస్‌గా అడుగులు వేస్తున్నారు.
బెట్టింగ్ ఉచ్చులో అమాయకులు
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మహమ్మారి ఉచ్చులో చిక్కుకుని ఎందరో అమాయకులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరెన్నో కుటుంబాలు అప్పులపాలై రోడ్డున పడ్డ సంఘటనలు అందరికీ తెలిసినవే. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ వందల కుటుంబాలు సర్వనాశనం చేస్తున్న బుకీల ఆటకట్టించాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిదే క్రికెట్ బుకీలకు అండగా నిలుస్తుండటంపై జిల్లా ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ప్రజాప్రతినిధి చేయాల్సిన పనేనా అంటూ మండి పడుతున్నారు. ఇది టీడీపీ, ప్రభుత్వానికి సైతం చెడ్డ పేరు తెచ్చిపెడుతుందని సొంత పార్టీ నేతలు సైతం విమర్శిస్తున్నారు.
సీఎం పేషీ నుంచి సైతం ఒత్తిడి
టాస్క్‌ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకున్న క్రికెట్ బుకీల్లో ఓ కౌన్సిలర్‌తోపాటు అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు ఉండటంతో పల్నాడుకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగినట్లు సమాచారం. తమ వారిని వదిలేయాలంటూ పోలీసు బాస్‌ల ద్వారా జిల్లా పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. సీఎం పేషీనుంచి సైతం పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి క్రికెట్ బుకీలను విడిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు సమాచారం.
పోలీసులు సీరియస్
జిల్లాలో బెట్టింగ్ జాడ్యాన్ని రూపుమాపేందుకు గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల ఎస్పీలు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. రెండు పోలీసు జిల్లాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాల్ని ఏర్పాటు చేసి క్రికెట్ బుకీలను జిల్లా నుంచి తరిమే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని పిడుగురాళ్ల పట్టణంలో ఓ రెస్టారెంట్‌లో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న కొందరు బుకీలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని గుంటూరు తరలించారు. వీరిలో అధికారపార్టీకి చెందిన పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిలర్‌తోపాటు, పలువురు టీడీపీ నేతలు సైతం ఉండటం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం బుకీల్ని విచారిస్తూ వారి నుంచి కీలక సమాచారాలను రాబట్టినట్లు తెలిసింది. గుంటూరు నగరంలోని ఓ క్లబ్‌లో కూర్చొని గుంటూరు జిల్లాతోపాటు, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో బెట్టింగ్ రాయుళ్లకు లైన్ ఇస్తూ ఆన్‌లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది కోసం గాలింపు చేపట్టారు. ఎస్సీల దెబ్బకు ఇప్పటికే పలువురు బుకీలు జిల్లా వదిలి వెళ్లి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తుండగా, అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో వీరు మాత్రం జిల్లా నుంచే కార్యకలాపాలు సాగిస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment