బెట్టింగ్‌ | Cricket Betting Freely Happening In Adilabad | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌

Published Fri, May 25 2018 7:09 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Cricket Betting Freely Happening In Adilabad - Sakshi

క్రికెట్‌ బెట్టింగ్‌

జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని పలు బార్లు క్రికెట్‌ బెట్టింగ్‌కు అడ్డగా మారాయి. ఐపీఎల్‌ 11 ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ బార్లలో రోజూ బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. సాయంత్రం మ్యాచ్‌ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు బార్లలో ఇదే సందడి నెలకొంటోంది. స్థానికులే దీన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం చెన్నయ్‌ సూపర్‌కింగ్స్, హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ మధ్య జరిగిన పోటీ లక్షల రూపాయల బెట్టింగ్‌ జరిగింది. ఓ బడాబాబు చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ గెలుస్తుందని రూ.2 లక్షల బెట్టింగ్‌ కాసాడు. ఆ టీం గెలుపొందడంతో అంతకు నాలుగింతలు రూ.8 లక్షలు ఆయన చేతికి అందాయి. ఈ ఒక్క సంఘటననే జిల్లాలో బెట్టింగ్‌ ఏ స్థాయిలో జరుగుతుందనేది తెలుస్తోంది. బడాబాబులు లక్షల రూపాయలు బెట్టింగ్‌ కాసేందుకు వెనకాడడం లేదు.  

సాక్షి, ఆదిలాబాద్‌ : బడాబాబులు రూ.లక్షల్లో పెడుతుంటే కొంతమంది యువత జట్టు కట్టి మరీ బెట్టింగ్‌ కాస్తున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా పని చేసే ఓ యువకుడు తన వంతుగా రూ.500 ఐపీఎల్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై పెట్టాడు. తన మిత్రులందరి ద్వారా కలిసి రూ.40 వేలు జమచేసి ఈ బెట్టింగ్‌లో పెట్టారు. ఆ జట్టు గెలుపొందడంతో ఆ ఆఫీస్‌ బాయ్‌కి రూ.2 వేలు, ఆ మిత్రులు మొత్తం కలిసి పెట్టిన మొత్తానికి రూ.లక్షా 60 వేలు చేతి కందాయి. ఇప్పుడు క్వాలిఫయర్‌ 2, ఫైనల్‌ మ్యాచ్‌లపై ఆ మొత్తాన్ని బెట్టింగ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. అదే సమయంలో కొంతమంది యువకులు జట్టుగా కలిసి రూ.70 వేలు రాజస్థాన్‌ రాయల్స్‌పై పెట్టి నష్టపోయారు. ఇలాంటివి ఒకట్రెండు దృష్టికి రాగా వందలాది మంది యువకులు జట్టుగా కలిసి రోజు బెట్టింగ్‌ కట్టడం జరుగుతోంది. 

గుట్టుచప్పుడు కాకుండా..
ఆదిలాబాద్‌ కేంద్రంగా ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. పొట్టి క్రికెట్‌ మజాను కొంతమంది బెట్టింగ్‌ రూపంలోకి తీసుకువచ్చి స్థానికంగా పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, ముఖ్యంగా యువకులను ఈ రోంపిలోకి వచ్చేలా చేసి వారి డబ్బుల ఆశను సోమ్ము చేసుకుం టున్నారు. లోకల్‌గానే ఈ వ్యవహారం అంతా సాగుతోందని, స్థానికంగా బుకీలుగా అవతారం ఎత్తిన వారికి పైస్థాయిలో ఇతర రాష్ట్రాల్లోని బడాబుకీలతో సంబంధాలు లేనట్లుగా తెలుస్తోంది. గత ఐపీఎల్‌ సీజన్‌లలో ఆదిలాబాద్‌లో మామూలుగా సాగిన వ్యవహరం ఐపీఎల్‌–11కు వచ్చే సరికి మాత్రం కోట్ల రూపాయలకు పాకి మున్ముందు బుకీ వ్యవస్థ ఏర్పడినా ఆశ్చర్య పోనక్కర్లేదన్న పరిస్థితి కనిపిస్తోంది. 11వ ఐపీఎల్‌ ప్రారంభమైన తరువాత గుట్టుచప్పడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో ఆదిలాబాద్‌ పట్ట ణానికి చెందిన కొంతమంది బార్లు, వైన్స్‌ల య జమానులు కోట్ల రూపాయల్లో దీన్ని సాగిస్తున్నా రు.

గతంలో పేకాట క్లబ్‌లను నిర్వహించిన అనుభవం ఉన్న కొంతమంది ఈ వ్యవహరాన్ని పకడ్బందీగా సాగిస్తున్నారు. కొందరు యువకులు ఈ బెట్టింగ్‌ను నిర్వహిస్తూ రోజు కూలీ పనులు చేసుకునే వారిని, పేదలను దీని పట్ల ఆకర్షితులయ్యేలా చేసి వారి డబ్బులను గుల్ల చేస్తున్నారు. ఇటీవల కాలంలో పట్టణంలో మట్కా, పేకాట ను పోలీసులు అరికట్టడంతో కొందరు ఈ బెట్టిం గ్‌ వైపు దృష్టి సారిస్తున్నారు. పట్టణంలోని మహాలక్ష్మివాడ, ఖానాపూర్, భుక్తాపూర్‌ కాలనీల్లో పలువురు ఈ బెట్టింగ్‌ను నిర్వహిస్తూ దం దా కొనసాగిస్తున్నారు. విద్యానగర్‌లోని ఓ లాడ్జి నిత్యం పలువురు కళాశాల విద్యార్థులు, ఇతరులతో సాయంత్రం సమయంలో కిక్కిరిసి ఉంటోం ది. ఈ లాడ్జిలో బెట్టింగ్‌ జోరుగా సాగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చేస్తున్నరా లేనిపక్షంలో ఈ వ్యవహరాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నరా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గెలిస్తే రెట్టింపు...
11వ ఐపీఎల్‌ సీజన్‌ ఏప్రిల్‌ 7న ప్రారంభమైంది. ఈ నెల 27న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. సీజన్‌ ప్రారంభమైన తరువాత ఆదిలాబాద్‌లో బెట్టింగ్‌ను స్థానికులైన పలువురు వ్యాపారులు, యువకులు నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సీజన్‌ మొదటి నుంచి ప్రముఖ హోటళ్లు, లాడ్జీలు, బార్లను అడ్డలుగా చేసుకొని బెట్టింగ్‌ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ప్రధానమైన టీంలపై ఈ బెట్టింగ్‌ వ్యవహారం నడుస్తోంది. బలమైన టీం గెలుస్తుందని బెట్టింగ్‌ పెట్టినప్పుడు రెట్టింపు, అంతకంటే ఎక్కువ, కొన్ని పరిస్థితుల్లో నాలుగింతలు డబ్బులు వస్తాయి. బలమైన టీంపై బెట్టింగ్‌ చేస్తే తక్కువ వస్తాయని, బలహీన టీంపై బెట్టింగ్‌ చేసి గెలిచిన వారికి అంతకంటే ఎక్కువే డబ్బులు ముట్టజేబుతామని ఆశ చూపడంతో పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, యువత అయోమయంలో డబ్బులు పెట్టి వేలు, లక్షలు నష్టపోతున్నారు. వేసవి సెలవులు కావడంతో పలువురు యువత కూడా ఖాళీ సమయాన్ని దీనికి కేటాయిస్తుండడంతో పక్కదారి పడుతున్నారు. నిర్వాహకులు హోటళ్లు, లాడ్జీలు, బార్లను అడ్డగా చేసుకుని కేవలం సెల్‌ఫోన్‌ ద్వారా మంతనాలు చేస్తూ నడిపిస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఓ బార్‌లో భారీ స్క్రీన్‌ ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే మ్యాచ్‌ జరిగే రోజు మధ్యాహ్నం పేరు, సెల్‌ నం, బెట్టింగ్‌ పెట్టే జట్టు పేరు, ఎంత నగదు బెట్టింగ్‌ అనేవి రాసుకుంటున్నారు. మొదట బ్యాటింగ్‌ అయిపోయిన తర్వాత ఎంట్రీ చేసుకున్న వారికి నంబర్‌ కేటాయించి దాని ఆధారంగా మ్యాచ్‌ అనంతరం ఫలితాన్ని బట్టి పేమెంట్‌ చేస్తున్నారు. ఇలా వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. ఫలితాలకు అనుగుణంగా డబ్బులు ముట్టజెబుతుండడంతో వ్యవహారం బయటకు రావడం లేదు. ఈ బెట్టింగ్‌ ద్వారా ఓ వ్యాపారి సుమారు కోటి రూపాయలు గడించినట్లు పట్టణంలో చర్చ సాగడం సంచలనం కలిగిస్తోంది. నిర్వాహకులు లాభ పడుతుండగా, బెట్టింగ్‌ చేసిన మాములు వ్యక్తులు ఈ లెక్కన కోట్ల రూపాయలలో నష్టపోతున్నారు. కొంతమంది ఫలితాల కోసం హోటళ్లలో గదులు బుక్‌ చేసుకుని అర్ధరాత్రి వరకు మ్యాచ్‌లు చూస్తూ విందువినోదలతో గడుపుతున్నారు.

క్వాలిఫయర్‌ 2, ఫైనల్‌ నేపథ్యంలో జోరు...
ఇప్పటివరకు బెట్టింగ్‌ ఓ స్థాయిలో జరుగగా, క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌ శుక్రవారం, ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం జరగనుండడంతో బెట్టింగ్‌ తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య పోటీ జరగనుంది. ఈ రెండు టీమ్‌లలో సమాన గెలుపు అవకాశాలు ఉండడంతో బెట్టింగ్‌లో కొంత తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన చెన్నయ్‌ సూపర్‌కింగ్స్‌ మీద పలువురు కోట్ల రూపాయలు వెచ్చించేందుకు వెనకాడడం లేదు. ఆదివారం జరిగే ఫైనల్‌లో ఆ టీం పైనే పలువురు బెట్టింగ్‌ కాస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే క్వాలిఫయర్‌ 2, ఫైనల్‌ మ్యాచుల్లో బెట్టింగ్‌ కోట్ల రూపాయల్లో సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఓ బార్‌లో పలువురు నిర్వాహకులు సమావేశమై చర్చలు జరిపారనేది విశ్వసనీయంగా తెలుస్తోంది.

నిఘా పెట్టినం.. 
బెట్టింగ్‌ జరుగుతున్నట్లు ప్రచారం రావడంతో పలుచోట్ల నిఘా పెట్టాం. ఆదిలాబాద్‌లో బెట్టింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం వస్తోంది. పకడ్బందీగా దాడి చేసి పట్టుకోవడం జరుగుతుంది.
– విష్ణు ఎస్‌.వారియర్, ఎస్పీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement