
నరసరావుపేటలో ప్రధాన బుకీలను అరెస్టు చేసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ వెంకటప్పలనాయుడు (ఫైల్)
సాక్షి, గుంటూరు: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఐపీఎస్ అధికారులను సైతం లెక్కచేయడం లేదు. అలా కాకుండా ఎవరైనా తమ జోలికి వస్తే జిల్లా నుంచే పంపించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఎస్పీ స్థాయి అధికారినే టార్గెట్ చేస్తున్నారంటే బెట్టింగ్ మాఫియా ఏ స్థాయిలో రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో గుంటూరు రూరల్ ఎస్పీగా పనిచేసిన పీ.హెచ్.డీ.రామకృష్ణ క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఆటకట్టించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బుకీలు, ఫండర్స్‌ను అరెస్టు చేయడంతోపాటు సస్పెక్టెడ్ షీట్లు తెరిచి జిల్లా నుంచి పరారయ్యేలా చేశారు. ఈ క్రమంలో ఆగ్రహించిన బెట్టింగ్ మాఫియా అధికార పార్టీ ముఖ్యనేతల సహకారంతో ఎనిమిది నెలలకే ఆయన్ని బదిలీ చేయించారు. ఆ తర్వాత యథేచ్ఛగా తమ కార్యకలాపాలను కొనసాగించారు. తాజాగా గుంటూరు రూరల్ ఎస్పీ సి.హెచ్.వెంకటప్పలనాయుడు సైతం క్రికెట్ బెట్టింగ్‌కు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుండటంతో ఆయన్ను సైతం బదిలీ చేయించేందుకు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం.
అధికార పార్టీ నేతల అండతో..
క్రికెట్ బెట్టింగ్ మాఫియాకు అధికార పార్టీ నేతలతోపాటు జిల్లాలో పనిచేస్తున్న కొందరు అవినీతి పోలీసు అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో ఎస్పీ బదిలీకి భారీ స్థాయిలో కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అవినీతి పోలీసు అధికారులపై క్రికెట్ బుకీలు, పోలీసు సిబ్బంది లిఖిత పూర్వకంగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ల ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ ఉన్నతాధికారులకు నివేదిక పంపిన విషయం తెలిసిందే. అయితే ఎస్పీ నివేదికను తొక్కిపట్టి ఇందులో కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసేందుకు తిరిగి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ డీఎస్పీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఎస్పీ ఇచ్చిన నివేదికను తప్పుడు నివేదికగా చూపించే ప్రయత్నం జరగుతోందని పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతుంది.
ఎస్పీ బదిలీకి భారీ స్కెచ్..
ముఖ్యంగా అధికార పార్టీ ముఖ్యనేతల అండతో ఓ డీఎస్పీ స్థాయి అధికారి ఎస్పీపై కాలు దువ్వుతున్నారు. తప్పు చేసి తప్పించుకునేందుకు అందరిని బెదిరిస్తూ మరిన్ని తప్పులు చేస్తున్నారని సొంత శాఖలోని అధికారులే విమర్శిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికార పార్టీ ముఖ్యనేతలు అప్పట్లో ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి తెచ్చి క్రికెట్ బెట్టింగ్‌పై విచారణ నిలిచిపోయేలా చేశారు. అంతటితో ఆగకుండా ఎస్పీ ఇచ్చిన నివేదికను వెనక్కు పంపి డీఎస్పీ స్థాయి అధికారితో తిరిగి విచారణ చేయిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ పాత్రపై లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిన బుకీలు, వారి వద్ద పనిచేయిస్తున్న సిబ్బందిని గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌లు తప్పని చెప్పాలంటూ అవినీతి అధికారుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది గతంలో తమను బెదిరించి తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పించారంటూ రాయించి నివేదికను పోలీసు ఉన్నతాధికారులకు పంపి ఎస్పీని బదలానం చేయాలనే కుట్ర జరుగుతున్నట్లు పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఎస్పీ ఇచ్చిన నివేదికపై తిరిగి విచారణ జరపాల్సిన అవసరం వస్తే అంతకంటే పై స్థాయి అధికారిచేత విచారణ జరపాల్సి ఉండగా కింది స్థాయి అధికారితో విచారణ చేయిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఐపీఎస్ బదిలీలు ఉన్న నేపథ్యంలో రూరల్‌ఎస్పీని జిల్లా నుంచి పంపించేందుకు అవినీతి పోలీసు అధికారులు, క్రికెట్‌బుకీలు అధికార పార్టీ ముఖ్య నేతల ద్వారా సర్వ శక్తులు ఒడ్డుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు బుకీలు గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు విరుద్ధంగా ప్రస్తుత విచారణ అధికారి వద్ద స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్..
క్రికెట్ బెట్టింగ్ మహమ్మారి దెబ్బకు ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడగా, మరెన్నో కుటుంబాలు అప్పులపాలై రోడ్డున పడుతున్న ఘటనలు నిత్యం పెరగిపోతున్నాయి. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి మారీ నిఘాను పెంచారు. ముఖ్యంగా నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ప్రధాన క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకుని విచారించడంతో అవినీతి అధికారుల పాత్ర బయటపడింది. క్రికెట్ బుకీల వద్ద భారీ స్థాయిలో మామూళ్లు పుచ్చుకుంటూ వారికి అండగా నిలుస్తున్న అవినీతి అధికారుల జాబితాను తయారు చేశారు. అంతటితో ఆగకుండా వారికి డబ్బులు ఇచ్చిన బుకీలు, వాటిని అధికారికి చేరవేసిన సిబ్బందిని విచారించి వారి నుంచి లిఖిత పూర్వకంగా స్టేట్‌మెంట్‌లు నమోదు చేయించారు.
దీని ఆధారంగా అప్పట్లో కొందరు ఎస్సైలు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతోపాటు, మరికొందరు డీఎస్పీలు, సీఐల పాత్రపై ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో తమ పేర్లు బయటకు వచ్చాయని తెలుసుకున్న అవినీతి పోలీసు అధికారులు తమపై వేటు పడకుండా కాపాడాలంటూ అధికార పార్టీ ముఖ్యనేతలను ఆశ్రయించారు. ఆ తర్వాత కూడా క్రికెట్ మాఫియాను వదలకుండా తెనాలిలో 25 మంది ముఠాను, నరసరావుపేట డివిజన్‌లో ఏకంగా 52 మందిని ముఠాను అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిలర్ సైతం పట్టుబడడంతో అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.