విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు(సెంట్రల్): తాను క్రికెట్ బుకీలను విజయవాడ, కడపలో కలిసి మాట్లాడినటు ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆధారాలు చూపితే గంటలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎస్పీకి బహిరంగ సవాల్ విసిరారు. నగరంలోని రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెట్టింగ్ నిర్మూలనకు ఎస్పీ ఎటువంటి చర్యలు తీసుకున్నా తాను మద్దతు ఇస్తామన్నారు. కానీ రాజకీయ ప్రోద్భలంతో, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ కేసుల్లో ఇరికించే వాటికి వ్యతిరేకమన్నారు. పదిహేను నెలలుగా తాను పరారీలో ఉన్నట్లు కోర్టులో ఎస్పీ చార్జీషీట్ వేయడం చూస్తేనే ఈ కేసు ఎంత రాజకీయ రంగు పులుముకుని ఉందో తెలుస్తుందన్నారు. తాను ఏ పోలీసు అధికారికి ఫోన్ చేసి బుకీలను వదలమన్నానో ఆ పోలీసు అధికారుల పేర్లు స్పష్ట చేయాలన్నారు. బుకీలుగా ఉన్న వారు మంత్రులకు సన్మానాలు, విందులు ఇస్తే వారి పేర్లను చార్జీషీట్‌లో నమోదు చేయడానికి, వారికి నోటీసులు ఇవ్వడానికి ఎస్పీ రామకృష్ణ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం
ఎస్పీ రామకృష్ణ జిల్లా పోలీసు బాస్ అనే అహంకారంతో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తే సహించేది లేదన్నారు. నిజాయితీగా ఉన్నానంటున్న ఎస్పీ కొందరు పోలీసులు బుకీలతో మాట్లాడిని కాల్ డేటాను ఎందుకు బహిర్గతం చేయలేదో చెప్పాలన్నారు. రాజకీయ దురద్దేశంతో కావాలని కక్షసాధింపుగా తనపై కేసులు నమోదు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించాలంటే మాత్రం న్యాయపోరాటం ద్వారా ఎదుర్కొంటానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎస్పీని కలవాలని కోరితే తాను వివిధ పనుల్లో ఉన్నానంటూ తనకు సమాధానంగా ఎస్పీ ఎస్‌ఎమ్మెఎస్ పంపారన్నారు. కానీ అన్ని విషయాలను లిఖిత పూర్వకంగా ఎస్పీకి రిజిష్టర్ పోస్టులో పంపుతున్నాన్నారు.
పత్రికలకు నోటీసులు జారీ చేస్తా
తాను ఏ తప్పు చేయలేదని, ఏదైనా తప్పు చేసి ఉంటే ఆధారాలు చూపమని మొదటి నుంచి చెబుతున్నానని, కాని కొందరు పోలీసులు శాఖలోని లీకు వీరుల సాయంతో, వారి మాటల ఆధారంగా తనపై అసత్య కథనాలు రాస్తున్న కొన్ని పత్రికలకు, టీవీ చానల్స్‌కు కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చెప్పారు. కనీసం తాను బెయిల్ కూడా తెచ్చుకోనని, తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నా కావాలని పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్న వారిని న్యాయం స్థానం ముందు నిలబెడతానన్నారు.
న్యాయపరంగానే పోరాటం చేద్దాం
నెల్లూరు (సెంట్రల్): ప్రభుత్వ ఒత్తిడితో నమోదయ్యే తప్పుడు కేసులపై న్యాయపరంగానే పోరాటం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో ఫోన్‌లో వైఎస్ జగన్ మాట్లాడారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఫోన్ చేసి కేసు విషయాలు మాట్లాడి అధైర్య పడొద్దని సూచించారు. రాజకీయ కక్షతో పెట్టే కేసులను న్యాయ పరంగానే ఎదుర్కొని పోరాడదామని సూచించారు. పార్టీ నేతలు, శ్రేణులు అందరు అండగా ఉంటారని ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment