ఆయనో ప్రజాప్రతినిధి. సామాన్యుడిగా నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటారు. నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులతో కష్టసుఖాలు తెలుసుకుంటూ భరోసాగా నిలుస్తారు. కార్యకర్తల ఇంట్లోనే భోజనం, నిద్ర చేస్తూ మమేకమవుతారు. ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఈ పేరు ప్రజల గుండె చప్పుడు. కష్టం వచ్చి శ్రీధరన్న.. పిలిస్తే ఆగమేఘాల మీద వెళ్లి ఆ కష్టాన్ని తీర్చి.. కన్నీళ్లు తుడిచి వస్తాడు. ఎమ్మెల్యే కాక ముందు నుంచి పాదయాత్ర చేసి ప్రతి ఇంటిని పలకరించారు. ప్రతి పక్ష ఎమ్మెల్యేగా పల్లె పల్లె తిరిగారు. తాజాగా సోమవారం నుంచి జగనన్న మాట గడప గడపకు కోటంరెడ్డి బాట పేరుతో ఇల్లిల్లూ తిరుగుతున్నారు.
సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ మండలం గొల్లకందూరులో చేవూరు శ్రీనివాసులురెడ్డి అనే కార్యకర్త ఇంటి నుంచి సోమవారం ఉదయం ‘జగనన్న మాట.. గడప గడపకూ కోటంరెడ్డి బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 9 నెలలు పాటు చేపట్టే ఈ కార్యక్రమం మూడు విడతలుగా చేపట్టనున్నారు. ఒక్కొక్క విడతలో నిరంతరాయంగా 33 రోజులు కొనసాగించనున్నారు. ఉదయం 7 నుంచి 12 గంటలకు ముగించనున్నారు. కార్యకర్త ఇంట్లోనే భోజనం చేయడం, అక్కడే 2 గంటలు రెస్ట్ తీసుకోవడం, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటలకు వరకూ గడప గడప కార్యక్రమం ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా చేపట్టనున్నారు.
చదవండి: (తండ్రి, తనయుడి కేబినెట్‌లలో ఆ నలుగురు..)
జనంతో మమేకం.. ఆయన జీవితం
ఆయన రాజకీయ జీవితమంతా.. జనంతో మమేకమై సాగుతోంది. ప్రతి రోజు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, సమస్య ఉంటే ఎమ్మెల్యే ఆఫీసు వెళ్తే పరిష్కారం లభిస్తుందనే ధీమా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు కల్పించడంలో సఫలీకృతుడయ్యారు. తాను అందుబాటు లేకపోయినా సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి అయినా అందుబాటులో ఉండేలా ప్రత్యేక ప్రణాళిక రచించుకున్నారు. క్రమం తప్పకుండా అందుకు తగ్గట్లుగా పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటారు. పదవుల కోసం పాకులాడకుండా.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు గడప గడపకు కోటంరెడ్డి బాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
చిత్తశుద్ధితో నిర్వహణ
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చిత్తశుద్ధితో కార్యక్రమాలు నిర్వహిస్తారనే పేరుంది. అందులో భాగంగా ఇల్లిల్లూ తిరుగుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? అర్హత ఉండి దక్కలేదా? ఇంకా ఏమి కావాలని కోరుకుంటున్నారనే విషయాలు తెలుసుకుంటూనే వారితో మమేకం అవుతున్నారు. గొల్లకందుకూరులో గంజి బుజ్జమ్మ అనే వృద్ధ మహిళతో కలిసి నేలపై కూర్చుండి ఆమె సమస్యలు తెలుసుకుని భరోసా కల్పించారు. ప్రజల సమస్యలు తెలుసుకునే క్రమంలో స్వయంగా పుస్తకంలో నోట్ చేసుకుంటున్నారు. కార్యకర్తలు ఎంత మంది ఉన్నా సమస్యలను ఎమ్మెల్యేకు మాత్రమే చెప్పుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment