జల ఆశయం..మరి కొద్ది రోజుల్లో సాకారం | 60 Percent Sarvepalli Reservoir Modernization Works Completed | Sakshi
Sakshi News home page

జల ఆశయం..మరి కొద్ది రోజుల్లో సాకారం

Published Sat, Dec 3 2022 6:08 PM | Last Updated on Sat, Dec 3 2022 6:52 PM

60 Percent Sarvepalli Reservoir Modernization Works Completed  - Sakshi

సర్వేపల్లి రిజర్వాయర్‌ కట్టకు జరుగుతున్న రివిట్‌మెంట్‌ పనులు

పాలకుల సంకల్పం.. ప్రభుత్వ చిత్తశుద్ధి వెరిసి జలసిరులు ఒడిసి పట్టేందుకు చేస్తున్న జల ‘ఆశయం’ పటిష్టం.. మరి కొద్ది రోజుల్లో సాకారం కానుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు మండలాల్లో వేలాది ఎకరాలకు ప్రధాన జలవనరుగా ఉన్న సర్వేపల్లి రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో     తాత్కాలిక పనుల పేరుతో రూ.కోట్లు దోచుకున్నారు. ఒకానొక దశలో వచ్చిన వరదలకు రిజర్వాయర్‌ కట్టలు కొట్టుకుపోయే దుస్థితికి చేర్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగునీటి రంగాలపై దృష్టి సారించారు.  

వెంకటాచలం(పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా): బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన సర్వేపల్లి రిజర్వాయర్‌కు ఎట్టకేలకు ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన రిజర్వాయర్‌ను గత ప్రభుత్వాలు ఆలనాపాలనా పట్టించుకోకపోవడంతో కాలక్రమేణ దెబ్బతినే పరిస్థితికి చేరింది. 1.74 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌ వెంకటాచలం మండలంలోని తొమ్మది గ్రామాలతో పాటు, ముత్తుకూరు మండలంలోని పొట్టెంపాడు, పోలంరాజుగుంట గ్రామాల్లో సుమారు 15,350 ఎకరాల అధికార, మరో 10 వేల అనధికార ఆయకట్టుకు సాగునీటిని, తాగునీటిని అందిస్తోంది. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రిజర్వాయర్‌ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు.


అనికేపల్లి వద్ద పూర్తయిన కలుజు నిర్మాణం  

ఆయన మరణాంతరం ఈ పనులు చేపట్టిన అప్పటి కాంట్రాక్టర్‌ పనులు సక్రమంగా చేయలేదు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా రిజర్వాయర్‌ పటిష్టత, భద్రతపై దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో 2015లో కురిసిన భారీవర్షాల కారణంగా రిజర్వాయర్‌ కట్ట దాదాపు తెగిపోయే పరిస్థితికి వచ్చింది. రిజర్వాయర్‌ కట్ట తెగి ఉంటే అప్పట్లో ఊళ్లకు, ఊళ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉండింది. అప్పటి ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తం అయి ఇసుక బస్తాలు అడ్డుకట్ట వేసి తాత్కాలిక మరమ్మతులు చేయించారు. ఆ తర్వాత నుంచి కరువు తాండవించడంతో చంద్రబాబు పాలనలో రిజర్వాయర్‌ అభివృద్ధిని పట్టించుకోలేదు. 
   
కాకాణి గోవర్ధన్‌రెడ్డి చొరవతో.. 
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు మండలాలకు సాగు, తాగునీటి వనరుగా సర్వేపల్లి రిజర్వాయర్‌ ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కాకాణికి రిజర్వాయర్‌ పరిస్థితిని రైతులు, వివిధ గ్రామాల నాయకులు తెలియజేశారు. దీంతో కాకాణి గోవర్ధన్‌రెడ్డి అనికేపల్లి నుంచి జోసఫ్‌పేట వరకు సర్వేపల్లి రిజర్వాయర్‌ కట్టపై పాదయాత్ర చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అప్పటి ప్రభుత్వానికి రిజర్వాయర్‌ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినా చెవిన కూడా పెట్టుకోలేదు. కానీ రిజర్వాయర్‌ కింద ఏటా కాలువల అభివృద్ధి, మరమ్మతుల పేరిట, నీరు–చెట్టు పేరుతో రూ.కోట్ల దోచుకున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా విక్రమసింహపురి యూనివర్సిటీకి వచ్చారు. ఆ సమయంలో రిజర్వాయర్‌ కట్ట ఆధ్వాన పరిస్థితిని, రిజర్వాయర్‌ అభివృద్ధి చేస్తే జరిగే ప్రయో జనాలను సీఎం దృష్టికి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీసుకెళ్లారు. దీంతో అడిగిన వెంటనే సర్వేపల్లి రిజర్వాయర్‌ ఆధునికీకరణకు రూ.11.37 కోట్లు మంజూరు చేశారు. కాకాణి ఇరిగేషన్‌ అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహించి రిజర్వాయర్‌ పనులు వేగవంతంగా చేయాలని ఆదేశాలిస్తూ వచ్చారు.

ఫలితంగా మొత్తం 2000 మీటర్లు రిజర్వాయర్‌ కట్ట రివిట్‌మెంట్‌ చేయాల్సి ఉండగా ఇప్పటికే 1000 మీటర్లకుపైగా పనులు పూర్తయ్యా యి. అనికేపల్లి వద్ద కొత్త కలుజు నిర్మాణ పనులు పూర్తి చేశారు. రిజర్వాయర్‌ కట్ట పైభాగాన గ్రావెల్‌ రోడ్డు పనులు చేస్తున్నారు. రిజర్వాయర్‌ కట్ట కింద బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రబీ సీజన్‌లో రిజర్వాయర్‌ కింద ముమ్మరంగా వరినాట్లు సాగుతున్నాయి. ఏప్రిల్‌ రెండో వారానికి వ్యవసాయ పనులు ముగియనున్నాయి. వ్యవసాయ పనులు ముగిసిన రెండు నెలల్లో మిగిలిన రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనులు పూర్తి కానున్నాయి. ఆధునికీకరణ పనులు పూర్తయితే రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంచుకునే వెసులుబాటు కలిగి రెండు పంటలు పండించుకోవచ్చునని రైతులు సంతోషిస్తున్నారు. 

పటిష్టంగా ఆధునికీకరణ పనులు 
సర్వేపల్లి రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనులు చాలా పటిష్టంగా జరుగుతున్నాయి. రిజర్వాయర్‌ అభివృద్ధిని గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వహించాయి. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించారు. పనులు పూర్తయితే రైతులకు సాగునీటి కష్టాలు తీరుతాయి.
– ఆరుగుంట ప్రభాకర్‌రెడ్డి, మాజీ నీటిసంఘం అధ్యక్షుడు 

సాగునీటి కష్టాలు ఇక ఉండవు 
సర్వేపల్లి రిజర్వాయర్‌ అధునికీకరణకు మంత్రి కాకాణి నిధులు మంజూరు చేయించి, శరవేగంగా పనులు చేయిస్తున్నారు. దశాబ్దాల తర్వాత రిజర్వాయర్‌ పటిష్టతకు ప్రభుత్వం పూనుకుంది. గతంలో దివంగత వైఎస్సార్, ఇప్ప్పుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యాన రిజర్వాయర్‌కు పూర్వ వైభవం రానుంది. 
– తాళ్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, సర్వేపల్లి 

త్వరితగతిన పనులు పూర్తి 
సర్వేపల్లి రిజర్వా యర్‌ ఆధునికీకరణ పనులను త్వరితగతిన పూర్తికానున్నాయి. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. రబీ సీజన్‌ పనులు ముగిసిన రెండు నెలల్లోపు మిగతా పనులు పూర్తి కానున్నాయి. రిజర్వాయర్‌ కట్ట రివిట్‌మెంట్‌ పనులు చాలా పటిష్టంగా జరుగుతున్నాయి. 
– ప్రసాద్, ఇరిగేషన్‌ ఏఈ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement