సాక్షి, నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారని, ఆయన నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. విచారణ జరిపి తనపై తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి పేర్కొన్నారు.
కోటంరెడ్డి మాట్లాడుతూ... ‘ఎంపీడీవో సరళ నాపై అసత్య ఆరోపణలతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయన మాటలకు నేను గౌరవం ఇస్తున్నా, హర్షిస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వో, ఐపీఎస్ అధికారులపై దాడి చేస్తే రాజీ చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రమాణాన్ని తూచా తప్పకుండా పాటించారు. మాది నిజమైన ప్రభుత్వం.
జిల్లా ఎస్పీకి నాకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. అది నా దురదృష్టం. నాలుగు రోజుల క్రితం కలెక్టర్‌కి ఎస్పీపై ఫిర్యాదు చేశా. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి చెబితే ఎస్పీ వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారు. అర్థరాత్రి నా ఇంటిపై, నా అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి ఇళ్లపై దాడులు చేసి ఇబ్బంది పెట్టారు. విచారణలో నా తప్పు ఉందని తెలిస్తే ఎంపీడీవో సరళకు బహిరంగంగా క్షమాపణ చెబుతా. అంతేకాదు నాపై ఆరోపణలు రుజువు అయితే షోకాజ్ నోటీసులు కాదు..ఏకంగా పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయండి.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment