సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచకప్‌లోకి భారత జట్టు సెమీ ఫైనల్స్‌కు ప్రవేశించడంతో క్రికెట్ అభిమానుల్లోనే కాదు.. బెట్టింగ్‌రాయుళ్లల్లోనూ జోష్ పెంచింది. ఈ క్రేజ్‌కు క్యాష్ చేసుకోవడానికి బుకీలు కొత్త ‘అవతారాల్లో’ రంగంలోకి దిగినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి చెక్ చెప్పడానికి నిఘా ముమ్మరం చేశారు. గతంలో బెట్టింగ్ కేసుల్లో అరెస్టయిన వారి వివరాలు, కదలికలనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. నగరానికి చెందిన అనేక మంది బుకీలు ఇటీవల తమ పంథా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఒకప్పుడు వీరంతా నగరంలోనే ఉండి నేరుగా పందేలు కాసేవాళ్లతో (పంటర్లు) సంబంధాలు ఏర్పాటు చేసుకునే వాళ్లు. ఇలా చేయడంతో పోలీసులు దాడి చేసినప్పుడు పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. దీంతో కొందరు కీలక బుకీలు ఇటీవల కాలంలో తమ పంథా మార్చారు. ముంబై, గోవా తదితర ప్రాంతాల్లో వాళ్లు మకాం వేశారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్స్‌తో పాటు వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా గ్రూపుల ద్వారా బెట్టింగ్స్‌ను పర్యవేక్షిస్తున్నారు.
వీరివద్ద పందేలు కాసే పంటర్లు సుపరిచితులే. దీంతో ఫోన్ల ద్వారా పందేలను అంగీకరిస్తున్నారు. ఓడిన వారి నుంచి డబ్బు వసూలు చేయడం, గెలిచిన వారికి అప్పగించడానికి ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరు మాత్రమే నగరంలో ఉంటూ ప్రధాన బుకీలకు సహకరిస్తుంటారు. పోలీసులకు వీళ్లు చిక్కుతున్నా అనేక సందర్భాల్లో సూత్రధారులు పట్టుబడట్లేదు. క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ముందస్తు పందాల కంటే ఇటీవల కాలంలో లైవ్ బెట్టింగ్‌లు పెరిగాయని పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్‌లో ఫలానా జట్టు గెలుస్తుందని, ఇన్ని పరుగులు చేస్తుందని, ఓడిపోయే జట్టు ఇన్ని పరుగులకే కట్టడి అవుతుందని.. ఈ పంథాలో జరిగేవి ముందస్తు పందేల కిందికి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత రేషియో ఆధారంగా బంతి బంతికీ జరిగే పందేలను లైవ్ బెట్టింగ్‌లుగా పరిగణిస్తుంటారు. యాప్స్ ఆధారంగా బెట్టింగ్ దందా నిర్వహించే బుకీలు ఈ తరహాకే ఎక్కువ ప్రాధాన్యమస్తారని చెబుతున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. నగరంలో బెట్టింగ్ నిర్వహణకు, ఏజెంట్ల కదలికలను ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని మోహరించారు. గతంలో బెట్టింగ్ కేసుల్లో అరెస్టయిన వ్యక్తులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment