డిన్నర్‌లో మత్తు మందు ఇచ్చి.. భారీ చోరీ | Nepal Gang Robbery In BN Reddy Hills Raidurgam In Hderabad | Sakshi
Sakshi News home page

డిన్నర్‌లో మత్తు మందు.. నేపాల్‌ గ్యాంగ్‌ చోరీ

Published Wed, Oct 7 2020 8:52 AM | Last Updated on Wed, Oct 7 2020 9:04 AM

Nepal Gang Robbery In BN Reddy Hills Raidurgam In Hderabad - Sakshi

చోరీ జరిగిన మధుసూదన్‌ రెడ్డి నివాసం, సర్వెంట్‌ క్వార్టర్‌ను పరిశీలిస్తున్న మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు

సాక్షి, గచ్చిబౌలి: కూర, గ్రీన్‌ టీలో మత్తు మందు కలిపిన నేపాల్‌ గ్యాంగ్‌ భారీ చోరీకి పాల్పడింది. రూ.15.10 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో ఉడాయించింది. మత్తు నుంచి 11 గంటల తర్వాత తేరుకున్న ఐదేళ్ల బాలుడు అయాన్‌ నాన్నమ్మకు కట్టిన తాళ్లను కత్తిరించడంతో ఆ కుటుంబం ప్రాణాపాయం నుంచి బయటపడింది. సోమవారం రాత్రి రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బీఎన్‌ రెడ్డి హిల్స్‌లో చోటుచేసుకున్న ఘటన వివరాలను మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు  వెల్లడించారు. చౌటుప్పల్‌కు చెందిన బోర్‌వెల్‌ వ్యాపారి గూడూరు మధుసూదన్‌ రెడ్డి, శైలజ దంపతులు కుమారుడు నితీష్‌రెడ్డి, కోడలు దీప్తి, అయిదేళ్ల మనవడు అయాన్‌ రెడ్డితో కలిసి బీఎన్‌ రెడ్డి హిల్స్‌లో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం నవీన్‌ అనే మధ్యవర్తి ద్వారా నేపాల్‌కు చెందిన రవి అలియాస్‌ రాజేందర్, అతని చెల్లెలు సీతతో కలిసి మధుసూధన్‌రెడ్డి ఇంట్లో హౌస్‌కీపింగ్‌ పనుల్లో చేరారు. రవి ద్వారా 15 రోజుల క్రితం నేపాల్‌కు చెందిన మనోజ్‌ క్లీనింగ్, అతని భార్య జానకి వంట మనిషిగా చేరారు. అక్కడే సెల్లార్‌లోని సర్వెంట్‌ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు.  

పప్పులో కలిపి.. 

  •  సోమవారం రాత్రి డిన్నర్‌ కోసం రైస్, చపాతి, పప్పు రెడీ చేశారు. పప్పులో మత్తు మందు కలిపారు. రాత్రి 8 గంటలకు మధుసూదన్‌ రెడ్డి, నితీష్, దీప్తి, అయాన్‌ పప్పుతో రైస్, చపాతి తిన్నారు.  
  • శైలజ మాత్రం ఉదయం వండిన కూరతో చపాతి తిన్నారు. దీంతో శైలజకు నిందితులు గ్రీన్‌ టీలో మత్తు మందు కలిపి ఇచ్చారు. అరగంట తర్వాత అందరూ స్పృహ తప్పారు. మధుసూదన్‌రెడ్డి బాత్రూంలో పడిపోయారు.  
  • ఆయన కుమారుడు, కోడలు, మనవడు బెడ్రూంలో పడిపోయారు. శైలజ హాల్‌లోని కుర్చీలోనే కూర్చుని స్వల్పంగా స్పృహ తప్పారు. ఆమెను నిందితులు కుర్చీకి తాళ్లతో కట్టి, బెదిరించి వివరాలు తెలుసుకుని రూ.15.10 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు చోరీ చేశారు.  
  • సెల్లార్‌లో ఉన్న శునకానికికూడా పెరుగన్నంలో మత్తు మందు కలిపిపెట్టారు. సర్వెంట్‌ క్వార్టర్‌ వద్ద ఓ లాకర్‌ను పగలగొట్టడంతో పాటు సీసీ టీవీ ఫుటేజీని తీసుకొని ఉడాయించారు. ఈ ఘటన రాత్రి 9 నుంచి 10 గంటలలోపే చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  

అయాన్‌ తేరుకుని.. 

  • మంగళవారం ఉదయం 7 గంటలకు అయాన్‌ తేరుకొని నాన్నమ్మ శైలజ వద్దకు వచ్చాడు.  ఆమెకు ఉన్న తాళ్లను నాన్నమ్మ చెప్పినవిధంగా కత్తిరించాడు.  
  • వారు బయటికొచ్చి సమీపంలోని సైట్‌ వద్ద ఉన్న వాచ్‌మన్‌ రాములును పిలిచి విషయం చెప్పారు. అతను.. శైలజ బంధువులు సూర్యారెడ్డి, ఆనంద్‌రెడ్డిలను తీసుకొచ్చాడు. అనంతరం 100కు కాల్‌ చేసి సమాచారమిచ్చారు.  
  • మధుసూదన్‌ రెడ్డితో పాటు కొడుకు, కోడలు, మనవడిని కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. మధుసూదన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని, మిగతావారు కోలుకుంటున్నట్లు డీసీపీ చెప్పారు.  

నిందితులు ఏడుగురు.. 

  • పక్కా ప్లాన్‌నే నేపాల్‌ గ్యాంగ్‌ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. మొదట పనిలో చేసిన రవి ఆ తర్వాత సీతను పనిలో పెట్టించాడు. చోరీ చేయాలని ప్లాన్‌ చేసుకున్న తర్వాత మనోజ్, జానకిలను చేర్పించాడు.  
  • చోరీ సమయంలో వీరితో పాటు మరో ముగ్గురు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సమీప రోడ్లపై ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.  

ట్యాబ్లెట్ల పౌడర్‌ కలిపి ఉండొచ్చు..

  • నిందితులు మత్తునిచ్చే ట్యాబ్లెట్ల పౌడర్‌.. కూర, గ్రీన్‌ టీలో కలిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత నిందితులు వేర్వేరుగా నడుచుకుంటూ వెళ్లినట్లు వారు నిర్ధారణకు వచ్చారు.  
  • సెల్‌ఫోన్‌ నంబర్ల లొకేషన్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 44, 45 వరకు చూపించిందని పోలీసులు తెలిపారు. సంవత్సరం క్రితం శామీర్‌పేట్‌ పీఎస్‌ పరిధిలో, గత జనవరిలో నార్సింగి పీఎస్‌ పరిధిలో నేపాల్‌ గ్యాంగ్‌ ఇదే తరహాలో చోరీ పాల్పడినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. 
  • తాజా చోరీ కేసులోనూ పాత నేరస్తులు ఉండే అవకాశం ఉందనే కోణంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. 

ముమైత్‌ ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు 
పంజగుట్ట: సినీ నటి మొమైత్‌ ఖాన్‌ ఒప్పందం ప్రకారం తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని ఓ క్యాబ్‌ డ్రైవర్‌ మంగళవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .. గత నెల 16న సినీ నటి మొమైత్‌ ఖాన్‌ కొంపల్లికి చెందిన రాజును సంప్రదించి గోవాకు వెళ్లాలని నాలుగు రోజులకు గాను రూ.22 వేలు చెల్లించేలా, రూ. 1500 బత్తా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ప్రకారం నాలుగు రోజులు కాకుండా మరో నాలుగు రోజులు అదనంగా ఉందని, అదనంగా ఉన్న రోజులకు డబ్బులు చెల్లించాలని కోరగా ఇవ్వకపోగా తనను బెదిరిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.  

గోవా అడ్డాగా ఐపీఎల్‌ బెట్టింగ్‌! 
సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌ సీజన్‌ నేపథ్యంలో క్రికెట్‌ బెట్టింగ్స్‌పై రాజధానిలో పోలీసుల నిఘా పెరిగింది. నగరంలో టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్, రాచకొండల్లో స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన బుకీలు ఇతర మెట్రో నగరాలను అడ్డాగా చేసుకుని తమ దందా కొనసాగిస్తున్నారు. గోవా కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్న ముగ్గురు హైదరాబాదీలను అక్కడి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు పట్టుకున్నారు. మోర్జిమ్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌పై సోమవారం దాడి చేసిన ప్రత్యేక బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. 

ప్రత్యేక యాప్‌తో బెట్టింగ్స్‌
ఈ త్రయం బెట్టింగ్స్‌ నిర్వహణకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన యాప్‌ వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన సందీప్‌ పటేల్, కృష్ణకాంత్, భోజ భూపాల్‌ యాదవ్‌ క్రికెట్‌ బుకీలుగా మారారు. కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్న వీరు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ, ఎలాంటి మ్యాచ్‌లు జరుగుతున్నా తమ ‘పని’ ప్రారంభిస్తూ ఉంటారు. అయితే పోలీసుల నిఘా తప్పించుకునేందుకు వివిధ నగరాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకునే వీరికి దేశ వ్యాప్తంగా అనేక మంది పంటర్లతో (పందాలు కాసేవారు) సంబంధాలు ఉన్నాయి. లావాదేవీలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కూడిన బెట్టింగ్‌ యాప్‌ ద్వారా నిర్వహిస్తున్నారు.

పంటర్లకు యూజర్‌ ఐడీ
ఆన్‌లైన్‌ ద్వారానే పరిచయమైన పంటర్లకు ప్రత్యేక యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కేటాయిస్తున్న వీరు అతడితో ఆన్‌లైన్‌లోనే బెట్టింగ్‌ కాయిస్తున్నారు. నగదు లావాదేవీలను వివిధ ఈ–వాలెట్స్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రతి బాల్‌కు సంబంధించిన మ్యాచ్‌ వివరాలు, బెట్టింగ్‌ రేష్యో తదితరాలను ఆ యాప్‌ వీరికి అందిస్తూ ఉంటుంది. ఈ వ్యవహారాల్లో తమకు సహకరించడానికి వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు.

నెల రోజులుగా గోవాలో మకాం
నెల రోజుల క్రితం గోవా వెళ్లిన వీరు మోర్జిమ్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో టూరిస్టుల ముసుగులో బస చేశారు. ఐపీఎల్‌ మొదలైన నాటి నుంచి పందాలు నిర్వహిస్తున్నారు. దీనిపై అక్కడి క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులకు సోమవారం సమాచారం అందడంతో దాడి చేసిన అధికారులు ముగ్గురినీ అరెస్టు చేసి, సాఫ్ట్‌వేర్, యాప్‌లతో కూడిన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. గోవాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, లాడ్జిల్లో ఇలాంటి ముఠాలు మరికొన్ని మకాం వేశాయని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై కన్నేసి ఉంచడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గోవాలో హైదరాబాద్‌కు చెందిన సందీప్‌ పటేల్, కృష్ణకాంత్, భోజ భూపాల్‌ యాదవ్‌ అరెస్టు అయిన విషయాన్ని తెలుసుకున్న ఇక్కడి పోలీసులు స్థానికంగా వీరి వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు.  

బహుమతులిస్తాడు...ఆ తర్వాత దోచేస్తాడు 
సాక్షి, హైదరాబాద్‌: వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని అమ్మాయిలను నమ్మించి బహూమతులతో వారిని మెప్పించి...అవసరమైతే వివాహేతర సంబంధం కొనసాగించి మరీ ఆ తర్వాత బంగారు ఆభరణాలతో ఉడాయిస్తున్న కరుడుగట్టిన నేరగాడిని మాదాపూర్‌  ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇతడి అరెస్టుతో సైబరాబాద్‌తో పాటు ఏపీ, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో 12 కేసులు ఛేదించినట్లయ్యింది. ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సందీప్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, టంగుటూరు శివాలయం వీధికి చెందిన అబ్దూరి సోమయ్య అలియాస్‌ సోమయ్య చౌదరి అలియాస్‌ అక్కినేని కార్తీక్‌ దారి మళ్లించి సొత్తు దోచుకోవడంలో దిట్ట. సైబరాబాద్‌తో పాటు, ఏపీ, గోవా, తమిళనాడు ప్రాంతాల్లో 12 దొంగతనాలు చేశాడు.  

లగ్జరీ హోటల్స్‌లో మకాం.. 
తరచూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే సోమయ్య మాదాపూర్, గచ్చిబౌలిలోని లగ్జరీహోటల్స్, గెస్ట్‌ హౌస్‌లలో బస చేసేవాడు ఉండేవాడు. అక్కడికి వచ్చే యువతులతో వ్యాపారవేత్తగా పరిచయం చేసుకునేవాడు. అనంతరం వారితో సన్నిహితంగా ఉంటూ బహుమతులు ఇచ్చేవాడు. కొన్నిసార్లు వివాహేతర సంబంధం కూడా కొనసాగించేవాడు. అనంతరం అదను చూసుకుని వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను కొట్టేసేవాడు. 

సొంతూరికెళ్లి జల్సాలు

  • తన సొంతూరుకు వెళ్లి చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు.  ఇతని నేరాలపై మాదాపూర్‌ ఠాణాలో ఫిర్యాదు అందడంతో ఎస్‌ఓటీ బృందం  రంగంలోకి దిగింది. టెక్నికల్‌ డాటాతో అతనిపై నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు మంగళవారం నగరానికి వచ్చిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. 
  • నిందితుడి నుంచి 12 కేసులకు సంబంధించి రూ.36 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం మాదాపూర్‌ పోలీసులకు అప్పగించారు. 
  • సోమయ్యపై గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 80 కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో స్థానిక పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
  • అయినా అతని బుద్ధి కూడా మారలేదని, మళ్లీ దొంగతనాల బాట పట్టినట్లు అదనపు డీసీపీ తెలిపారు. అతడిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌తో పాటు సిబ్బందిని రివార్డులతో సత్కరించారు.  

సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ గ్యాంగ్‌కు చెక్‌ 
సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని రద్దీ మార్కెట్లను టార్గెట్‌గా చేసుకుని సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాకు మొఘల్‌పుర పోలీసులు చెక్‌ చెప్పారు. ఈ గ్యాంగ్‌ సూత్రధారి పరారీలో ఉండగా పాత్రధారులైన ఐదుగురిని పట్టుకున్నామని, వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. దక్షిణ మండల డీసీపీ గజరావ్‌ భూపాల్‌తో కలిసి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. 

  • అబ్దుల్లాపూర్‌ మెట్‌ ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌ నగరంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బండి రాము, అక్షింతల కళ్యాణ్, మేకల జగపతి బాబు, తోట పోతురాజు, రామ్‌ చంద్ర ప్రధాన్, సహా ఇద్దరు మైనర్లతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ప్రశాంత్‌ ఆదేశాల మేరకు వీరు రద్దీగా ఉన్న మార్కెట్లు, ఇతర ప్రాంతాలకు వెళతారు. టార్గెట్‌గా చేసుకున్న వ్యక్తి చుట్టూ చేరే ఈ ముఠా అతడి దృష్టిని మళ్లిస్తుంది. మిగిలిన వారు అదును చూసుకుని అతడి జేబులోని సెల్‌ఫోన్‌ తస్కరిస్తారు. దొంగతనం చేసిన ఫోన్‌ను వీరు నేరుగా ప్రశాంత్‌కు అప్పగిస్తారు. 
  • అతగాడు దానిని విక్రయించగా వచ్చిన సొమ్ములో కొంత మొత్తం ముఠా సభ్యులకు ఇచ్చేవాడు. వీరు ఇదే పంథాలో నగర వ్యాప్తంగా 26 చోరీలు చేశారు. ఈ గ్యాంగ్‌ వ్యవహారాలపై పాతబస్తీలోని మొఘల్‌పుర పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు సూత్రధారి మినహా మిగిలిన వారిని పట్టుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement