‘వర్మ కంపెనీ’ పేరుతో బెట్టింగ్‌ నిర్వహణ | Cricket Betting Gang Arrest In YSR Kadapa | Sakshi
Sakshi News home page

గుమాస్తాల నుంచి క్రికెట్‌ బుకీల దాకా

Published Tue, May 29 2018 11:49 AM | Last Updated on Tue, May 29 2018 11:49 AM

Cricket Betting Gang Arrest In YSR Kadapa - Sakshi

నిందితుల వివరాలను తెలియజేస్తున్న జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి , స్వాధీనం చేసుకున్న కారు

కడప అర్బన్‌ : అంతర్‌రాష్ట్ర క్రికెట్‌ బుకీలుగా ఎదిగిన ఇద్దరు రాష్ట్రంలోని పలు జిల్లాల వారికి మోస్ట్‌ వాం టెడ్‌గా ఉన్నారు.  కడప తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఐసీఎల్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ఈనెల 27న లైవ్‌లో చూస్తూ బెట్టింగ్‌కు నిర్వహిస్తూ పోలీ సులకు చిక్కారు.రూ. 60 లక్షల మేరకు విలువైన నగదు, కారు, ఇతర సామగ్రితో పట్టుబడ్డారు. వీరు సాధారణ గుమాస్తాలుగా తమ జీవితాలను ప్రారంభించి  ‘వర్మ కంపెనీ’ పేరుతో రూ. 15 కోట్లు ఇప్పటి వరకు బెట్టింగ్‌లకు పాల్పడి విలాసవంతమైన జీవితాలను గడిపారు. వీరి కోసం కడప పోలీసులతో పాటు, హైదరాబాద్, అనంతపురం, ధర్మవరం, పశ్చిగోదావరి, నెల్లూరు జిల్లా పోలీసులు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు.

పోలీసుల విచారణలో వెల్లడైన విషయాలివి..
వర్మ కంపెనీ వ్యవస్థాపక, నిర్వాహకుడుగా వ్యవహరిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ముదునూరి అశోక్‌ వర్మ అలియాస్‌ వర్మ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ ఒక కన్‌స్ట్రక్షన్‌ సంస్థలో గుమాస్తాగా ఉద్యోగంలో చేరాడు. 2013లో ఒక క్రికెట్‌ బుకీ పరిచయమయ్యాడు. అతని వద్ద గుమాస్తాగా చేరి బెట్టింగ్‌ చేయడంలో నైపుణ్యం సంపాదించాడు. తర్వాత 2016లో ప్రొద్దుటూరుకు చెందిన ప్రధాన బుకీతో పరిచయం ఏర్పడింది. అతనితోపాటు, మరికొందరితో కలిసి ‘వర్మ కంపెనీనీ ఏర్పాటు చేశాడు. అంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లోని వందల మంది సబ్‌ బుకీల  ద్వారా పంటర్లను  (బెట్టింగ్‌ ఆడేవారు)  దించి వారి ద్వారా బెట్టింగ్‌ జరుపుతున్నాడు. తద్వారా సంపాదించిన సొమ్ముతో హైదరాబాదు, విజయవాడల్లో ఆస్తులు సంపాదించినట్లు విచారణలో తేలింది. ఇతనిపై కడప, నెల్లూరు, అనంతపురం, ధర్మవరంలలో క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులు కలవు. ఇతన్ని అరెస్టు చేసేందుకు హైదరాబాద్, అనంతపురం, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల పోలీసులు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన పెన్మస్థ రవివర్మ అలియాస్‌ రవి పదవ తరగతి వరకు చదువుకుని అదే గ్రామంలో ఎరువుల దుకాణంలో గుమస్తాగా చేరాడు. తర్వాత 2014లో క్రికెట్‌ బుకీతో పరిచయం ఏర్పడి అతని వద్ద గుమాస్తాగా చేరి బెట్టింగ్‌ చేయడంలో నైపుణ్యం సంపాదించాడు. 2016లో అశోక్‌వర్మ ప్రొద్దుటూరుకు చెందిన ప్రధాన బుకీతో పరిచయమై వర్మ కంపెనీలో  బెట్టింగ్‌ వివరాలు చేసేవాడు. ఇందుకుగాను ఇతనికి సంస్థ ద్వారా నెలకు రూ. 1.50 లక్షల జీతం, సంస్థ ఆదాయంలో కొంత వాటా ఇస్తారు. ఇతనిపై కడప, అనంతపురం, ధర్మవరంలలో క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులు ఉన్నాయి.

గంజాయి వ్యాపారం కూడా...
క్రికెట్‌ మ్యాచ్‌లలో హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం, బెంగళూరు, గోవా, కడప, ప్రొద్దుటూరులలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని అమాయకులు, విద్యార్థులను బెట్టింగ్‌ కూపంలోకి దించి వారిని మోసం చేసి పెద్ద మొత్తంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో గంజా యి వ్యాపారం కూడా చేస్తున్నట్లు తెలిసింది. వీరికి ప్రొద్దుటూరు, భీమవరం, గుంటూరు, హైదరాబాద్‌లకు చెందిన మరికొందరు ప్రధాన బుకీలతో, మహరాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఉండే బెట్టింగ్‌ దందా నడిపించే సేట్‌లతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. వీరద్దరూ ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ. 15 కోట్లు బెట్టింగ్‌ లావాదేవీలు జరిపినట్లు, గెలిచిన, ఓడిపోయిన వారికి మద్య లావాదేవీలను హవాలా మార్గం ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నట్లు, బెట్టింగ్‌ ద్వారా సంపాదించిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాలను గడుపుతూ జల్సాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసింది.

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చూస్తూ బెట్టింగ్‌..
అశోక్‌వర్మ,  రవివర్మ  కడప తాలూకా పోలీసుస్టేషన్‌ పరిధిలోని అక్కాయపల్లెలో ఒక అద్దె ఇంటి ఆవరణంలో  ఆదివారం సాయంత్రం   చెన్నై సూపర్‌కింగ్స్‌ వర్సెస్‌ సన్‌ రైజర్స్‌ జట్ల మధ్య జరిగిన లైవ్‌ మ్యాచ్‌ను టీవీలో చూస్తూ బెట్టింగ్‌లను కాశారని, 26 సెల్‌ఫోన్లు కలిగిన కమ్యూనికేటర్‌ ద్వారా, ఆరు సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ అందులోని అప్లికేషన్స్‌ ద్వారా బెట్టింగ్‌ రేటు తెలుపుతూ ల్యాప్‌టాప్‌లో సాఫ్ట్‌వేర్‌ ద్వారా వివరాలు నమోదు చేసుకుంటూ ఉండగా సమాచారం అందిందని జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి విలేకరులకు తెలిపారు. సోమవారం   విలేకరుల ఎదుట అరెస్టు అయిన  బుకీలను హాజరు పరిచారు.ఎస్పీ బాబూజీ అట్టాడ ఆదేశాల మేరకు సీసీఎస్‌ డీఎస్పీ జి.నాగేశ్వర్‌రెడ్డి, కడప డీఎస్పీ షేక్‌ మాసుంబాష, అర్బన్‌ సీఐ దారెడ్డి భాస్కర్‌రెడ్డి, తాలూకా ఎస్‌ఐ ఎన్‌.రాజరాజేశ్వర్‌రెడ్డి, సీసీఎస్‌ ఎస్‌ఐ రాజారెడ్డి, సిబ్బందితో కలిసి నిందితులను అరెస్టు చేశారన్నారు. వారి వద్ద నుంచి రూ. 35,05,000 నగదు, 26 సెల్‌ఫోన్లు కలిగిన కమ్యూనికేటర్, ల్యాప్‌టాప్, ఆరు సెల్‌ఫోన్లు, టీవీ, కారు, నాలుగు కిలోల గంజాయి, బెట్టింగ్‌కు సంబంధించిన ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారన్నారు. ఈ సంఘటనలో నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన డీఎస్పీలు, సీఐ, ఎస్‌ఐలు, తాలూకా ఏఎస్‌ఐ వర్మ, హెడ్‌ కానిస్టేబుల్‌ మురళి, కానిస్టేబుళ్లు శివప్రసాద్, కిరణ్‌బాబు, సురేష్‌రెడ్డి, సుబ్బయ్య, సీసీఎస్‌ సిబ్బంది ఏఎస్‌ఐ మల్లయ్య, హెడ్‌ కానిస్టేబుల్‌ విశ్వనాథరెడ్డి, కానిస్టేబుళ్లు సుధాకర్‌రెడ్డి, ప్రభు, బాష, హోం గార్డు నాయక్‌లను ఆయన అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement