ప్రభుత్వం మాదే.. మాకేమీ కాదు
సాక్షి టాస్క్ ఫోర్స్: ‘అధికారం మాదే. మా ఇష్టమొచ్చినట్లు మైనింగ్ చేస్తాం. సీసీ కెమెరాలు బిగిస్తే ఊరుకోం.. చెప్పినట్లు వినకుంటే తలకాయలు తీస్తాం. ప్రభుత్వం మాదే, మాకేమీ కాదు’.. అంటూ ఓ గ్యాంగ్ సోమవారం వైఎస్సార్ జిల్లా వేముల మండలంలో హల్‌చల్ చేసింది. అక్రమ మైనింగ్ నుంచి స్వీయ రక్షణ కోసం సంస్థ సూపర్‌వైజర్లు సీసీ కెమెరాలు బిగిస్తుంటే వారొచ్చి రెచి్చపోయారు. ‘చరిత్ర తెలుసుకుని మసలుకోండి. మీరేమన్నా పెద్ద మొనగాళ్లా’.. అంటూ మండల తెలుగు తమ్ముళ్లు పేర్ల శేషారెడ్డి, రామిరెడ్డి, ధనుంజయ, శివ అండ్ గ్యాంగ్ చెలరేగిపోయారు. బాధితుల కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా వేముల మండల కేంద్రంలో టిఫెన్ బెరైటీస్ కంపెనీ లీజుకింద మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆ పార్టీ నేతలు ఆ కంపెనీ పరిధిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
దీంతో.. లీజు ప్రాంతంలో నిరంతరం కాపాలా ఉండేలా టిఫెన్ బెరైటీస్ కంపెనీ ఐదుగురు సూపర్‌వైజర్లను నియమించుకుంది. అక్రమ కార్యకలాపాల నుంచి స్వీయ రక్షణ కోసం సోమవారం సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. ఇది తెలుసుకున్న స్థానిక టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి సోదరుడు శేషారెడ్డి రెండు వాహనాల్లో తన అనుచరులతో వెళ్లి నానాయాగీ చేశారు. సీసీ కెమెరాలు బిగించవద్దని హెచ్చరించారు. మా ప్రాంగణంలో బిగించుకుంటున్నామని సూపర్‌వైజర్లు వివరిస్తుండగా.. ‘తలకాయలు తీసుకెళ్తాం, మాకేమి కాదు, ప్రభుత్వం మాదే, అటు వెళ్తాం, ఇటు వస్తాం’.. అంటూ కత్తులతో బెదిరించారు.
‘మాకు కేసులు కొత్త కాదు. జైలు జీవితం గడిపే వచ్చాం. మా ప్రభుత్వంలో ఎలాంటి అనుమతులు లేకపోయినా సరే, మేం మైనింగ్ చేసుకుంటాం. మీరెవరు అడ్డుచెప్పడానికి’.. అంటూ తెలుగు తమ్ముళ్లు రెచి్చపోయారు. చివరికి.. సీసీ కెమెరాలు అమర్చనీయకుండా అడ్డుకుని వెనక్కి పంపేశారు. పైగా.. ఇక్కడ కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో.. యాజమాన్య ప్రతినిధుల సూచనల మేరకు సూపర్‌వైజర్లు వేముల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పనులు అడ్డుకున్నారు.. టిఫెన్ బెరైటీస్ కంపెనీ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు వెళ్లాం. అక్కడికి శేషా రెడ్డితో పాటు మరి కొందరు టీడీపీ కార్యకర్తలు వచ్చి దౌర్జన్యం చేశారు. సీసీ కెమెరాల పనులను అడ్డుకున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటుచెయ్యొద్దని హెచ్చరిస్తూ మమ్మల్ని వెనక్కి పంపేశారు. – రామాంజనేయరెడ్డి (కంపెనీ సూపర్‌వైజర్), వేల్పుల
దాడి చేసేందుకు యత్నం..
అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు మా కంపెనీ ప్రాంగణంలో సీసీ కెమెరాలు బిగించేందుకు వెళ్లాం. కత్తులతో వచ్చిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేయబోయారు. ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తే సహించేదిలేదు.. ఇకపై మీరిక్కడ కనిపించకూడదు.. కనిపిస్తే తీవ్ర పరిణమాలుంటాయని హెచ్చరించారు. – నాగేంద్రారెడ్డి (కంపెనీ సూపర్‌వైజర్), చింతలజూటూరు
Comments
Please login to add a commentAdd a comment