
వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో పర్యటించారు.
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో పర్యటించారు. భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో ఆయన మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో కూడా చర్చించారు.
కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు. అంతకుముందు పులివెందులలో దారిపొడవునా తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ, ఆగి పలకరిస్తూ, వారి వినతులు స్వీకరిస్తూ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఇవాళ ఉదయం ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేంపల్లిలో వైఎస్సార్‌సీపీ నేత రుద్ర భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: గురి తప్పిన బాణం వెనుక..!