సాక్షి, వైఎస్సార్: ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది. కూటమి పాలనలో కక్షసాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంలో వర్రా రవీంద్రారెడ్డి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడిని ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారనే వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఈరోజు తెల్లవారుజామున రవీంద్రారెడ్డి ఇంటిలో డీఎస్పీ సోదాలు నిర్వహించడంతో ఆయన కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు.
వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడనే నెపంతో వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి పోలీసు వాహనంలో అతడి వేరే చోటకు తరలించారు. అయితే, నిన్న రాత్రి రవీంద్రారెడ్డిని ఎక్కడ ఉంచారనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఇక, రవీంద్రారెడ్డిని పోలీసులు తీసుకెళ్లిన వెంటనే గుర్తు తెలియని ఓ ముఠా రంగంలోకి దిగింది. రవీంద్రారెడ్డి గురించి ప్రశ్నిస్తున్న వారిపై సదరు ముఠా దాడులు చేస్తోంది.
పోలీసులు అక్రమంగా రవీంద్రారెడ్డి తీసుకెళ్లడంతో అతడికి జామీను ఇచ్చేందుకు వేముల మండలం పెండ్లూరు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి పోలీసులు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పీఎస్ వద్ద గుర్తు తెలియని ముఠా.. మహేశ్వర్ రెడ్డిపై దాడి చేసింది. ఆయనపై చేయి చేసుకున్నారు. రాత్రి నుంచి మహేశ్వర్ రెడ్డి ఆచూకీ కూడా తెలియడం లేదు. అయితే, వారు పోలీసులా? లేక ప్రైవేటు వ్యక్తులా? అనేది అర్థం కాకుండా ఉంది.
ఇక, మంగళవారం రాత్రి నుంచి రవీంద్రారెడ్డిని ఏ పోలీసు స్టేషన్‌కు తరలించారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయి. కాగా, సోషల్ మీడియా పోస్టుల్లో 41ఏ నోటీసు ఇచ్చి వదిలేయాలని నిబంధన ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం నోటీసులను ఖాతరు చేయడం లేదు. మరోవైపు.. బుధవారం తెల్లవారుజామున రవీంద్రారెడ్డి ఇంటిలో డీఎస్పీ సోదాలు నిర్వహించారు. దీంతో, రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. రవీంద్రారెడ్డి, సర్పంచ్ మహేశ్వరరెడ్డి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment