MLA Adinarayana reddy
-
మంత్రి వర్సెస్ ఎంపీ..!
కడప: అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకొని రాజకీయంగా పైచేయి సాధించాలనే లక్ష్యం ఆ ఇద్దరు నేతల్లో దాగి ఉంది. ఈక్రమంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదుల కత్తులు దూస్తున్నారు. అధిష్టాన పెద్దలకు నిజాయతీగా పార్టీ ఉన్నతి కోసం కష్టపడుతున్నామని భ్రమ కల్పిస్తున్నారు. ఈక్రమంలో ఎవరికి వారు వ్యక్తిగత పరపతి కోసం తాపత్రయం చూపుతున్నారు. వారే జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి అనూహ్యంగా మంత్రి పదవి వరించింది. ఇకపై జిల్లాలో టీడీపీ మెరుగవుతుందని భావించిన అధిష్టానానికి అనతికాలంలోనే ‘కొరివితో తలగోక్కున్నామనే’ విషయం తేటతెల్లమైందని పరిశీలకుల భావన. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక అక్రమాల ఫలితం, ఎంపీ రమేష్ తోడ్పాటు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి వరించిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆపై జిల్లాలో రాజకీయ పెత్తనం తన ద్వారానే ఉండాలనే తాపత్రయం మంత్రి ఆదికి మొదలైందని పలువురు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఎస్పీ పీహెచ్‌డి రామకృష్ణ అవినీతికి పాల్పడుతున్నారని వివాదస్పద వ్యాఖ్యలు సైతం చేశారు. జిల్లాలో టీడీపీకి దశ–దిశ తానేనని చెప్పుకోవడం ఆరంభించారు. అధికారులపై, పార్టీపై పట్టు సాధించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఎంపీపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు.... ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మంత్రి అయ్యాక చతురత ప్రదర్శించే ఎత్తుగడ చాపకింద నీరులా వ్యవహరించసాగారని పలువురు పేర్కొంటున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో తన కంటే కాస్తా పైచేయిలో ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను కట్టడి చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఎంపీ రమేష్ చర్యల వల్ల టీడీపీ అప్రతిష్టపాలు అయ్యే అవకాశం ఉంది. అందుకు కారణం ‘గాలేరు–నగరి సుజల స్రవంతి’ పథకం పనులేనని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎం రమేష్ కాంట్రాక్టు సంస్థ పనులు తీసుకొని వాటిని పూర్తి చేయడం లేదని, రెండేళ్లుగా పురోగతి లేదని, తద్వారా జిల్లాలో జీఎన్ఎస్ఎస్ పెండింగ్‌లో ఉండిపోయిందని వివరించినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రాజెక్టు పట్ల శ్రద్దతో ఉన్న విషయం ఉత్తుత్తిదేనని ఎంపీ రమేష్ చర్యల వల్ల ప్రజలు భావిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి ఆది ఫిర్యాదుతో వెంటనే ముఖ్య మంత్రి చంద్రబాబు స్పందించి ఎంపీ రమేష్‌కు ఫోన్ చేసి జీఎన్ఎస్ఎస్ కాంట్రాక్టు పనులు గురించి ఆరా తీసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎంపీ రమేష్ జిల్లాకు చెందిన మంత్రి ఫిర్యాదు చేశారని తెలుసుకొని తనపైనే ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, నాకే స్వయంగా చెప్పిఉండొచ్చు కదా అని ప్రశ్నించినట్లు టీడీపీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. ఎంపీ ఇఫ్తార్‌కు మంత్రి గైర్హాజర్... రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ముస్లిం మైనార్టీలకు ప్రొద్దుటూరులో మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు హాజరయ్యారు. కాగా జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి ఆ కార్యక్రమానికి గైర్హాజర్ అయ్యారు. మంత్రి, ఎంపీ మధ్య విభేదాలు పొడచూపడంతోనే ఇఫ్తార్‌కు రాలేదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఎంపీ రమేష్ సైతం వ్యక్తిగత పరపతి కోసమే కేంద్ర మంత్రి పాల్గోనేలా వ్యవహరించారని పలువురు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రికి ఎంపీ రమేష్‌పై మంత్రి ఆది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎంపీ వర్గీయులు మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు సన్నహాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఆధారాలతో సహా నిరూపించేందుకు తెరవెనుక కసరత్తు ఆరంభించినట్లు సమాచారం. ఇటీవల ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో నిక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీపై ఆరోపణలు చేశారని, అలాగే జిల్లాలో మార్కెఫెడ్ యంత్రాంగంపై ఆరోపణలొస్తే మధ్య దళారుల ద్వారా పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారని పలు ఆరోపణలు సన్నద్ధం చేశారు. వీటన్నిటికి ఆధారాలు సమకూర్చి నేరుగా ముఖ్యమంత్రికి చేర్చాలనే దిశగా పావులు కదుపుతోన్నట్లు సమాచారం. పార్టీ ప్రయోజనాలకంటే వ్యక్తిగత ప్రయోజనాలకే మంత్రి ఆది ప్రాధాన్యత ఇస్తున్నారని రుజువు చేసేందుకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. -
శ్రీరంగ నీతులే...!
♦ చెప్పేదొకటి చేసేది మరొకటి ♦ ఎమ్మెల్యే పదవికి రాజీనామా గాలికి వదిలిన వైనం ♦ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలింతకు రెడీ... ♦ పీఆర్ పెద్దదండ్లూరు పర్యటన జీర్ణించుకోలేని పరిస్థితి ‘నోరు ఒకటి చెబితే.. చేతులు ఇంకొటి చేస్తాయి, దేని పని దానిదే’ ఇదీ ఓ సినిమాలో విలన్ డైలాగ్.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహార శైలి అచ్చం అలాగే కన్పిస్తోంది. రెండేళ్లుగా ఆయన మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. చెప్పేందుకే శ్రీరంగనీతులు.. అన్నట్లుగా ఆయన ధోరణి కన్పిస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: తాను ఏమి చేసినా పైచేయి సాధించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎవరిపైనయినా ఎలాంటి ఆరోపణలకైనా వెనుకాడడం లేదు. అందులో భాగంగానే తాజాగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన దివంగత సీఎం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులపై ఆరోపణలకు దిగినట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఆ మధ్య అనేకమార్లు ‘నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. పార్టీ మారాల్సి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారుతా. ఏదైనా చెప్పే చేస్తా. ఎమ్మెల్యే పదవి తోకతో సమానం.’ అంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రకటనలు చేశారు. చెప్పిన మాటను పక్కనెట్టి ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయకుండానే టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే డొల్లతనం అక్కడే బహిర్గతమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం కోసం పార్టీ ఫిరాయిస్తుంటే, పదవికి ఎలా రాజీనామా చేస్తారని పరిశీలకులు ముందే అంచనా వేశారు. అయినప్పటీకీ పదేపదే ఎమ్మెల్యే వ్యాఖ్యల నేపథ్యంలో నైతిక విలువలకు కట్టుబడి ఉంటారని ప్రజాస్వామ్యవాదులు ఆశించారు. అధికారం ముందు నైతికత బలాదూర్ అయ్యిందని ఆయన వ్యవహారంతో తేటతెల్లమైంది. ఎమ్మెల్యే తన వియ్యంకుడు ఆస్తులను కాపాడుకోవడమే లక్ష్యంగా పార్టీ ఫిరాయించారని రాజకీయ పరిశీలకులు అంచనాకు వచ్చారు. ఈక్రమంలో తన తప్పును కప్పిపుచ్చుకుంటూనే పైచేయి సాధించడమే లక్ష్యంగా అనేక ఆరోపణలు తెరలేపుతున్నట్లు పలువులు వివరిస్తున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని.... నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చెప్పుకొస్తున్నారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని కలుగోలుగా వెళ్లేందుకు అభ్యంతరం లేదని ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యే చర్యలు ‘నోటీతో చెప్పడం నొసలుతో వెక్కిరించడం’ అన్నట్లుగా ఉండిపోయాయని మాజీ మంత్రి పీఆర్ వర్గీయులు పేర్కొంటున్నారు. వాస్తవంగా కలుపుగోలుగా వెళ్లాలనే సదుద్దేశ్యమే ఉంటే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని పెద్దదండ్లూరుకు ఆహ్వానించిన జన్మభూమి కమిటీ సభ్యులపై దాడి జరిగిండేది కాదని వారు వివరిస్తున్నారు. అనేక విషయాలల్లో అదే ధోరణి తేటతెల్లం అవుతోందని పీఆర్ వర్గీయులు చెప్పుకొస్తున్నారు. కార్యకర్తల సమావేశం ఉదయం పూట నిర్వహించేందుకు సన్నాహాలు చేసి కూడా, సాయంత్రం హాజరు కావాల్సిందిగా పీఆర్ వర్గీయులకు సెల్ మెసేజ్‌లు పంపారని పలువురు చెప్పుకొస్తున్నారు. ఆమేరకే టీడీపీ నేత పీఆర్ వర్గీయులు కార్యకర్తల సమావేశానికి గైర్హాజరయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రతిఘటన జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి ఎదురుగా ప్రశ్నించే కార్యకర్తలు బహుఅరుదు. అలాంటిది బుధవారం కార్యకర్తల నుంచి ప్రతిఘటన నెలకొంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబసభ్యులపై ఆరోపణలు, దూషణల నేపథ్యంలోనే సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు బాహాటంగా స్పందించారని తెలుస్తోంది. వైఎస్ కుటుంబ వల్లే ఎమ్మెల్యే కుటుంబం ఉన్నతస్థాయికి చేరిందన్న విషయాన్ని మర్చిపోవడమే అందుకు కారణంగా విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. పార్టీ ఫిరాయించే వరకూ ఎమ్మెల్యే పదవి తోకతో సమానమని చెప్పుకొచ్చిన ఆయన అనంతరం పదవికి రాజీనామా ఊసే ఎత్తడం లేదని పలువురు పేర్కొంటున్నారు. వైఎస్ కుటుంబం సహకారంతో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి శ్రమకోర్చి జమ్మలమడుగులో నిర్మించిన రాజకీయ పునాదులపై అత్యంత తెలివితేటలతో 2004 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి వచ్చి వాలిపోయారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఆపై వైఎస్ కుటుంబం మద్దతు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎంపిక కావడాన్ని కార్యకర్తల మదిలో తొలిగిపోలేదని పలువురు వివరిస్తున్నారు. ఆమేరకే ఎమ్మెల్యే అడ్డదడ్డంగా చేస్తున్న ఆరోపణలపై ప్రతిఘటిస్తున్నట్లు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. -
జమ్మలమడుగు టీడీపీలో ఆధిపత్యపోరు
జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. ఇటీవల పి.రామసుబ్బారెడ్డి గొరిగనూరు గ్రామంలో పర్యటించారు. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఇళ్లకు తాళాలు వేసుకుని నిరసన తెలిపారు. రామసుబ్బారెడ్డి పర్యటనపై ఎమ్మెల్యే ఆది కూడా తీవ్రంగా స్పందించారు. ఆయన తన గ్రామాల్లో కల్పించుకుంటున్నారని ఈ విషయంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పారు. నేతల ఆధిపత్య పోరుతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఏమి జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇరువర్గాల మధ్య వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. -
ఆయన మనుషులు... మమ్మల్ని చంపేస్తారు
► మాజీ మంత్రి పీఆర్ వర్గీయుల ఆందోళన ► కన్నీటిపర్యంతమైన అనుచరులు జమ్మలమడుగు: ‘వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు రామాంజనేయరెడ్డి ఆదివారం (పెద్దదండ్లూరు) ఊళ్లో పర్యటించారు. మా ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాలని మా ఆయన కోరాడు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కల్పించుకుని.. రోడ్డు, నీళ్ల ట్యాంకు మీ నాయన కట్టించినాడా అని అడిగాడు. ఆ ట్యాంకు మా కోసం కాదు.. పెద్ద రెడ్ల కోసం కట్టించారని మా ఆయన చెప్పాడ'ని దాడికి గురైన సుబ్బరాయుడు (గోపన్న) భార్య ఓలమ్మ.. మాజీ మంత్రి, టీడీపీ నేత పి.రామసుబ్బారెడ్డి(పీఆర్) ఎదుట వాపోయింది. ఇంకా ఆమె మాట్లాడుతూ..'దీంతో ఎమ్మెల్యే సోదరుడు రామాంజనేయులరెడ్డి మా ఆయన్ను దర్గా దగ్గర నుంచి చెప్పులతో కొట్టుకుంటూ వచ్చారు. మేము తక్కువ కులానికి చెందినవారం కాబట్టే దేవగుడి గ్రామంలో నుంచి ఐదు ట్రాక్టర్లలో జనాలను పిలుచుకుని వచ్చి మా వాళ్ల ఇండ్లపై దాడి చేశారు. మాకు కేసులు.. గీసులు వద్దు.. మీరు ఇప్పుడు మా ఇంటికి వచ్చినందున వాళ్లు మమ్మల్ని చంపడం ఖాయం. ఇక ఇక్కడ ఉండి పొలం పనులు చేసుకోలేమ’ని పి.రామసుబ్బారెడ్డి(పీఆర్)కు చెప్పింది. ఆదివారం పెద్దదండ్లూరులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయుల దాడికి గురైన బాధితులతో సోమవారం రామసుబ్బారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారి ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఆదివారం ట్రాక్టర్లలో జనాలు వచ్చి మా ఇంటి ఆవరణలో ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు. ట్రాక్టర్ ట్రాలీ కోసం ఉంచుకున్న రూ. 50 వేల డబ్బులను కూడా తీసుకెళ్లారు’ అంటూ మరో బాధితురాలు ప్రమీల ఆందోళన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ఎదుట ఎమ్మెల్యే సోదరునితో పాటు వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి కూడా నన్ను కొట్టాడు’ అని సుబ్బరాయుడు వివరించాడు. గ్రామాల్లో భయందోళన కలిగిస్తున్న వారిపై పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. గ్రూపులను ప్రోత్సహిస్తున్న పీఆర్: ఆది గ్రూపు రాజకీయాలను ప్రొత్సహించడానికే రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామంలో పర్యటించారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. గ్రామంలో ఓ వ్యక్తి తనకు వ్యక్తిగతంగా ఏమీ చేయలేదని కత్తితో బెదిరించాడన్నారు. తాను ఎక్కడ కూడ ఫ్యాక్షన్‌ను ప్రొత్సహించడం లేదని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్నానన్నారు. టీడీపీని బలోపేతం చేయాటానికి తామిద్దరిని(పీఆర్, ఆది) కలపాలని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డిని కోరానన్నారు. -
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దుష్ర్పచారం
⇒ టీడీపీ నేతలు, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని దురుద్దేశ ప్రచారం ⇒ పార్టీ వీడుతున్నానని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎక్కడైనా చెప్పారా? ⇒ హామీలను నెరవేర్చలేని టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది ⇒ ప్రభుత్వ వైఫల్యాలపై జనవరి 21, 22 తేదీల్లో తణుకులో జగన్ దీక్ష ⇒ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి వెల్లడి సాక్షి, హైదరాబాద్: అధికారపక్షం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. తెలుగుదేశం పార్టీ నేతలు, ఓ వర్గం మీడియా, కొన్ని పత్రికలు దురుద్దేశంతో పనిగట్టుకుని మరీ వైఎస్సార్ కాంగ్రెస్ ఖాళీ అవుతోందనీ ఎమ్మెల్యేలు కూడా వెళ్లి పోతున్నారనీ ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ధ్వజమెత్తారు. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని.. అన్నీ అబద్ధాలేనని పేర్కొన్నారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వెళ్లిపోతున్నారని వార్తలు రాస్తున్నారంటూ.. నిజానికి తాను పార్టీ వీడుతున్నట్లు ఆయన ఎక్కడైనా చెప్పారా? చంద్రబాబు పాలన బాగుందన్నారా? లేక బీజేపీలో చేరుతున్నానని చెప్పారా? అని ప్రశ్నించారు. ‘‘అసలు ఎవరైనా ఏం చూసి టీడీపీలోకి వెళతారు? గత ఆరు నెలలుగా ఏ ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చలేక ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న ఆ పార్టీలోకి ఎవరైనా ఎందుకు వెళతారు?’’ అని పార్థసారథి విస్మయం వ్యక్తం చేశారు. ‘‘టీడీపీ నేత, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వయంగా రుణ మాఫీ సరిగ్గా అమలు జరగడం లేదన్నారు. రెవెన్యూ మంత్రినైనా తనకు తెలియకుండానే రాజధాని ప్రాంతంలో భూసేకరణ కార్యక్రమం చేపడుతూ ఉండటంపై ఆ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని గత ఆరు నెలల్లో ప్రజలకు ఏమీ చేయలేక పోయామని బాహాటంగానే విమర్శలు చేశారు. ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని చంద్రబాబు మంత్రులను మాత్రమే దోషులుగా నిలిపే యత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న టీడీపీలోకి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎందుకు వెళ్లాలనుకుం టారు?’’ అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు చేతిలో మోసపోయిన రైతులు, మహిళలు, నిరుద్యోగుల పక్షాన పోరాడ్డానికి ఉత్సాహంతో ముందుకు ఉరుకుతున్నారన్నారు.ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జనవరి 21, 22 తేదీల్లో తణుకులో దీక్ష చేయబోతున్నారని ఆయన ప్రకటించారు. -
'జగన్ వెంటే నడవాలని నిర్ణయించుకొన్నా'
హైదరాబాద్ : వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆదినారాయణరెడ్డి తన అనుచర గణంతో పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి మేరకే ఇన్నిరోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్నారు. అయితే విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుందని.... సమైక్యాంధ్ర మద్దతు తెలిపే జగన్‌కు సంఘీభావం ప్రకటించి వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్లు ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. తాను జగన్ వెంటన నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆదినారాయణరెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరునుండటంతో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలి వచ్చారు. వారిలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పార్టీ నాయకుడు సూర్యనారాయణరెడ్డి, పెద్దముడియం మండల మాజీ ఉపాధ్యక్షుడు కేవీ కొండారెడ్డి, నేతలు బి.నారాయణరెడ్డి, జగదేకరెడ్డి, డి.కొండారెడ్డి ఉన్నారు. ఇంకా కొండాపురం నుంచి శివనారాయణరెడ్డి, అంకిరెడ్డి, పొట్టిపాడు ప్రతాపరెడ్డి, ఎర్రగుంట్ల నుంచి జయరామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నగరానికి చేరుకున్నారు.