ఆయన మనుషులు... మమ్మల్ని చంపేస్తారు | mla adi, ramasubba reddy fighting in jammalamadugu | Sakshi
Sakshi News home page

ఆయన మనుషులు... మమ్మల్ని చంపేస్తారు

Published Tue, Apr 12 2016 1:08 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

mla adi, ramasubba reddy fighting in jammalamadugu

► మాజీ మంత్రి పీఆర్ వర్గీయుల ఆందోళన
► కన్నీటిపర్యంతమైన అనుచరులు

జమ్మలమడుగు: ‘వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు రామాంజనేయరెడ్డి ఆదివారం (పెద్దదండ్లూరు) ఊళ్లో పర్యటించారు. మా ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాలని మా ఆయన కోరాడు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కల్పించుకుని.. రోడ్డు, నీళ్ల ట్యాంకు మీ నాయన కట్టించినాడా అని అడిగాడు. ఆ ట్యాంకు మా కోసం కాదు.. పెద్ద రెడ్ల కోసం కట్టించారని మా ఆయన చెప్పాడ'ని దాడికి గురైన సుబ్బరాయుడు (గోపన్న) భార్య ఓలమ్మ.. మాజీ మంత్రి, టీడీపీ నేత పి.రామసుబ్బారెడ్డి(పీఆర్) ఎదుట వాపోయింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ..'దీంతో ఎమ్మెల్యే సోదరుడు రామాంజనేయులరెడ్డి మా ఆయన్ను దర్గా దగ్గర నుంచి చెప్పులతో కొట్టుకుంటూ వచ్చారు. మేము తక్కువ కులానికి చెందినవారం కాబట్టే దేవగుడి గ్రామంలో నుంచి ఐదు ట్రాక్టర్లలో జనాలను పిలుచుకుని వచ్చి మా వాళ్ల ఇండ్లపై దాడి చేశారు. మాకు కేసులు.. గీసులు వద్దు.. మీరు ఇప్పుడు మా ఇంటికి వచ్చినందున వాళ్లు మమ్మల్ని చంపడం ఖాయం. ఇక ఇక్కడ ఉండి పొలం పనులు చేసుకోలేమ’ని పి.రామసుబ్బారెడ్డి(పీఆర్)కు చెప్పింది.

ఆదివారం పెద్దదండ్లూరులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయుల దాడికి గురైన బాధితులతో సోమవారం రామసుబ్బారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారి ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఆదివారం ట్రాక్టర్లలో జనాలు వచ్చి మా ఇంటి ఆవరణలో ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు. ట్రాక్టర్ ట్రాలీ కోసం ఉంచుకున్న రూ. 50 వేల డబ్బులను కూడా తీసుకెళ్లారు’ అంటూ మరో బాధితురాలు ప్రమీల ఆందోళన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ఎదుట ఎమ్మెల్యే సోదరునితో పాటు వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి కూడా నన్ను కొట్టాడు’ అని సుబ్బరాయుడు వివరించాడు. గ్రామాల్లో భయందోళన కలిగిస్తున్న వారిపై పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు.
 
గ్రూపులను ప్రోత్సహిస్తున్న పీఆర్: ఆది
గ్రూపు రాజకీయాలను ప్రొత్సహించడానికే రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామంలో పర్యటించారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. గ్రామంలో ఓ వ్యక్తి తనకు వ్యక్తిగతంగా ఏమీ చేయలేదని కత్తితో బెదిరించాడన్నారు. తాను ఎక్కడ కూడ ఫ్యాక్షన్‌ను ప్రొత్సహించడం లేదని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్నానన్నారు. టీడీపీని బలోపేతం చేయాటానికి తామిద్దరిని(పీఆర్, ఆది) కలపాలని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డిని కోరానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement