శ్రీరంగ నీతులే...!
♦ చెప్పేదొకటి చేసేది మరొకటి
♦ ఎమ్మెల్యే పదవికి రాజీనామా గాలికి వదిలిన వైనం
♦ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలింతకు రెడీ...
♦ పీఆర్ పెద్దదండ్లూరు పర్యటన జీర్ణించుకోలేని పరిస్థితి
‘నోరు ఒకటి చెబితే.. చేతులు ఇంకొటి చేస్తాయి, దేని పని దానిదే’ ఇదీ ఓ సినిమాలో విలన్ డైలాగ్.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహార శైలి అచ్చం అలాగే కన్పిస్తోంది. రెండేళ్లుగా ఆయన మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. చెప్పేందుకే శ్రీరంగనీతులు.. అన్నట్లుగా ఆయన ధోరణి కన్పిస్తోంది.
సాక్షి ప్రతినిధి, కడప: తాను ఏమి చేసినా పైచేయి సాధించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎవరిపైనయినా ఎలాంటి ఆరోపణలకైనా వెనుకాడడం లేదు. అందులో భాగంగానే తాజాగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన దివంగత సీఎం వైఎస్‌ఆర్ కుటుంబ సభ్యులపై ఆరోపణలకు దిగినట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఆ మధ్య అనేకమార్లు ‘నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. పార్టీ మారాల్సి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారుతా. ఏదైనా చెప్పే చేస్తా. ఎమ్మెల్యే పదవి తోకతో సమానం.’ అంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రకటనలు చేశారు.
చెప్పిన మాటను పక్కనెట్టి ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయకుండానే టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే డొల్లతనం అక్కడే బహిర్గతమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం కోసం పార్టీ ఫిరాయిస్తుంటే, పదవికి ఎలా రాజీనామా చేస్తారని పరిశీలకులు ముందే అంచనా వేశారు. అయినప్పటీకీ పదేపదే ఎమ్మెల్యే వ్యాఖ్యల నేపథ్యంలో నైతిక విలువలకు కట్టుబడి ఉంటారని ప్రజాస్వామ్యవాదులు ఆశించారు. అధికారం ముందు నైతికత బలాదూర్ అయ్యిందని ఆయన వ్యవహారంతో తేటతెల్లమైంది. ఎమ్మెల్యే తన వియ్యంకుడు ఆస్తులను కాపాడుకోవడమే లక్ష్యంగా పార్టీ ఫిరాయించారని రాజకీయ పరిశీలకులు అంచనాకు వచ్చారు. ఈక్రమంలో తన తప్పును కప్పిపుచ్చుకుంటూనే పైచేయి సాధించడమే లక్ష్యంగా అనేక ఆరోపణలు తెరలేపుతున్నట్లు పలువులు వివరిస్తున్నారు.
కడుపులో కత్తులు పెట్టుకొని....
నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చెప్పుకొస్తున్నారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని కలుగోలుగా వెళ్లేందుకు అభ్యంతరం లేదని ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యే చర్యలు ‘నోటీతో చెప్పడం నొసలుతో వెక్కిరించడం’ అన్నట్లుగా ఉండిపోయాయని మాజీ మంత్రి పీఆర్ వర్గీయులు పేర్కొంటున్నారు. వాస్తవంగా కలుపుగోలుగా వెళ్లాలనే సదుద్దేశ్యమే ఉంటే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని పెద్దదండ్లూరుకు ఆహ్వానించిన జన్మభూమి కమిటీ సభ్యులపై దాడి జరిగిండేది కాదని వారు వివరిస్తున్నారు. అనేక విషయాలల్లో అదే ధోరణి తేటతెల్లం అవుతోందని పీఆర్ వర్గీయులు చెప్పుకొస్తున్నారు. కార్యకర్తల సమావేశం ఉదయం పూట నిర్వహించేందుకు సన్నాహాలు చేసి కూడా, సాయంత్రం హాజరు కావాల్సిందిగా పీఆర్ వర్గీయులకు సెల్ మెసేజ్‌లు పంపారని పలువురు చెప్పుకొస్తున్నారు. ఆమేరకే టీడీపీ నేత పీఆర్ వర్గీయులు కార్యకర్తల సమావేశానికి గైర్హాజరయినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రతిఘటన
జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి ఎదురుగా ప్రశ్నించే కార్యకర్తలు బహుఅరుదు. అలాంటిది బుధవారం కార్యకర్తల నుంచి ప్రతిఘటన నెలకొంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబసభ్యులపై ఆరోపణలు, దూషణల నేపథ్యంలోనే సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు బాహాటంగా స్పందించారని తెలుస్తోంది. వైఎస్ కుటుంబ వల్లే ఎమ్మెల్యే కుటుంబం ఉన్నతస్థాయికి చేరిందన్న విషయాన్ని మర్చిపోవడమే అందుకు కారణంగా విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
పార్టీ ఫిరాయించే వరకూ ఎమ్మెల్యే పదవి తోకతో సమానమని చెప్పుకొచ్చిన ఆయన అనంతరం పదవికి రాజీనామా ఊసే ఎత్తడం లేదని పలువురు పేర్కొంటున్నారు. వైఎస్ కుటుంబం సహకారంతో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి శ్రమకోర్చి జమ్మలమడుగులో నిర్మించిన రాజకీయ పునాదులపై అత్యంత తెలివితేటలతో 2004 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి వచ్చి వాలిపోయారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఆపై వైఎస్ కుటుంబం మద్దతు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎంపిక కావడాన్ని కార్యకర్తల మదిలో తొలిగిపోలేదని పలువురు వివరిస్తున్నారు. ఆమేరకే ఎమ్మెల్యే అడ్డదడ్డంగా చేస్తున్న ఆరోపణలపై ప్రతిఘటిస్తున్నట్లు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.