'జగన్ వెంటే నడవాలని నిర్ణయించుకొన్నా'
హైదరాబాద్ : వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బుధవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదినారాయణరెడ్డి తన అనుచర గణంతో పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు.
ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి మేరకే ఇన్నిరోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్నారు. అయితే విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుందని.... సమైక్యాంధ్ర మద్దతు తెలిపే జగన్కు సంఘీభావం ప్రకటించి వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్లు ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. తాను జగన్ వెంటన నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఆదినారాయణరెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరునుండటంతో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలి వచ్చారు. వారిలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పార్టీ నాయకుడు సూర్యనారాయణరెడ్డి, పెద్దముడియం మండల మాజీ ఉపాధ్యక్షుడు కేవీ కొండారెడ్డి, నేతలు బి.నారాయణరెడ్డి, జగదేకరెడ్డి, డి.కొండారెడ్డి ఉన్నారు. ఇంకా కొండాపురం నుంచి శివనారాయణరెడ్డి, అంకిరెడ్డి, పొట్టిపాడు ప్రతాపరెడ్డి, ఎర్రగుంట్ల నుంచి జయరామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నగరానికి చేరుకున్నారు.