మన గోడు వెంకన్నకే చెప్పుకుందాం
వినే సహనం లేకపోతే ఎందుకు పిలిపించారు
ఇంతకాలం పార్టీని నమ్ముకుంటే ఇచ్చే విలువ ఇదేనా?
ఇక్కడ కాదు.. గ్రామాల్లో పరిస్థితి అర్థం చేసుకోవాలి
చంద్రబాబుపై జమ్మలమడుగు టీడీపీ కార్యకర్తల ఆగ్రహం
విజయవాడ: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంపై ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు టీడీపీ అధ్యక్షుడు పి.రామసుబ్బారెడ్డి, ఆయన పినతల్లి, మాజీ మంత్రి పి.శివారెడ్డి భార్య లక్ష్మిదేవమ్మలతో కలిసి ఆరు మండలాలకు చెందిన సుమారు 50మంది నేతలు విజయవాడలోని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ అధినేత చంద్రబాబునాయుడ్ని కలిశారు. ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకోవడం వల్ల గ్రామాల్లో ఏర్పడే పరిస్థితుల్ని వివరించేందుకు యత్నించారు. సమావేశాన్ని పావుగంటలోనే ముగించడంతో టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలోంచి బయటకు వచ్చిన వెంటనే చంద్రబాబు తమతో వ్యవహరించిన తీరుపై నిరసన తెలిపారు. నియోజకవర్గంలోని పరిస్థితుల్ని వివరించేందుకు తమను రమ్మని ఆహ్వానించారని, తీరా ఇక్కడకు వచ్చిన తరువాత మేము చెప్పేది ఏమీ వినలేదని చిల్లంకూరు, షిరాజ్‌పల్లిలకు చెందిన కార్యకర్తలు తెలిపారు.
ఆయనకు అంత ఓపిక లేకపోతే ఎలా... ఎంతోదూరం నుంచి ఆవేదనతో వచ్చాం.. ఇంతకాలం పార్టీని నమ్ముకుంటే ఇచ్చే విలువ ఇదేనా.. ఇక్కడ చెప్పడం కాదు.. అక్కడ గ్రామాల్లో పరిస్థితి అర్థం చేసుకోవాలి.. ఇక మన గోడు ఇక్కడ చెప్పుకునే కంటే వెళ్లి ఆ తిరుపతి వెంకన్నకు చెప్పుకుంటే మంచిదంటూ వ్యాఖానించుకున్నారు. పరిటాల సునీత, జేసీ దివాకరరెడ్డిలు ఏ విధమైన విభేదాలు లేకుండా పనిచేస్తుకుంటున్నట్లే మీరు చేసుకోవాలని చెప్పడం సరికాదని ఆ ఇద్దరు ఒకే నియోజకవర్గం కాదన్న విషయం ముఖ్యమంత్రి గ్రహించాలని అన్నారు. ఆదినారాయణరెడ్డి వంటి అవకాశవాదిని పార్టీలో చేర్చుకోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకించినా, నాకు అంతా తెలుసు అంటూ చంద్రబాబు సర్ది చెప్పేందుకే ప్రయత్నించారే తప్ప తమ మాట పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాము ఎప్పటికీ రామసుబ్బారెడ్డి వెంటే ఉంటామని చెప్పారు.
ఇక్కడ పార్టీలో కలవడం కాదు... అక్కడ నడుచుకునే విధానం బట్టి ఉంటుంది: రామసుబ్బారెడ్డి
‘టీడీపీ పార్టీ ఆఫీసులో కలవడం కాదు.. అక్కడ గ్రామాల్లో నడుచుకునే విధానం బట్టి ఉంటుంది. భవిష్యత్తు పరిణామాలను కాలమే నిర్ణయిస్తుంది’ అని రామసుబ్బారెడ్డి వ్యాఖానించారు. ఆదినారాయణరెడ్డి వస్తాడని తాము ఎవ్వరం ఊహించలేదని, అయితే ఆయన టీడీపీలో చేరతానని చెప్పగానే చంద్రబాబు తమతో సంప్రదించినప్పుడు నియోజకవర్గ పరిణామాలు ఆయనకు వివరించే ప్రయత్నం చేశామన్నారు. ఇప్పుడు గ్రామాల్లో ప్రజల మనోభావాలను తెలియచెప్పేందుకే వారి అందర్నీ ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పారు. ఇక్కడ ఒకటి చెప్పి.. అక్కడ మరొలా వ్యవహరిస్తే ఇబ్బందులు వస్తాయన్నారు. తాము కుటుంబసభ్యుల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని కోల్పోయామని, తమ కార్యకర్తలు ఆస్తులు కోల్పోయారని తెలిపారు. ఆదినారాయణరెడ్డి చేరడాన్ని పార్టీలో అందరూ వ్యతిరేకిస్తున్నా.. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నామని చెప్పారు. ఆదినారాయణరెడ్డి చేరడం వల్ల ఇప్పటివరకు ఉన్న వారికి కలిగే కష్టాలు, నష్టాలను దృష్టిలో పెట్టుకోమని చెప్పాం. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడమని చంద్రబాబును కోరామని, మరొకసారి నియోజకవర్గ ముఖ్యనేతలతో కలిసి సమావేశం నిర్వహిస్తామని హామీఇచ్చారని తెలిపారు.