Solar energy projects
-
భారత్‌లో సోలార్ సొల్యూషన్స్ అందిస్తున్న నం.1 కంపెనీ
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లో సోలార్ సొల్యూషన్స్ అందించేందుకు పునరుత్పాదక ఇంధన సంస్థ క్లీన్‌మాక్స్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంయుక్త సంస్థ భారతదేశంలోని ఆరు పారిశ్రామిక ప్రదేశాల్లో 14.4 మెగావాట్ల సోలార్ రూఫ్‌టాప్‌లను అమర్చింది. తాజాగా రెండు కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్‌టాప్‌లతో 2.07 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: భారీ ఆర్డర్లకు కొత్త విద్యుత్తు వాహనాలు ఇండియాలో యాపిల్ తన కార్పొరేట్ కార్యకలాపాలను పెంపొందించుకునేందుకు ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని తెలిసింది. దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీపై అవగాహన కలిగిస్తూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను పెంచడమే ఈ భాగస్వామ్యం లక్ష్యమని క్లీన్మాక్స్ తెలిపింది. -
తెలంగాణకు విద్యుత్.. ఎన్టీపీసీ నోఖ్రా ప్రాజెక్ట్ నేడు జాతికి అంకితం
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ఎన్టీపీసీకి చెందిన 300 మెగావాట్ల నోఖ్రా సోలార్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిబ్రవరి 16న జాతికి అంకితం చేస్తున్నారు. బికనీర్ జిల్లాలో 1,550 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు విస్తరించింది. పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రానికి అందించడానికి రూ.1,803 కోట్ల పెట్టుబడితో సీపీఎస్‌యూ పథకం (ఫేజ్– ఐఐ) కింద ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. 13 లక్షల పైచిలుకు సోలార్ పీవీ మాడ్యూల్స్ వినియోగించారు. ప్రాజెక్టు పూర్తి అయితే ఏటా 730 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఎన్టీపీసీ వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ 1.3 లక్షలకుపైగా గృహాల్లో వెలుగులు నింపుతుందని వివరించింది. అలాగే ఏటా 6 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని తెలిపింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరులతో 3.4 గిగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. 26 గిగావాట్ల సామర్థ్యం గల వివిధ ప్రాజెక్టులు పలు నిర్మాణ దశల్లో ఉన్నాయి. -
కొత్తప్లాన్‌తో భారత్‌లోకి టెస్లా.. ప్రయత్నం ఫలిస్తుందా..?
భారతప్రధాని నరేంద్రమోదీ ఇటీవల రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్ ప్రకటించిన తర్వాత ఈ రంగంలోని కంపెనీల షేర్లు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్లో కూడా దాదాపు రూ.10వేలకోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల పేద కుటుంబాలకు ఏటా రూ.18 వేల వరకు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. తాజాగా అమెరికాలోని ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇంక్ దేశంలో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఇన్స్టాల్ చేయడానికి స్థానిక భాగస్వామి కోసం చూస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ తన భవిష్యత్తు ప్రణాళిక గురించి ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసినట్లు లైవ్ మింట్ నివేదిక పేర్కొంది. సబ్సిడీ, ఇతర గ్రాంట్లలో రాయితీ ఇవ్వాలని కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. ఎలక్ట్రిక్ కార్ వ్యాపారం కాకుండా, టెస్లా సౌర విద్యుత్ ఉత్పత్తి, కరెంట్ స్టోరేజ్ చేసే గృహ విద్యుత్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తోంది. టెస్లా తయారు చేసే ఉత్పత్తుల్లో ‘సోలార్ రూఫ్’ కూడా ఒకటి. దీనిలో పైకప్పును ఫొటోవోల్టాయిక్ టైల్స్‌తో భర్తీ చేస్తారు. దీన్ని పవర్వాల్ అని పిలుస్తారు. ఇది సోలార్ ప్యానెల్, బ్యాటరీ పవర్ స్టోరేజ్ యూనిట్‌గా వ్యవహరిస్తుంది. అమెరికాలో కంపెనీకి చెందిన సోలార్ వ్యాపారం కొంత మందగించిన తరుణంలో టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించాలని చూస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. అమెరికాలో టెస్లా విద్యుత్ వ్యాపారం ఏడాది క్రితం 100 మెగావాట్ల నుంచి డిసెంబర్ త్రైమాసికానికి 59శాతం తగ్గి 41 మెగావాట్లకు చేరుకుంది. మరోవైపు, దేశీయంగా ఇప్పటికే టాటా పవర్ సోలార్, అదానీ సోలార్, సెర్వోటెక్ పవర్ సిస్టమ్స్..వంటి దేశీయ కంపెనీలు రూఫ్ టాప్ సోలార్ విభాగంలో పనిచేస్తున్నాయి. గత ఐదేళ్లలో భారతదేశ సోలార్ రూఫ్‌టాప్ సామర్థ్యం 47శాతం చొప్పున పెరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ నాటికి దేశం మొత్తం రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యం 11.1 గిగావాట్లుగా ఉంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ద్వారా దేశంలోని కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదీ చదవండి: గగనతల రారాజు ‘జిర్కాన్’.. ఎన్నో ప్రత్యేకతలు ఇదిలా ఉండగా, ఇప్పటికే టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను భారత్‌లో స్థాపించాలని కంపెనీ అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. కానీ అందుకు సంస్థ కోరేలా భారీ రాయితీలు, పన్ను మినహాయింపులు ప్రభుత్వం ఇవ్వడానికి సుముఖంగా లేదు. దాంతో జాప్యం జరుతున్నట్లు తెలిసింది. తాజాగా సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటుకు భారత్‌లో ప్రవేశించడానికి కొత్త ప్రయత్నం చేస్తోంది. -
పార్కింగ్ ప్లేస్ పైకప్పులుగా సోలార్ ప్యానెల్స్.. వేల ఎకరాల్లో ఏర్పాటు!
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. పునరుత్పాదక వనరులు వినియోగించుకుని విద్యుత్ తయారుచేయడంలో చాలాదేశాలు ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్నాయి. ప్రధానంగా సౌరశక్తి, పవనశక్తిని ఉపయోగించి కరెంట్ తయారుచేయడంలో ఎన్నో కంపెనీలు విభిన్నంగా ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగా కొన్నిదేశాల్లో స్థలం వృధా కాకుండా కాలువలపై సోలార్ ఎనర్జీ ప్లేట్లను ఏర్పాటుచేస్తుంటే.. కొన్నిచోట్ల జలాశయాలపై వాటిని వినియోగించి కరెంట్‌ను తయారుచేస్తున్నారు. తాజాగా న్యూయార్క్ సిటీలో ఏకంగా 8,500 ఎకరాల్లో సోలార్‌ప్లేట్లతో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేశారు. న్యూయార్క్ సిటీలో పునరుత్పాదకత వనరులను వినియోగించుకునేలా అక్కడి జోనింగ్ చట్టాలను సడలించించడంతో ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల న్యూయార్క్ సిటీ కౌన్సిల్ ‘సిటీ ఆఫ్ యెస్ ఫర్ కార్బన్ న్యూట్రాలిటీ’ని ఆమోదించింది. అక్కడి జోనింగ్ కోడ్‌ను అప్డేట్ చేయడంతో క్లీన్ ఎనర్జీ, ఈవీ ఛార్జర్లను ఇంప్లిమెంట్ చేయడానికి స్థిరమైన కార్యక్రమాలు చేపట్టే అవకాశం కల్పిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. న్యూయార్క్‌సిటీలో జోనింగ్ కోడ్‌ను ఆధునీకరించడం ద్వారా పరిశుభ్రమైన గాలి, వ్యర్థాల నిర్వహణ, ఈవీ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. గతంలో తక్కువ ఆదాయాలు కలిగిన ప్రజలు నివసిస్తున్న ప్రదేశాల్లో సోలార్ప్లేట్లకు సంబంధించిన మైక్రోగ్రిడ్లను ఇన్స్టాల్ చేసేందుకు అనుమతులుండేవి కాదు. కానీ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలతో అక్కడి ప్రదేశాలతోపాటు పార్కింగ్ స్థలాల్లో సౌరఫలకలను ఏర్పాటు చేసుకునేలా అనుమతిస్తున్నట్లు ఆడమ్స్ తెలిపారు. ఇది సిటీలో పూర్తిగా కార్యరూపం దాలిస్తే దాదాపు 1,30,000 గృహాలకు తక్కువ ఖర్చుతో కరెంట్ లభిస్తుందని అన్నారు. ఇదీ చదవండి: బ్యాంకులో పెట్టిన బంగారం పోతే ఎంతిస్తారంటే... తాజాగా జోనింగ్ చట్టాల్లో తీసుకొచ్చిన మార్పుల వల్ల 8,500 ఎకరాల పార్కింగ్ స్థలాల్లో సోలార్ ఎనర్జీని తయారుచేస్తున్నారు. దాంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. -
హాట్.. కూల్.. సోలార్
సాక్షి, అమరావతి: సూర్యరశ్మిలో ఉన్న అనంత శక్తిని వినియోగించుకోవడంపై ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అలాగే హైడ్రోజన్ గ్యాస్‌ను భవిష్యత్ ఇంధనంగా కూడా భావిస్తున్నారు. ఇన్నాళ్లూ సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి వినియోగించుకుంటున్నాం. ఆ విద్యుత్‌తో దీపాలు వెలిగిస్తున్నాం. వాహనాలను, పరిశ్రమలను కూడా నడుపుతున్నాం. వీటన్నింటినీ మించి తాజా ఆవిష్కరణలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. వాటిలో ఒకటి సోలార్ హైడ్రోజన్ ప్యానల్స్ కాగా, రెండవది హైబ్రిడ్ సోలార్ ఎయిర్ కండీషనర్లు. భవిష్యత్ తరాలకు భరోసా కల్పిస్తున్న ఈ రెండు కొత్త ప్రాజెక్టులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇంటిపైనే హైడ్రోజన్ ఫ్యాక్టరీ.. పర్యావరణానికి హాని చేసే ఉద్గారాలు ఏమీ లేని స్వచ్ఛమైన ఇంధనం హైడ్రోజన్. ఈ గ్యాస్‌ను గాలి నుంచి పొందేలా బెల్జియంలో పరిశోధనలు సాగాయి. సూర్యుని నుంచి విద్యుత్ శక్తిని, గాలి నుంచి హైడ్రోజన్ వాయువును సంగ్రహించగల పైకప్పు (రూఫ్‌టాప్) ప్యానెల్స్‌ను కేయూ లీవెన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. చాలా కాలంగా వీరు చేసిన పరిశోధనలు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి. ప్రస్తుతం పారిశ్రామికోత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నారు. 2030కల్లా రూఫ్‌టాప్ హైడ్రోజన్ ప్యానల్స్ తయారు చేసేలా కృషి చేస్తున్నారు. హైడ్రోజన్‌ను నిల్వ చేసి అవసరమైనప్పుడు విద్యుత్‌గా, రూమ్ హీటర్‌గా వినియోగించుకునేందుకు వారు ఈ ప్రాజెక్టును రూపొందించారు. వీరు తయారు చేసిన ప్యానల్స్‌లో ఎలక్ట్రిక్ వైర్లకు బదులుగా గ్యాస్ ట్యూబ్‌లు ఒకదానికొకటి అనుసంధానించి ఉంటాయి. ఈ ప్యానల్స్ సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్‌గా మారుస్తాయి. అలాగే గాలి నుంచి నీటి ఆవిరిని గ్రహిస్తాయి. సూర్యుని నుంచి గ్రహించిన శక్తిని వినియోగించి ఆ ప్యానల్స్ నీటి అణువులను హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజిస్తాయి. హైడ్రోజన్‌ను స్టోర్ చాంబర్‌కు పంపి, ఆక్సిజన్‌ను తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఇలా నిల్వ చేసిన హైడ్రోజన్‌ను శీతాకాలంలో రూమ్ హీటింగ్ సిస్టంకు, అలాగే గృహానికి విద్యుత్‌గా కూడా వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సౌర, బ్యాటరీ, విద్యుత్‌తో పనిచేసే ఏసీ హైబ్రిడ్ సోలార్ ఎయిర్ కండీషనర్‌ను సోలార్ ఏసీగా పిలుస్తున్నారు. వీటిని సౌరశక్తి, సౌర బ్యాటరీ బ్యాంక్, విద్యుత్‌తో పనిచేయించవచ్చు. అంటే కరెంటు, సూర్యరశ్మి లేకున్నా ఏసీ ఆగదు. సోలార్ ప్యానల్స్, సోలార్ ఇన్వర్టర్లు, అన్ని ఉపకరణాలతో కలిపి ఏసీని తయారు చేశారు. ఇది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. -
హైదరాబాద్ ఈ సిటీలో భారీ ఎత్తున సోలార్ ప్యానెళ్ల తయారీ
హైదరాబాద్ సమీపంలోని ఈ సిటీలో భారీ ఎత్తున సోలాన్ ప్యానెల్స్, సెల్స్ తయారీ పరిశ్రమ రానుంది. ఈ మేరకు సికింద్రాబాద్ బేస్డ్గా ఉండే సోలార్ ప్రొడక్ట్స్ , సర్వీసులు అందించే ప్రీమియర్ ఎనర్జీస్ గ్రూప్ అమెరికాకు చెందిన అజ్యూర్ గ్లోబల్ పవర్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి ఈ సిటీలో రూ. 700 కోట్లతో భారీ ఎత్తున సోలార్ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నాయి. ఇక్కడ 1.25 గిగావాట్స్ సోలార్ సెల్స్, 1.25 గిగావాట్స్ సోలార్ మ్యాడ్యుల్స్ తయారీ చేపడతారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్ష్యంగా వెయ్యి మందికి పరోక్షంగా మరో రెండు వేల మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ సంస్థకు భారీ ఎత్తున ఆర్డర్లు రెడీగా ఉన్నాయి. చదవండి: టొరెంట్ పవర్ చేతికి స్కైపవర్ సోలార్ ప్లాంటు -
ఎండే అండ! సోలార్ విద్యుత్ దిశగా అడుగులు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గొట్టా బ్యారేజీ వద్ద నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకానికి సోలార్ విద్యుత్ వినియోగించే దిశగా అడుగులు పడుతున్నాయి. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచనల మేరకు ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి ఇంజినీర్లు మరో అడుగు ముందుకేసి సోలార్ విద్యుత్ ఏర్పాటుచేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లు ఖరీఫ్, రబీలో పచ్చని పైరుతో మెరవాలంటే హిరమండలం రిజర్వాయర్‌లో 19.05 టీఎంసీల నీటిని నింపాలి. డెడ్‌స్టోరేజ్‌లో 2.5 టీఎంసీల నీరు ఉంది. ఫ్లడ్‌ఫ్లో కెనాల్, కొండ చరియలు నుంచి వచ్చే నీరంతా కలిపి 4టీఎంసీలు ఉంటుంది. మిగిలిన 12 టీఎంసీల నీటిని నింపాలంటే.. ఒకటి నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసి నదిలో నీటిని మళ్లించడం, లేక గొట్టాబ్యారేజీ వద్ద లిఫ్ట్ ఏర్పాటుచేయడమే మార్గం. అయితే దీనికి వంశధార ఇంజినీర్లు మరో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వంశధార కుడి కాలువ ద్వారా 2800 క్యూసెక్కుల నీటిని మళ్లించేలా కాలువను ఆధునీకరించేందుకు డిజైన్లు చేశారు. పాత కాలువ సామర్థ్యం 1800 క్యూసెక్కులు ఉండగా దాన్ని మరో వెయ్యి క్యూసెక్కులు అదనంగా నీరు పారేలా కాలువను 10 మీటర్లు వెడల్పు పెంచేందుకు డిజైన్ చేస్తున్నారు. కాలువ సామర్థ్యం పెంచి దానిలోంచి ఎత్తిపోసిన నీటిని హిరమండలం రిజర్వాయర్‌లోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోలార్ ఏర్పాటుకు ప్రణాళిక హిరమండలం రిజర్వాయర్‌లోకి 12 టీంఎంసీల నీటిని నింపేందుకు సాధారణంగా విద్యుత్ వినియోగం 45 మెగావాట్స్ అవ్వవచ్చని నిపుణులు అంచనా. అందుకు సుమారు రూ.25కోట్లు విద్యుత్ చార్జీలు అయ్యే అవకాశం ఉంది. అయితే నీటిని ఎత్తిపోయడమనేది వర్షాకాలంలో సుమారు 100 రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉంటుంది. ఎత్తిపోతల అవసరాలు పూర్తయ్యాక మిగిలిన 9 నెలల కాలంలో సోలార్ విద్యుత్‌ని ప్రజా అవసరాలకు పు ష్కలంగా అందించవచ్చు. దాని వల్ల వచ్చే ఆదా యంతో సోలార్‌ప్లాంట్ నిర్మాణ ఖర్చులు, లిఫ్ట్‌కి అయ్యే విద్యుత్ చార్జీలను రాబట్టుకోవచ్చనే ఓ అంచనా వేస్తున్నారు. సోలార్ సిస్టమ్‌ని ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద స్థలం అవసరం. హిరమండలం రిజర్వాయర్ ఫోర్‌షోర్, రిజర్వాయర్ గట్టు ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేయవచ్చు. 45 మెగావాట్స్ విద్యుత్ తయారు చేసేందుకు కావాల్సిన సోలార్ ప్లాంట్ ఏర్పాటుకి సుమారు రూ.300కోట్లు ఖర్చు ఉండవచ్చని అంచనా. అయితే ఏటా ఎత్తిపోతలకు అవసరమైన విద్యుత్ వినియోగించగా మిగిలిన రోజుల్లో వచ్చే విద్యుత్ ద్వారా ప్రభుత్వానికి రూ.40కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్లాంట్ నిర్మాణ ఖర్చు 8 ఏళ్లలో వచ్చేస్తుంది. ప్లాంట్ నిర్మాణం కంటే రైతులకు ఏటా పండించే పంట అంతకు రెట్టింపుగా ఉంటుంది. సోలార్‌తో ప్రయోజనం అవసరమైన విద్యుత్‌ని సోలార్ నుంచి తీసుకోవడం వల్ల విద్యుత్ లోటు తగ్గుతుంది. లిఫ్ట్ అవసరాలు తీరగా ప్రజా అవసరాలను తీర్చేందుకు అవ కాశం ఉంటుంది. గతంలో భీమవరంలో ఎస్ఈగా పనిచేసిన సమయంలో లోసరి కెనాల్‌పైన సోలార్ సిస్టమ్‌ని ఏర్పాటుచేశాం. ఇప్పటికీ విజయవంతంగానే పనిచేస్తోంది. హిరమండలం రిజర్వాయర్‌లో ఉన్న ఫోర్‌షోర్ ఏరియాలో సోలార్ సిస్టమ్ అమర్చవచ్చు. – డోల తిరుమలరావు, ఎస్ఈ, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు, శ్రీకాకుళం -
మేధోవలసకు నేతల నిర్లక్ష్యమే కారణం
ఐఐసీటీ సభలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సాక్షి, హైదరాబాద్: భారత్‌లో నైపుణ్యానికి కొరత లేకున్నా.. దాన్ని గుర్తించి మెరుగులు దిద్ది జాతి నిర్మాణంలో భాగం చేసే విషయంలో మాత్రం పార్టీలకతీతంగా నేతలు నిర్లక్ష్యం వహించారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే యువత విదేశాల బాటపడుతోందన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏడు దశాబ్దాల కాలంలో ఐఐసీటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా వ్యవసాయం, ఫార్మా, ఆరోగ్య రంగాలకు వెలకట్టలేని సేవలందించారని కొనియాడారు. మేధోవలసపై వెంకయ్య మాట్లాడుతూ యువతీ యువకులు విదేశాలకు వెళ్లడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాకపోతే అక్కడకు వెళ్లి నేర్చుకుని, నాలుగు రాళ్లు సంపాదించుకుని మళ్లీ మాతృదేశానికి తిరిగి రావాలని మాత్రమే తాను ఆశిస్తున్నానన్నారు. తాను డాక్టర్‌ను, యాక్టర్‌ను కాదని, ట్రాక్టర్ నడిపే ఓ రైతు కొడుకును మాత్రమేనని చతురోక్తులు విసిరారు వెంకయ్య. ఐఐసీటీ ఏడు దశాబ్దాలుగా రసాయన శాస్త్ర పరిశోధనల ద్వారా దేశ సేవ చేస్తోం దని ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీ కాంతం తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ఐఆర్ డీజీ పీఎస్ అహూజా, ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ అహ్మద్ కమాల్, ఆర్‌బీఎన్ ప్రసాద్, కె. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సౌరశక్తి ప్రాజెక్టులు: జితేంద్ర సింగ్ సౌరశక్తితోపాటు సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో కేంద్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇం దులో భాగంగా లడఖ్ వంటి ప్రాంతాల్లో భారీ సౌరశక్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఆయన గురువారం చెప్పారు. ఐఐసీటీ 70వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రి ‘సాక్షి’తో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మాతా వైష్ణోదేవి ఆలయ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తూ ఆ ప్రాంతం సౌరశక్తి ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుందన్న ఆలోచనను తమతో పంచుకున్నారని, ఆ స్ఫూర్తితోనే ఆ స్టేషన్లోనే ఒక ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. జాతీయ సౌరశక్తి మిషన్‌ను పూర్తి చేయడంతోపాటు మరికొన్ని ఇతర ప్రాజెక్టులూ చేపడతామన్నారు. -
తక్కువ వడ్డీకి నిధులు అందిస్తాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక ఇంధన వనరుల రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తక్కువ వడ్డీకి నిధులు అందించేందుకు కృషి చేస్తున్నట్టు నవీన, సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ(ఎంఎన్ఆర్ఈ) తెలిపింది. ఈ రంగ కంపెనీలకు రుణాలిచ్చి ప్రోత్సహించాలని బ్యాంకులను కోరుతున్నామని ఎంఎన్ఆర్ఈ కార్యదర్శి రతన్ పి వతల్ గురువారమిక్కడ ఫ్యాప్సీ సదస్సులో తెలిపారు. దేశీయ విద్యుత్ అవసరాల్లో పునరుత్పాదక ఇంధన రంగం ప్రస్తుతం 6 శాతం వాటా సమకూరుస్తోంది. నాలుగేళ్లలో ఇది 9 శాతానికి, 2020 నాటికి 15 శాతానికి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జవహర్లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్(జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం) లక్ష్యించినట్టుగానే 2022 నాటికి 20,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం అవుతుందని స్పష్టం చేశారు. ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి రావడం, ప్యానెళ్ల ఖరీదు ఎక్కువగా ఉండడం సోలార్ రంగానికి అడ్డంకులని, రానున్న రోజుల్లో వీటిని అధిగమిస్తామని ఆయన అన్నారు. సోలార్ వాటర్ హీటర్ల ఏర్పాటులో మహారాష్ట్ర, కర్ణాటక ముందంజలో ఉన్నాయని ఎంఎన్ఆర్ఈ సంయుక్త కార్యదర్శి తరుణ్ కపూర్ చెప్పారు. రాయితీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా సోలార్ ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.సాహు అన్నారు. విదేశీ సోలార్ వాటర్ హీటర్లకే అధిక సబ్సిడీ ఇస్తున్నారని ఫ్యాప్సీ మాజీ ప్రెసిడెంట్ దేవేంద్ర సురానా తెలిపారు. దేశీయ కంపెనీలను కూడా ప్రోత్సహించాలని కోరారు. లెసైన్సుకు దరఖాస్తు.. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) విద్యుత్ వ్యాపారంలో ప్రవేశించేందుకు లెసైన్సు కోసం కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకుంది. జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం రెండో దశ బ్యాచ్-1 కింద కేంద్రం ఇటీవల ప్రకటించిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను విక్రయించే అధికారం తమకు ఉందని ఎస్ఈసీఐ ఎండీ రాజేంద్ర నిమ్జే తెలిపారు. డొమెస్టిక్ కేటగిరీ కింద 375 మెగావాట్లు, ఓపెన్ కేటగిరీ కింద 375 మెగావాట్ల ప్రాజెక్టులకు బిడ్లను ఆహ్వానించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా డెవలపర్లు ఆసక్తి కనబరిచారని పేర్కొన్నారు. డొమెస్టిక్ విభాగం కింద విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే డెవలపర్లు తప్పనిసరిగా దేశీయ కంపెనీల నుంచే విడిభాగాలను కొనుగోలు చేయాలి. ఇక ఒక్కో మెగావాట్‌కు రూ.2.5 కోట్ల దాకా సబ్సిడీ ఇస్తారు. డెవలపర్లకు ఒక్కో యూనిట్ విద్యుత్‌కు రూ.5.45 పైసలు ఎస్ఈసీఐ చెల్లిస్తుంది. కాగా, ప్రభుత్వ రంగ సంస్థలు అందించిన విరాళంతో ఎస్ఈసీఐ దేశవ్యాప్తంగా 6 లక్షల లాంతర్లను ఉచితంగా సరఫరా చేయనుంది.