తక్కువ వడ్డీకి నిధులు అందిస్తాం.. | Implementation of solar projects likely to gather pace, says MNRE Secretary | Sakshi
Sakshi News home page

తక్కువ వడ్డీకి నిధులు అందిస్తాం..

Published Fri, Nov 8 2013 12:25 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM

తక్కువ వడ్డీకి నిధులు అందిస్తాం.. - Sakshi

తక్కువ వడ్డీకి నిధులు అందిస్తాం..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక ఇంధన వనరుల రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తక్కువ వడ్డీకి నిధులు అందించేందుకు కృషి చేస్తున్నట్టు నవీన, సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ(ఎంఎన్‌ఆర్‌ఈ) తెలిపింది. ఈ రంగ కంపెనీలకు రుణాలిచ్చి ప్రోత్సహించాలని బ్యాంకులను కోరుతున్నామని ఎంఎన్‌ఆర్‌ఈ కార్యదర్శి రతన్ పి వతల్ గురువారమిక్కడ ఫ్యాప్సీ సదస్సులో తెలిపారు.  దేశీయ విద్యుత్ అవసరాల్లో పునరుత్పాదక ఇంధన రంగం ప్రస్తుతం 6 శాతం వాటా సమకూరుస్తోంది. నాలుగేళ్లలో ఇది 9 శాతానికి, 2020 నాటికి 15 శాతానికి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్(జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం) లక్ష్యించినట్టుగానే 2022 నాటికి 20,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం అవుతుందని స్పష్టం చేశారు.
 
 ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి రావడం, ప్యానెళ్ల ఖరీదు ఎక్కువగా ఉండడం సోలార్ రంగానికి అడ్డంకులని, రానున్న రోజుల్లో వీటిని అధిగమిస్తామని ఆయన అన్నారు. సోలార్ వాటర్ హీటర్ల ఏర్పాటులో మహారాష్ట్ర, కర్ణాటక ముందంజలో ఉన్నాయని ఎంఎన్‌ఆర్‌ఈ సంయుక్త కార్యదర్శి తరుణ్ కపూర్ చెప్పారు. రాయితీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా సోలార్ ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.సాహు అన్నారు. విదేశీ సోలార్ వాటర్ హీటర్లకే అధిక సబ్సిడీ ఇస్తున్నారని ఫ్యాప్సీ మాజీ ప్రెసిడెంట్ దేవేంద్ర సురానా తెలిపారు. దేశీయ కంపెనీలను కూడా ప్రోత్సహించాలని కోరారు.
 
 లెసైన్సుకు దరఖాస్తు..
 సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ) విద్యుత్ వ్యాపారంలో ప్రవేశించేందుకు లెసైన్సు కోసం కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకుంది. జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం రెండో దశ బ్యాచ్-1 కింద కేంద్రం ఇటీవల ప్రకటించిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను విక్రయించే అధికారం తమకు ఉందని ఎస్‌ఈసీఐ ఎండీ రాజేంద్ర నిమ్జే తెలిపారు. డొమెస్టిక్ కేటగిరీ కింద 375 మెగావాట్లు, ఓపెన్ కేటగిరీ కింద 375 మెగావాట్ల ప్రాజెక్టులకు బిడ్లను ఆహ్వానించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా డెవలపర్లు ఆసక్తి కనబరిచారని పేర్కొన్నారు. డొమెస్టిక్ విభాగం కింద విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే డెవలపర్లు తప్పనిసరిగా దేశీయ కంపెనీల నుంచే విడిభాగాలను కొనుగోలు చేయాలి. ఇక ఒక్కో మెగావాట్‌కు రూ.2.5 కోట్ల దాకా సబ్సిడీ ఇస్తారు. డెవలపర్లకు ఒక్కో యూనిట్ విద్యుత్‌కు రూ.5.45 పైసలు ఎస్‌ఈసీఐ చెల్లిస్తుంది. కాగా, ప్రభుత్వ రంగ సంస్థలు అందించిన విరాళంతో ఎస్‌ఈసీఐ దేశవ్యాప్తంగా 6 లక్షల లాంతర్లను ఉచితంగా సరఫరా చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement