ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతోంది. 2050 నాటికి సోలార్ ఎనర్జీ తయారీ 20 రెట్లు వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ) నివేదించింది. దాదాపు 100 కోట్ల మందికి ఆ రంగం స్థిర ఆదాయం కల్పించనుందని తెలిపింది. ఈమేరకు బాకులోని కాప్29 సదస్సుకు హాజరైన కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్, సహజ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కర్మ షెరింగ్ సమక్షంలో అధికారికంగా ఈ నివేదికను విడుదల చేశారు. ఈ రిపోర్ట్ తయారీకి ఐఎస్‌ఏ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమీకరించే ఎనర్జీ పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. దేశ స్థిరాభివృద్ధిలో సౌరశక్తి పాత్రను కేంద్రం గుర్తించిందని, అందుకు తగిన విధంగా సోలార్ ఎనర్జీ పరిధిని విస్తరించేందుకు ప్రపంచ వాటాదారులతో కలిసి పని చేస్తోందన్నారు. ఐఎస్‌ఏ నివేదికలో సూచించిన వినూత్న విధానాల ద్వారా మరింత మెరుగ్గా సౌరశక్తిని వినియోగించుకోవచ్చని చెప్పారు.
నివేదికలోని వివరాల ప్రకారం.. సౌరశక్తితో గణనీయమైన సామాజిక, పర్యావరణ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. 2050 నాటికి ప్రపంచ సౌరశక్తి సామర్థ్యం 20 రెట్లు పెరుగనుంది. స్లో ట్రాన్సిషన్, డైనమిక్ ట్రాన్సిషన్, షైన్ అనే మూడు విధానాలతో నెట్-జీరో(కార్బన్‌ను విడుదలను పూర్తిగా తగ్గించడం) లక్ష్యాన్ని సాధించవచ్చు.
స్లో ట్రాన్సిషన్: సౌరశక్తిని పెంచడానికి అవసరమయ్యే విధానాలను నెమ్మదిగా పెంచాలి. ప్రస్తుతం పరిమిత పెట్టుబడుల వల్ల ఈ విభాగం విస్తరణ కొంత వెనకబడి ఉంది. భవిష్యత్తులో ఈ ఇది పెరగనుంది.
డైనమిక్ ట్రాన్సిషన్: స్లో ట్రాన్సిషన్‌తో పోలిస్తే సౌరశక్తిని పెంచడానికి మరింత చురుకైన, ప్రతిష్టాత్మక విధానాన్ని ఇది సూచిస్తుంది.
షైన్: షైన్ (సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్) ద్వారా సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన వ్యవస్థను సృష్టించవచ్చు. సోలార్ ఫోటోవోల్టాయిక్(పీవీ) సిస్టమ్‌ను శక్తి నిల్వ కోసం వినియోగించుకోవచ్చు.
స్థిర ఆదాయం: ప్రభుత్వాలు ప్రజలకు సౌరశక్తిపై అవగాహన కల్పిస్తే నిర్ణీత ఖర్చుతో సోలార్ ఎనర్జీను గ్రిడ్‌కు కనెక్ట్ చేయవచ్చు. దాంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మందికి స్థిర ఆదాయం ఏర్పడుతుంది.
ఉపాధి: 2050 నాటికి ఈ విభాగంలో మహిళలు, యువతకు గణనీయమైన అవకాశాలు కల్పించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2.7 కోట్లకు పైగా ఈ సెక్టార్‌లో ఉద్యోగాలను సృష్టించవచ్చు.
పర్యావరణ ప్రభావం: సౌరశక్తిని పెంచడం వల్ల సంప్రదాయ ఇంధన వనరులను తగ్గించి పారిస్ ఒప్పందం ప్రకారం 1.5°C ఉష్ణోగ్రతను తగ్గించేందుకు వీలవుతుంది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 శాతం హానికర కర్బన ఉద్గారాలను కట్టడి చేయవచ్చు.
తగ్గనున్న వ్యయ సామర్థ్యం: సౌరశక్తి అందించడం ప్రస్తుతం కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా, 2050 నాటికి వీటి ఖర్చులు 60 శాతం తగ్గుతాయని అంచనా.
ఇదీ చదవండి: ‘ఉద్యోగం ఇస్తాం.. జీతం ఉండదు.. పైగా రూ.20 లక్షలు విరాళం’
పునరుత్పాదక ఇంధన వనరులతో శిలాజ ఇంధనాల వాడకం తగ్గడంతోపాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రయోజనాలు చేకూరుతాయని ఐఎస్‌ఏ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ అన్నారు. భవిష్యత్తులో స్థిరమైన ఎనర్జీ సరఫరాకు సౌరశక్తి కీలకంగా మారనుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిర్బన్ ముఖర్జీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment