మేధోవలసకు నేతల నిర్లక్ష్యమే కారణం
ఐఐసీటీ సభలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో నైపుణ్యానికి కొరత లేకున్నా.. దాన్ని గుర్తించి మెరుగులు దిద్ది జాతి నిర్మాణంలో భాగం చేసే విషయంలో మాత్రం పార్టీలకతీతంగా నేతలు నిర్లక్ష్యం వహించారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే యువత విదేశాల బాటపడుతోందన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏడు దశాబ్దాల కాలంలో ఐఐసీటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా వ్యవసాయం, ఫార్మా, ఆరోగ్య రంగాలకు వెలకట్టలేని సేవలందించారని కొనియాడారు.
మేధోవలసపై వెంకయ్య మాట్లాడుతూ యువతీ యువకులు విదేశాలకు వెళ్లడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాకపోతే అక్కడకు వెళ్లి నేర్చుకుని, నాలుగు రాళ్లు సంపాదించుకుని మళ్లీ మాతృదేశానికి తిరిగి రావాలని మాత్రమే తాను ఆశిస్తున్నానన్నారు. తాను డాక్టర్‌ను, యాక్టర్‌ను కాదని, ట్రాక్టర్ నడిపే ఓ రైతు కొడుకును మాత్రమేనని చతురోక్తులు విసిరారు వెంకయ్య. ఐఐసీటీ ఏడు దశాబ్దాలుగా రసాయన శాస్త్ర పరిశోధనల ద్వారా దేశ సేవ చేస్తోం దని ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీ కాంతం తెలిపారు. కార్యక్రమంలో సీఎస్‌ఐఆర్ డీజీ పీఎస్ అహూజా, ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ అహ్మద్ కమాల్, ఆర్‌బీఎన్ ప్రసాద్, కె. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సౌరశక్తి ప్రాజెక్టులు: జితేంద్ర సింగ్
సౌరశక్తితోపాటు సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో కేంద్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇం దులో భాగంగా లడఖ్ వంటి ప్రాంతాల్లో భారీ సౌరశక్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఆయన గురువారం చెప్పారు.
ఐఐసీటీ 70వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రి ‘సాక్షి’తో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మాతా వైష్ణోదేవి ఆలయ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తూ ఆ ప్రాంతం సౌరశక్తి ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుందన్న ఆలోచనను తమతో పంచుకున్నారని, ఆ స్ఫూర్తితోనే ఆ స్టేషన్‌లోనే ఒక ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. జాతీయ సౌరశక్తి మిషన్‌ను పూర్తి చేయడంతోపాటు మరికొన్ని ఇతర ప్రాజెక్టులూ చేపడతామన్నారు.