
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ఎన్‌టీపీసీకి చెందిన 300 మెగావాట్ల నోఖ్రా సోలార్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిబ్రవరి 16న జాతికి అంకితం చేస్తున్నారు. బికనీర్ జిల్లాలో 1,550 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు విస్తరించింది.
పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రానికి అందించడానికి రూ.1,803 కోట్ల పెట్టుబడితో సీపీఎస్‌యూ పథకం (ఫేజ్– ఐఐ) కింద ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. 13 లక్షల పైచిలుకు సోలార్ పీవీ మాడ్యూల్స్ వినియోగించారు. ప్రాజెక్టు పూర్తి అయితే ఏటా 730 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఎన్‌టీపీసీ వెల్లడించింది.
ఈ ప్రాజెక్ట్ 1.3 లక్షలకుపైగా గృహాల్లో వెలుగులు నింపుతుందని వివరించింది. అలాగే ఏటా 6 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని తెలిపింది. ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరులతో 3.4 గిగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. 26 గిగావాట్ల సామర్థ్యం గల వివిధ ప్రాజెక్టులు పలు నిర్మాణ దశల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment