వివేకాపై కక్ష గట్టింది ఆ ఇద్దరే.. | Vivekananda Reddys second wife Sheikh Shamim gave a statement to CBI | Sakshi
Sakshi News home page

వివేకాపై కక్ష గట్టింది ఆ ఇద్దరే..

Published Sat, Apr 22 2023 5:07 AM | Last Updated on Sat, Apr 22 2023 2:43 PM

Vivekananda Reddys second wife Sheikh Shamim gave a statement to CBI - Sakshi

సాక్షి, అమరావతి: ‘మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డికి ఆయన ఇద్దరు బావ­మరుదులు నర్రెడ్డి రాజ­శేఖర్‌రెడ్డి, నర్రెడ్డి శివ­ప్రకాశ్‌రెడ్డి నుంచే ముప్పు ఉండేది. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసం వారే ఆయనపై కక్షగట్టారు’.. అని వివేకానందరెడ్డి రెండో భార్య షేక్‌ షమీమ్‌ స్పష్టంచేశారు. ‘వివేకానందరెడ్డి హత్య తరువాత శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే ఎర్ర గంగిరెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారు’ అని కూడా ఆమె తేల్చిచెప్పారు.

ఈ హత్య కేసులో షమీమ్‌ 2020 అక్టోబరులోనే సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డితో తన రెండో వివాహం.. దానిపై ఆయన కుమార్తె సునీత, అల్లుడు–చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ఎంతగా విభేదించింది.. తనను ఎంతగా బెదిరించిందీ.. వివేకానందరెడ్డిని ఎంతగా వేధించింది మొదలైన సంచలనాత్మక విష­యాలను ఆమె సవివరంగా తన వాంగ్మూలంలో వెల్లడించారు. షేక్‌ షమీమ్‌ వాంగ్మూలంలో పేర్కొన్న విషయాలు ఆమె మాటల్లోనే..

మా పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు 
వైఎస్‌ వివేకానందరెడ్డి నన్ను 2010లో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. మేం పెళ్లి చేసుకోవడాన్నే వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సునీత నాకు ఫోన్‌చేసి తీవ్రంగా బెదిరించారు.

శివప్రకాశ్‌రెడ్డి మా బావగారికి ఫోన్‌చేసి తీవ్రంగా దూషించారు. దీంతో ఆయన కుటుంబం పులివెందుల వదిలివెళ్లిపోయింది. ఈ విషయాన్ని నేను వివేకానందరెడ్డికి చెప్పాను. దాంతో ఆయన శివప్రకాశ్‌రెడ్డి దగ్గరకు వెళ్లి కాలర్‌ పట్టుకుని మరీ మండిపడ్డారు. షమీమ్‌ను తాను రెండో పెళ్లి చేసుకున్నానని.. ఆమె నా భార్యని స్పష్టంచేశారు. అయినాసరే.. శివప్రకాశ్‌రెడ్డి మాత్రం వివేకా మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. మమ్మల్ని బెదిరిస్తూనే వచ్చారు.

ఆస్తి, రాజకీయ వారసత్వం కోసమే కక్ష
2013 నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిల నుంచి నాకు వేధింపులు ఎక్కువయ్యాయి. 2014లో మాకు బాబు పుట్టాడు. షేర్‌ షా అనే పేరుపెట్టాం. మా కుమారుడికి ఆస్తిలో వాటా ఇస్తాననడంతోపాటు తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని కూడా వివేకానందరెడ్డి చెప్పారు. దాంతో నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలలో ఆందోళన మొదలైంది.

వివేకానందరెడ్డికి మొదటి భార్యతో కుమారుడు లేకపోవడంతో ఆయన ఆస్తికి ఏకైక వారసుడిని కావాలని అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి భావించారు. ఆయన రాజకీయ వారసుడిని కావాలని నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పట్టుదలగా ఉండేవారు. కానీ, మాకు పుట్టిన బిడ్డను వారసుడిగా ప్రకటిస్తానని చెప్పడంతో వారిద్దరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వివేకానందరెడ్డిని మా ఇంటికి రాకుండా కట్టడి చేసేందుకు యత్నించేవారు. ఆయన్ను కూడా తీవ్రంగా బెదిరించేవారు. 

ఆ నాలుగెకరాలను శివప్రకాశ్‌రెడ్డి రాయించుకున్నారు..
బెరైటీస్‌ గనులు ఉన్న నాలుగెకరాల భూమిని నా కుమారుడి పేరున రాయాలని వివేకానందరెడ్డి భావించారు. కానీ, అందుకు సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ భూమిని శివప్రకాశ్‌రెడ్డి తన పేరున రాయించేసుకున్నారని వివేకానందరెడ్డే నాకు చెప్పి బాధపడ్డారు. అప్పటి నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిల నుంచి నాకు బెదిరింపులు మరింత తీవ్రమయ్యాయి.

వివేకాకు ఆర్థిక ఇబ్బందులు.. ఆయన్ని ఒంటరిని చేశారు.. 
వివేకానందరెడ్డిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వేధించారు. కుటుంబానికి చెందిన కంపెనీలలో డైరెక్టర్‌గా ఆయనకు ఉన్న చెక్‌ పవర్‌ను తొలగించారు. ఆయన్ని ఒంటరిగా పులివెందులలో విడిచిపెట్టి కుటుంబసభ్యులు అందరూ హైదరాబాద్‌లో ఉండేవారు. దాంతో రోజువారి ఖర్చులకు కూడా ఆయన తీవ్ర ఇబ్బందులు పడేవారు. అప్పులు తీర్చడానికి హైదరాబాద్‌ మణికొండలో ఉన్న తన ఇంటిని కూడా 2018లో విక్రయించారు. 

రూ.8 కోట్లు ఇస్తానన్నారు..
బెంగళూరులో ఓ భూ సెటిల్‌మెంట్‌ ద్వారా రూ.8 కోట్లు వస్తాయని వాటిని నాకు ఇస్తానని వివేకానందరెడ్డి చెప్పారు. కడపలోగానీ హైదరాబాద్‌లోగానీ ఓ ఇల్లు కొనిస్తానని.. మా కుమారుడిని బాగా చదివిస్తానని చెప్పారు. ఇది వివేకానందరెడ్డి స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి ద్వారా నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డికి తెలిసే అవకాశం ఉంది. గంగిరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. వారిద్దరూ కుట్ర ప్రకారం వివేకానందరెడ్డి చుట్టూ తమ మనుషులనే పెట్టారు. దస్తగిరితోపాటు అందరూ వాళ్ల మనుషులే. హైదరాబాద్‌లో నేను ఉంటున్న ఇంటి అడ్రస్‌ కూడా దస్తగిరికి తెలియకుండా వివేకానందరెడ్డి జాగ్రత్తపడేవారు.

ఓసారి దస్తగిరి మామిడిపళ్లు పట్టుకుని హైదరాబాద్‌ వస్తే.. మా ఇంటికి కాకుండా మరోచోట అప్పగించమని చెప్పారు. దస్తగిరి నుంచి నాకు ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతోనే అలా చేశారు. వివేకానందరెడ్డి హత్య తరువాత శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే ఎర్ర గంగిరెడ్డి ఆధారాలను ధ్వంసం చేశారు. వివేకానందరెడ్డి మృతదేహాన్ని బెడ్‌రూమ్‌ నుంచి హాలులోకి తేవడం, ఆధారాలను ధ్వంసం చేయడం అంతా దగ్గరుండీ చేయించింది ఎర్ర గంగిరెడ్డే. శివప్రకాశ్‌రెడ్డి చెప్పడంతోనే ఆయన అలా చేశారు. 

భయంతోనే వెళ్లలేదు..
2019, మార్చి 15న ఉ.10గంటల సమయంలో వివేకానందరెడ్డి మరణించారని నాకు తెలిసింది. వెంటనే మా చెల్లితో కలిసి పులివెందుల వెళ్లాలని అనుకున్నా. కానీ, శివప్రకాశ్‌రెడ్డికి భయపడే వెళ్లలేదు. ఎందుకంటే 2012లో ఓసారి వివేకానందరెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు ఆయన్ని చూసేందుకు ఇంటికి వెళ్తే నన్ను శివప్రకాశ్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లనివ్వకుండా బయటకు బలవంతంగా గెంటేశారు. అందుకే 2019లో ఆయన హత్యకు గురైనా సరే పులివెందుల వెళ్లేందుకు సాహసించలేకపోయాను. 

ఐఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు 
వివేకానందరెడ్డి 2017లో ఒక ఐఫోన్‌ కొని నాకు ఇచ్చారు. 2019లో ఆయన హత్యకు గురైన తరువాత పోలీసులు వచ్చి ఆ ఐఫోన్‌ను తీసుకెళ్లిపోయారు. దానిపై నాకు ఎలాంటి రశీదు కూడా ఇవ్వలేదు. నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డే ఆ ఫోన్‌ను పోలీసుల ద్వారా నా దగ్గర నుంచి తీసుకున్నారేమోనని ఆ అనుమానం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement