shamim
-
మహానటి.. సునీత.. వివేకా రెండో వివాహం గురించే తెలియదట
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి.. షమీమ్ అనే మహిళను పెళ్లి చేసుకోవడం, ఆమెతో ఒక కుమారుడిని కూడా కనడం వల్లే ఆయన కుటుంబంలో విభేదాలు చెలరేగి.. హత్యకు దారితీశాయని ఊరువాడా కోడై కూస్తున్నా.. వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత మాత్రం తన తండ్రి రెండో వివాహం గురించి తనకు తెలియదని చెబుతుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ‘వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారట కదా.. ఆమెతో ఆయనకు ఓ కుమారుడు ఉన్నాడట కదా.. అందుకే మీ కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయంట కదా’ అని కొద్దిరోజుల క్రితం నర్రెడ్డి సునీత హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నించారు. దీనికి ఆమె తన రెండు భుజాలు ఎగురవేస్తూ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. ‘ఐ డోంట్ నో (నాకు తెలియదు)’ అని. నిజంగానే వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్న విషయం సునీతకు తెలీదా అంటే ఎందుకు తెలీదు...పూర్తిగా తెలుసు అనే సమాధానమే వస్తోంది. షమీమ్ అనే ముస్లిం మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్న విషయం బహిరంగ రహస్యం. షమీమ్‌ను వివేకా 2010లో ముస్లిం సంప్రదాయం ప్రకారం రెండో వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ 2014లో ఓ కుమారుడు జన్మించారు. ఆ కుమారుడికి షెహెన్ షా అనే పేరు కూడా పెట్టారు. వివేకా తన రెండో భార్య షమీమ్, కుమారుడు షెహెన్ షాతో కలసి ఉన్న ఫొటోలు, వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. వివేకా రెండో వివాహం వల్లే ఆయన కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. తన రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని.. తన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పారు. దీంతో ఉలిక్కిపడ్డ వివేకా అల్లుడు, సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆస్తి వారసత్వం తనకే దక్కాలని, రాజకీయ వారసత్వం తనకే దక్కాలని వివేకా పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పట్టు బట్టారు. ఆ విభేదాలతోనే వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ పులివెందులను వదిలేసి హైదరాబాద్‌లో కుమార్తె సునీత నివాసంలో ఉండేవారు. ఇక సునీత.. షమీమ్‌ను తీవ్రంగా దూషిస్తూ వాట్సాప్ సందేశాలు పంపారు. ఆ విషయాన్ని కూడా షమీమ్.. వివేకా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాలను షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూస్పష్టంగా పేర్కొన్నారు. షమీమ్ తన వాంగ్మూంలో వెల్లడించిన విషయాలు ఇవీ.. రెండో పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు.. వివేకా రెండో పెళ్లిని ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సునీత ఏకంగా షమీమ్‌కు ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారు. శివప్రకాశ్‌రెడ్డి కూడా షమీమ్ బావకు ఫోన్ చేసి తీవ్రంగా దూషించడంతో ఆయన కుటుంబం పులివెందుల వదిలివెళ్లిపోయింది. ఆ విషయం తెలిసి వివేకా తీవ్ర ఆగ్రహంతో శివప్రకాశ్‌రెడ్డి కాలర్ పట్టుకుని నిలదీశారు. షమీమ్‌ను తాను రెండో పెళ్లి చేసుకున్నానని.. ఆమె తన భార్యని స్పష్టం చేశారు. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసమే కక్ష గట్టారు.. 2013 నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డిల నుంచి షమీమ్‌కు వేధింపులు తీవ్రమయ్యాయి. 2014లో వివేకా, షమీమ్‌లకు బాబు పుట్టాడు. ఆ బాబుకు షెహెన్ షా అనే పేరుపెట్టి ఆస్తిలో వాటా ఇస్తాననడంతోపాటు తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని కూడా వివేకా చెప్పారు. వివేకా మొదటి భార్యకు కుమారుడు లేకపోవడంతో ఆయన ఆస్తికి ఏకైక వారసుడిని కావాలని అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి భావించారు. ఆయన రాజకీయ వారసుడిని కావాలని నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పట్టుదలగా ఉండేవారు. దీంతో వారిద్దరూ వివేకానందరెడ్డిపై కక్ష గట్టారు. బైరటీస్ గనులు ఉన్న నాలుగు ఎకరాల భూమిని షమీమ్ కుమారుడి పేరున రాయాలని వివేకా భావించారు. కానీ అందుకు సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ నాలుగు ఎకరాల భూమిని శివప్రకాశ్‌రెడ్డి తన పేరున రాయించేసుకున్నారు. అంతేకాకుండా వివేకా అప్పటికే షమీమ్‌కు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను కూడా బలవంతంగా శివప్రకాశ్‌రెడ్డి తీసేసుకున్నారు. షమీమ్‌ను దూషించిన సునీత సునీత.. వివేకా రెండో భార్య షమీమ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ఆమెను తీవ్రంగా దూషించారు. సునీత తనను ఎలా దూషించిందీ చెబుతూ షమీమ్.. వివేకాకు వాట్సాప్ సందేశాలు పంపారు. వివేకా హత్య కేసును దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ఆ వాట్సాప్ చాటింగ్‌లను అప్పట్లోనే వెలికి తీశారు కూడా. అయినా సరే తన తండ్రి వివేకా రెండో వివాహం గురించి తనకు తెలీయదని సునీత చెప్పడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. వివేకా హత్య కేసు వెనుక ఉన్న కుట్రను బయటకు రాకుండా చేసేందుకే ఆమె ఇలా అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నది స్పష్టమవుతోంది. ఒంటరి అయిన వివేకా.. వివేకానందరెడ్డిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా వేధించారు. కుటుంబానికి చెందిన కంపెనీలలో డైరెక్టర్‌గా ఆయనకు ఉన్న చెక్ పవర్‌ను తొలగించారు. ఆయన్ని ఒంటరిగా పులివెందులలో విడిచిపెట్టి కుటుంబసభ్యులు అందరూ హైదరాబాద్‌లో ఉండేవారు. దీంతో రోజువారి ఖర్చులకు కూడా ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పులు తీర్చడానికి హైదరాబాద్ మణికొండలో ఉన్న తన ఇంటిని కూడా 2018లో విక్రయించారు. -
వివేకాపై కక్ష గట్టింది ఆ ఇద్దరే..
సాక్షి, అమరావతి: ‘మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డికి ఆయన ఇద్దరు బావమరుదులు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి నుంచే ముప్పు ఉండేది. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసం వారే ఆయనపై కక్షగట్టారు’.. అని వివేకానందరెడ్డి రెండో భార్య షేక్ షమీమ్ స్పష్టంచేశారు. ‘వివేకానందరెడ్డి హత్య తరువాత శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే ఎర్ర గంగిరెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారు’ అని కూడా ఆమె తేల్చిచెప్పారు. ఈ హత్య కేసులో షమీమ్ 2020 అక్టోబరులోనే సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డితో తన రెండో వివాహం.. దానిపై ఆయన కుమార్తె సునీత, అల్లుడు–చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ఎంతగా విభేదించింది.. తనను ఎంతగా బెదిరించిందీ.. వివేకానందరెడ్డిని ఎంతగా వేధించింది మొదలైన సంచలనాత్మక విషయాలను ఆమె సవివరంగా తన వాంగ్మూలంలో వెల్లడించారు. షేక్ షమీమ్ వాంగ్మూలంలో పేర్కొన్న విషయాలు ఆమె మాటల్లోనే.. మా పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు వైఎస్ వివేకానందరెడ్డి నన్ను 2010లో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. మేం పెళ్లి చేసుకోవడాన్నే వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సునీత నాకు ఫోన్‌చేసి తీవ్రంగా బెదిరించారు. శివప్రకాశ్‌రెడ్డి మా బావగారికి ఫోన్‌చేసి తీవ్రంగా దూషించారు. దీంతో ఆయన కుటుంబం పులివెందుల వదిలివెళ్లిపోయింది. ఈ విషయాన్ని నేను వివేకానందరెడ్డికి చెప్పాను. దాంతో ఆయన శివప్రకాశ్‌రెడ్డి దగ్గరకు వెళ్లి కాలర్ పట్టుకుని మరీ మండిపడ్డారు. షమీమ్‌ను తాను రెండో పెళ్లి చేసుకున్నానని.. ఆమె నా భార్యని స్పష్టంచేశారు. అయినాసరే.. శివప్రకాశ్‌రెడ్డి మాత్రం వివేకా మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. మమ్మల్ని బెదిరిస్తూనే వచ్చారు. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసమే కక్ష 2013 నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిల నుంచి నాకు వేధింపులు ఎక్కువయ్యాయి. 2014లో మాకు బాబు పుట్టాడు. షేర్ షా అనే పేరుపెట్టాం. మా కుమారుడికి ఆస్తిలో వాటా ఇస్తాననడంతోపాటు తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని కూడా వివేకానందరెడ్డి చెప్పారు. దాంతో నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిలలో ఆందోళన మొదలైంది. వివేకానందరెడ్డికి మొదటి భార్యతో కుమారుడు లేకపోవడంతో ఆయన ఆస్తికి ఏకైక వారసుడిని కావాలని అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి భావించారు. ఆయన రాజకీయ వారసుడిని కావాలని నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పట్టుదలగా ఉండేవారు. కానీ, మాకు పుట్టిన బిడ్డను వారసుడిగా ప్రకటిస్తానని చెప్పడంతో వారిద్దరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వివేకానందరెడ్డిని మా ఇంటికి రాకుండా కట్టడి చేసేందుకు యత్నించేవారు. ఆయన్ను కూడా తీవ్రంగా బెదిరించేవారు. ఆ నాలుగెకరాలను శివప్రకాశ్‌రెడ్డి రాయించుకున్నారు.. బెరైటీస్ గనులు ఉన్న నాలుగెకరాల భూమిని నా కుమారుడి పేరున రాయాలని వివేకానందరెడ్డి భావించారు. కానీ, అందుకు సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ భూమిని శివప్రకాశ్‌రెడ్డి తన పేరున రాయించేసుకున్నారని వివేకానందరెడ్డే నాకు చెప్పి బాధపడ్డారు. అప్పటి నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిల నుంచి నాకు బెదిరింపులు మరింత తీవ్రమయ్యాయి. వివేకాకు ఆర్థిక ఇబ్బందులు.. ఆయన్ని ఒంటరిని చేశారు.. వివేకానందరెడ్డిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వేధించారు. కుటుంబానికి చెందిన కంపెనీలలో డైరెక్టర్‌గా ఆయనకు ఉన్న చెక్ పవర్‌ను తొలగించారు. ఆయన్ని ఒంటరిగా పులివెందులలో విడిచిపెట్టి కుటుంబసభ్యులు అందరూ హైదరాబాద్‌లో ఉండేవారు. దాంతో రోజువారి ఖర్చులకు కూడా ఆయన తీవ్ర ఇబ్బందులు పడేవారు. అప్పులు తీర్చడానికి హైదరాబాద్ మణికొండలో ఉన్న తన ఇంటిని కూడా 2018లో విక్రయించారు. రూ.8 కోట్లు ఇస్తానన్నారు.. బెంగళూరులో ఓ భూ సెటిల్మెంట్ ద్వారా రూ.8 కోట్లు వస్తాయని వాటిని నాకు ఇస్తానని వివేకానందరెడ్డి చెప్పారు. కడపలోగానీ హైదరాబాద్‌లోగానీ ఓ ఇల్లు కొనిస్తానని.. మా కుమారుడిని బాగా చదివిస్తానని చెప్పారు. ఇది వివేకానందరెడ్డి స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి ద్వారా నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డికి తెలిసే అవకాశం ఉంది. గంగిరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. వారిద్దరూ కుట్ర ప్రకారం వివేకానందరెడ్డి చుట్టూ తమ మనుషులనే పెట్టారు. దస్తగిరితోపాటు అందరూ వాళ్ల మనుషులే. హైదరాబాద్‌లో నేను ఉంటున్న ఇంటి అడ్రస్ కూడా దస్తగిరికి తెలియకుండా వివేకానందరెడ్డి జాగ్రత్తపడేవారు. ఓసారి దస్తగిరి మామిడిపళ్లు పట్టుకుని హైదరాబాద్ వస్తే.. మా ఇంటికి కాకుండా మరోచోట అప్పగించమని చెప్పారు. దస్తగిరి నుంచి నాకు ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతోనే అలా చేశారు. వివేకానందరెడ్డి హత్య తరువాత శివప్రకాశ్‌రెడ్డి ఆదేశాలతోనే ఎర్ర గంగిరెడ్డి ఆధారాలను ధ్వంసం చేశారు. వివేకానందరెడ్డి మృతదేహాన్ని బెడ్రూమ్ నుంచి హాలులోకి తేవడం, ఆధారాలను ధ్వంసం చేయడం అంతా దగ్గరుండీ చేయించింది ఎర్ర గంగిరెడ్డే. శివప్రకాశ్‌రెడ్డి చెప్పడంతోనే ఆయన అలా చేశారు. భయంతోనే వెళ్లలేదు.. 2019, మార్చి 15న ఉ.10గంటల సమయంలో వివేకానందరెడ్డి మరణించారని నాకు తెలిసింది. వెంటనే మా చెల్లితో కలిసి పులివెందుల వెళ్లాలని అనుకున్నా. కానీ, శివప్రకాశ్‌రెడ్డికి భయపడే వెళ్లలేదు. ఎందుకంటే 2012లో ఓసారి వివేకానందరెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు ఆయన్ని చూసేందుకు ఇంటికి వెళ్తే నన్ను శివప్రకాశ్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లనివ్వకుండా బయటకు బలవంతంగా గెంటేశారు. అందుకే 2019లో ఆయన హత్యకు గురైనా సరే పులివెందుల వెళ్లేందుకు సాహసించలేకపోయాను. ఐఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వివేకానందరెడ్డి 2017లో ఒక ఐఫోన్ కొని నాకు ఇచ్చారు. 2019లో ఆయన హత్యకు గురైన తరువాత పోలీసులు వచ్చి ఆ ఐఫోన్‌ను తీసుకెళ్లిపోయారు. దానిపై నాకు ఎలాంటి రశీదు కూడా ఇవ్వలేదు. నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డే ఆ ఫోన్‌ను పోలీసుల ద్వారా నా దగ్గర నుంచి తీసుకున్నారేమోనని ఆ అనుమానం. -
గుండె నిండా బాధ
గుండె నిండా బాధ సిరిసిల్ల, ఈ ఆరేళ్ల చిన్నారి పేరు ఎండీ నజీర్. చందుర్తి మండలం రుద్రంగికి చెందిన శమీమ్-అంకూస్ దంపతుల కుమారుడు. శమీమ్ బుగ్గలు అమ్ముతుండగా, అంకూస్ బిందెలకు మాట్లు వేస్తూ సంచార జీవనం సాగిస్తున్నారు. నజీర్‌కు నెలరోజులుగా దమ్ము, దగ్గు వస్తోంది. పది రోజుల కిందట జ్వరం రావడంతో సిరిసిల్ల పిల్లల ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన డాక్టర్ ప్రసాదరావు నజీర్‌కు కార్డియోమయోపతి జబ్బు ఉన్నట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు నిరుపేద తల్లిదండ్రులు అప్పు చేసి మరి నజీర్‌ను కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, ఆపరేషన్ చేసే అవకాశం లేదని, మందులతోనే వైద్యం చేస్తూ తగ్గించాల్సి ఉంటుందని చెప్పారు. సంచార జీవనం సాగించే ఆ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి. ఒక్కగానొక్క కుమారుడు నజీర్‌కు వైద్యం చేయించేందుకు చేతిలో డబ్బుల్లేక అసహాయ స్థితిలో హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు తరలించారు. ప్రస్తుతం సిరిసిల్ల సృజన్ పిల్లల ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న నజీర్ గుండె సాధారణంగా ఉండాల్సిన దానికన్నా మూడేరెట్లు అధికంగా ఉందని డాక్టర్ ప్రసాద్‌రావు తెలిపారు. ఇలాంటివి అరుదైన కేసులని, మందులతోనే తగ్గించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం బాలుడు మృత్యువుతో పోరాడుతున్నట్లు తెలిపాడు. ఆర్థికంగా నిరుపేదలైన నజీర్ తల్లిదండ్రులు దేవునిపై భారం వేసి దీనంగా చూస్తున్నారు. ఇప్పటికే రూ.30 వేల వరకు అప్పులు చేశామని.. మరో రూ.లక్ష వరకు అవసరమవుతాయని.. ఇక అప్పులు కూడా దొరకడం లేదని.. దాతలెవరైనా ఆర్థికసాయం అందిస్తే తమ కుమారుడు బతికే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా ఆదుకునే మానవతావాదులు, దాతలు 9640527978, 9618987085 నంబర్లలో సంప్రదించవచ్చు.