తన తండ్రి వివేకా రెండో వివాహం గురించే తెలియదట
షమీమ్‌ను రెండో పెళ్లి చేసుకోవడంతోనే ఆయన కుటుంబంలో విభేదాలు
వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖరరెడ్డి కన్ను
రాజకీయ వారసత్వం కోసం వివేకా బావమరిది శివప్రకాష్‌రెడ్డి పట్టు
షమీమ్‌ను బెదిరించిన సునీత భర్త, ఆయన సోదరుడు
సునీత సైతం వాట్సాప్‌లో తీవ్ర దూషణలు ∙కుమార్తెపై వివేకాకు ఫిర్యాదు చేసిన షమీమ్
ఆ వాట్సాప్ సందేశాలను అప్పట్లోనే వెలికి తీసిన సిట్
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి.. షమీమ్ అనే మహిళను పెళ్లి చేసుకోవడం, ఆమెతో ఒక కుమారుడిని కూడా కనడం వల్లే ఆయన కుటుంబంలో విభేదాలు చెలరేగి.. హత్యకు దారితీశాయని ఊరువాడా కోడై కూస్తున్నా.. వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత మాత్రం తన తండ్రి రెండో వివాహం గురించి తనకు తెలియదని చెబుతుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ‘వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారట కదా.. ఆమెతో ఆయనకు ఓ కుమారుడు ఉన్నాడట కదా.. అందుకే మీ కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయంట కదా’ అని కొద్దిరోజుల క్రితం నర్రెడ్డి సునీత హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నించారు.
దీనికి ఆమె తన రెండు భుజాలు ఎగురవేస్తూ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. ‘ఐ డోంట్ నో (నాకు తెలియదు)’ అని. నిజంగానే వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్న విషయం సునీతకు తెలీదా అంటే ఎందుకు తెలీదు...పూర్తిగా తెలుసు అనే సమాధానమే వస్తోంది. షమీమ్ అనే ముస్లిం మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్న విషయం బహిరంగ రహస్యం. షమీమ్‌ను వివేకా 2010లో ముస్లిం సంప్రదాయం ప్రకారం రెండో వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ 2014లో ఓ కుమారుడు జన్మించారు. ఆ కుమారుడికి షెహెన్ షా అనే పేరు కూడా పెట్టారు.
వివేకా తన రెండో భార్య షమీమ్, కుమారుడు షెహెన్ షాతో కలసి ఉన్న ఫొటోలు, వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. వివేకా రెండో వివాహం వల్లే ఆయన కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. తన రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని.. తన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పారు. దీంతో ఉలిక్కిపడ్డ వివేకా అల్లుడు, సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆస్తి వారసత్వం తనకే దక్కాలని, రాజకీయ వారసత్వం తనకే దక్కాలని వివేకా పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పట్టు బట్టారు.
ఆ విభేదాలతోనే వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ పులివెందులను వదిలేసి హైదరాబాద్‌లో కుమార్తె సునీత నివాసంలో ఉండేవారు. ఇక సునీత.. షమీమ్‌ను తీవ్రంగా దూషిస్తూ వాట్సాప్ సందేశాలు పంపారు. ఆ విషయాన్ని కూడా షమీమ్.. వివేకా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాలను షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూస్పష్టంగా పేర్కొన్నారు. షమీమ్ తన వాంగ్మూంలో వెల్లడించిన విషయాలు ఇవీ..
రెండో పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు..
వివేకా రెండో పెళ్లిని ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సునీత ఏకంగా షమీమ్‌కు ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారు. శివప్రకాశ్‌రెడ్డి కూడా షమీమ్ బావకు ఫోన్ చేసి తీవ్రంగా దూషించడంతో ఆయన కుటుంబం పులివెందుల వదిలివెళ్లిపోయింది. ఆ విషయం తెలిసి వివేకా తీవ్ర ఆగ్రహంతో శివప్రకాశ్‌రెడ్డి కాలర్ పట్టుకుని నిలదీశారు. షమీమ్‌ను తాను రెండో పెళ్లి చేసుకున్నానని.. ఆమె తన భార్యని స్పష్టం చేశారు.
ఆస్తి, రాజకీయ వారసత్వం కోసమే కక్ష గట్టారు..
2013 నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డిల నుంచి షమీమ్‌కు వేధింపులు తీవ్రమయ్యాయి. 2014లో వివేకా, షమీమ్‌లకు బాబు పుట్టాడు. ఆ బాబుకు షెహెన్ షా అనే పేరుపెట్టి ఆస్తిలో వాటా ఇస్తాననడంతోపాటు తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని కూడా వివేకా చెప్పారు.
వివేకా మొదటి భార్యకు కుమారుడు లేకపోవడంతో ఆయన ఆస్తికి ఏకైక వారసుడిని కావాలని అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి భావించారు. ఆయన రాజకీయ వారసుడిని కావాలని నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పట్టుదలగా ఉండేవారు. దీంతో వారిద్దరూ వివేకానందరెడ్డిపై కక్ష గట్టారు.
బైరటీస్ గనులు ఉన్న నాలుగు ఎకరాల భూమిని షమీమ్ కుమారుడి పేరున రాయాలని వివేకా భావించారు. కానీ అందుకు సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ నాలుగు ఎకరాల భూమిని శివప్రకాశ్‌రెడ్డి తన పేరున రాయించేసుకున్నారు. అంతేకాకుండా వివేకా అప్పటికే షమీమ్‌కు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను కూడా బలవంతంగా శివప్రకాశ్‌రెడ్డి తీసేసుకున్నారు.
షమీమ్‌ను దూషించిన సునీత
సునీత.. వివేకా రెండో భార్య షమీమ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ఆమెను తీవ్రంగా దూషించారు. సునీత తనను ఎలా దూషించిందీ చెబుతూ షమీమ్.. వివేకాకు వాట్సాప్ సందేశాలు పంపారు. వివేకా హత్య కేసును దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ఆ వాట్సాప్ చాటింగ్‌లను అప్పట్లోనే వెలికి తీశారు కూడా.
అయినా సరే తన తండ్రి వివేకా రెండో వివాహం గురించి తనకు తెలీయదని సునీత చెప్పడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. వివేకా హత్య కేసు వెనుక ఉన్న కుట్రను బయటకు రాకుండా చేసేందుకే ఆమె ఇలా అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నది స్పష్టమవుతోంది.
ఒంటరి అయిన వివేకా..
వివేకానందరెడ్డిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా వేధించారు. కుటుంబానికి చెందిన కంపెనీలలో డైరెక్టర్‌గా ఆయనకు ఉన్న చెక్ పవర్‌ను తొలగించారు.
ఆయన్ని ఒంటరిగా పులివెందులలో విడిచిపెట్టి కుటుంబసభ్యులు అందరూ హైదరాబాద్‌లో ఉండేవారు. దీంతో రోజువారి ఖర్చులకు కూడా ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పులు తీర్చడానికి హైదరాబాద్ మణికొండలో ఉన్న తన ఇంటిని కూడా 2018లో విక్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment