కడప అర్బన్ : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి చేస్తున్న అరాచకాలలో మరో సంఘటన పులివెందుల పట్టణంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై బాధితురాలు షేక్ గులాబి పులివెందుల అర్బన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ‘నేను నా భర్త గుగూడు వల్లితో కలసి పులివెందుల టౌన్ భాకరాపురం, జయమ్మకాలనీలో ఉంటున్నాం. నా భర్త ట్రాక్టర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నా భర్త మొదటి భార్య 9 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది.
నన్ను 8 ఏళ్ల క్రితం గుగూడు వల్లి రెండో వివాహం చేసుకున్నాడు. అయితే మొదటి భార్యకు గూగుడు వల్లి(16), రేష్మా (15) సంతానం కాగా.. నాకు గుగూడు వల్లికి ఇమ్రాన్, చాందినీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరం కలసి ఉంటున్నాం. అయితే మా కుటుంబ అవసరాల నిమిత్తం మా ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న షేక్ దస్తగిరి దగ్గర ఆరు నెలల క్రితం రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నాం. పూచీకత్తుగా ఇంటి పత్రాలను ఇచ్చాము. తరువాత బాకీ డబ్బుకు వడ్డీగా వారానికి రూ. 4 వేలు చొప్పున దస్తగిరికి ఇస్తూ వస్తున్నాం.
తర్వాత మధ్యలో కొన్ని వారాలు మేము వడ్డీ కట్టలేకపోయాం. దీంతో అసలుకు వడ్డీతో కలిపి రూ.1,10,000 మాతో ప్రామిసరీ నోటు దస్తగిరి రాయించుకున్నాడు. కాగా డబ్బు ఇవ్వాలని నా భర్తను ఒత్తిడి చేస్తూ వస్తున్నాడు. ఈ నెల 13న డబ్బు చెల్లిస్తామని చెప్పాం.. అయితే సర్దుబాటు కాక చెల్లించలేదు. ఈ క్రమంలో ఈ నెల 17న నేను, నా భర్తతో కలసి బంధువుల ఇంటికి వెళ్లాం. 18వ తేదీ సాయంత్రం దస్తగిరి మాకు ఫోన్ చేసి డబ్బు చెల్లించకుండా ఇంటి నుంచి పారిపోయారు.. మీ కుమారుడు గూగుడు వల్లిని నిర్బంధించాను. డబ్బు చెల్లించి మీ కొడుకును తీసుకెళ్లండి.. లేకపోతే మీ కొడుకును కొడతాం.. అని బెదిరించాడు. నా కొడుకుతో ఫోన్‌లో మాట్లాడించాడు. ‘నన్ను దస్తగిరి కొడుతున్నాడు..’ అని మా కొడుకు బాధ పడుతున్నాడని.. పైగా దస్తగిరి భార్య షబానా కూడా ఫోన్ చేసి మీ కొడుకుకు ఇప్పటికే ఉదయం.. సాయంత్రం ఒక కోటింగ్ అయిపోందని.. నువ్వు వచ్చి మాట్లాడకపోతే నీ కొడుకు మా చేతిలో చచ్చిపోతాడని బెదిరిస్తున్నారు. నా కుమారుడిని వారు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది సార్.. దస్తగిరి, అతని భార్య షబానాపై చర్యలు తీసుకుని, మా కుమారుడిని అప్పగించండి.. సార్.. అంటూ’ గులాబి పోలీసులను వేడుకుంది. ఈ మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు దస్తగిరిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment