సాక్షి, వైఎస్సార్ జిల్లా: చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు అంతా మోసం, దగా అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఇదే సమయంలో సంపద సృష్టిస్తా అని చెప్పిన చంద్రబాబు.. మామూలు ఆర్ అండ్ బీ రోడ్లకు కూడా టోల్ టాక్స్ వేయబోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
కాగా, రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురంలో స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం 14వేల కోట్లు అప్పు చేసి పెన్షన్లు, ఉద్యోగస్థులకు జీతాలు మాత్రమే ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగస్థులకు పెన్షన్లు అందివ్వలేని ప్రభుత్వం ఇది. రెండున్నర నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమలు కాలేదు. నేను సంపద సృష్టిస్తా అని చెప్పిన చంద్రబాబు.. ఎక్కడ నీ సంపద సృష్టి. అనేక అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ఒక్కటీ నెరవేర్చలేదు. ప్రజలందరూ పరిస్థితిని గమనించి ప్రభుత్వాన్ని నిలదీయాలి. చంద్రబాబు సీఎం అయ్యాక తన నైజాన్ని ప్రజలకు మరోసారి చూపించాడు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పలావే పెడుతున్నాడు.. నేను బిర్యానీ పెడతానని ఓట్లు దండుకున్నాడు చంద్రబాబు. సూపర్ సిక్స్ పథకాలు అంతా మోసం, దగా. ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించి ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలి.
మద్యం ప్రియులకు కొత్త పాలసీ అంటూ కూటమి సర్కార్ మోసం చేస్తోంది. ఉచిత ఇసుక పాలసీ అంటూ ఎక్కువ ధరలకు అమ్ముతోంది. రైతన్నకు అన్నదాత సుఖీభవ అంటూ దగా చేసింది. స్కూల్ విద్యార్థులకు తల్లికి వందనం అంటూ పంగనామం పెట్టింది. ఇవాళ ప్రజలు చంద్రబాబును నమ్మి మోసపోయారు. సంపద సృష్టిస్తామన్న బాబు ప్రభుత్వంలో మామూలు ఆర్ అండ్ బీ రోడ్లకు కూడా టోల్ టాక్స్ రాబోతోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక దాడులు, హత్యలు ఎక్కువయ్యాయి. వైఎస్సార్‌సీపీ నాయకులపైనా, వారి మద్దతుదారులపైనా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
పవన్‌పై సెటైర్లు..
ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా నోరు మెదపడం లేదు. వీటిపై చంద్రబాబు స్క్రిప్టు రాలేదేమో.. వస్తే యాక్టర్ యాక్షన్ చేస్తాడు అనుకుంటా. రాష్ట్రంలో జూదం, మట్కా, దొంగ సారాయి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, ఇసుక, మట్టి అక్రమ రవాణా పేట్రేగిపోతోంది అంటూ కామెంట్స్ చేశారు.
ఇదే సమయంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వక్స్ బోర్డ్ చట్ట సవరణ సమంజసం కాదని పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. గతంలో కూడా రాష్ట్రానికి మేలు జరుగుతుందంటేనే ఎన్డీయే కూటమికి వైఎస్సార్‌సీపీ సపోర్టు చేసేది. ముస్లింల మనోభావాలు దెబ్బ తినకుండా వ్యతిరేకించిన పార్టీ వైఎస్సార్‌సీపీ. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో అందరికీ గౌరవం ఇచ్చేటట్టుగా మెలగాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment