బషీరాబాద్(వికారాబాద్): భారీ వర్షాలకు కాగ్నా నది ఉప్పొంగడంతో చిక్కుకుపోయిన 15 మంది ఏపీ కూలీలను ఎన్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందం క్షేమంగా బయటకు తీసుకొచ్చిన సంఘటన బుధవారం తెలంగాణ– కర్ణాటక సరిహద్దులోని జెట్టూరు వద్ద చోటుచేసుకుంది. స్థాని క పోలీసులు, కర్ణాటక అధికారులు తెలిపిన వివ రాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు, ఆత్మకూరుకు చెం దిన మూడు కుటుంబాలు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా బషీరాబాద్–కర్ణాటకలోని జెట్టూరు మం డలం క్యాద్గిర సమీపంలోని కాగ్నా నది ఒడ్డున ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో కూలి పనులకు వచ్చారు. వీరు ఇక్కడే గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం ఉదయం 7గంటల ప్రాంతంలో వీరు నివసిస్తున్న గుడిసెల్లోకి వరద నీరు చేరింది.
దీంతో అల్కయ్య, పద్మ, సురేశ్, కుమారి, వెంగమ్మ, మేరీ, అభిరామ్, రమణయ్య, తేజ, వెంకటరమణమ్మ, ఏడుకొండలు, కల్పన, సువర్ణ, అభి.. పక్కనే నిర్మాణంలో ఉన్న కాగ్నా బ్రిడ్జిపైకి ఎక్కారు. అయితే నది ఉద్ధృత రూపం దాల్చడంతో పాటు, కర్ణాటక నుంచి వచ్చే మళ్లమర్రి నదుల సంగమం వద్ద ప్రవాహం పోటెత్తడంతో వీరు నిలబడిన వంతెన చుట్టూ కిలోమీటర్ మేర వరద చుట్టేసింది. విషయాన్ని కూలీలు తమను పనులకు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ సుబ్బారావుకు ఫోన్ ద్వారా చేరవేశారు. ఉదయం నుంచి రాత్రి 7వరకు సుమారు 12 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురు చూశారు. కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో బషీరాబాద్, సులైపేట్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. వారు రెండు బోట్లలో నదిలోకి వెళ్లి వంతెనపై ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాధితులకు గ్రామంలోని పాఠశాలలో ఆశ్రయం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment