దహెగాం(సిర్పూర్)/శ్రీరాంపూర్: పురిటినొప్పులు పడుతున్న ఓ గర్భిణిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు వెళ్లి గల్లంతైన ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పెద్దవాగులో బుధవారం గ్రామస్తులను వాగు దాటించేందుకు ప్రయత్నిస్తుండగా ఇద్దరు రెస్క్యూ సిబ్బంది గల్లంతయ్యారు. వీరి కోసం రాత్రి నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలిస్తుండగా.. గురువారం ఉదయం మృతదేహాలు లభ్యమయ్యాయి.
వివరాలు.. భారీ వర్షాలకు కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో పెద్దవాగు ఉప్పొంగి దహెగాం మండలంలో పలుచోట్ల ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన నేర్పల్లి సరస్వతికి బుధవారం పురిటి నొప్పులు రావడంతో దహెగాం పీహెచ్‌సీకి తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. దహెగాం, ఐనం, పెసరికుంట వద్ద పెద్దవాగు వరద కారణంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి.
మధ్యాహ్నం కాగజ్‌నగర్ రూరల్ సీఐ నాగరాజు, స్థానికులు ట్రాక్టర్ సాయంతో దహెగాం సమీపంలో ప్రధాన రహదారిపై వరద దాటే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ మొరాయించడంలో వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న సింగరేణి రెస్క్యూ టీంకు చెందిన ఆరుగురు తిరుపతి, మధుకర్, నర్సింగ్, చిలుక సతీష్, అంబాల రాము, గణేశ్ దహెగాంకు చేరుకున్నారు. గణేశ్ బయట ఉండగా మిగిలిన ఐదుగురు, సీఐ నాగరాజు, మర్రిపల్లి గ్రామానికి చెందిన బాదవత్ తిరుపతి, జర్పుల శ్యాం, జర్పుల సతీశ్ మొత్తం తొమ్మిది మంది తాడు సాయంతో వరద నీటిలోకి దిగారు.
ఒకరికొకరు రెండు మీటర్ల దూరంలో ఉంటూ దాటుతుండగా రెస్క్యూటీం సభ్యులు సీహెచ్ సతీశ్, రాము నీటిలో గల్లంతయ్యారు. మిగిలిన వారు ఒడ్డుకు చేరుకుని విషయం అధికారులకు తెలిపారు. అక్కడే ఉన్న ఆర్డీవో దత్తు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు చేరవేశారు. అదనపు కలెక్టర్ రాజేశం ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మూడు బృందాలతో గాలింపు..
విషయం తెలియగానే శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిపై చర్చించారు. శ్రీరాంపూర్ నుంచి మరో మూడు రెస్క్యూ బృందాలను ఘటన స్థలానికి పంపించారు. మందమర్రి, బెల్లంపల్లి నుంచి మరో రెండు బృందాలను పంపారు. పరిస్థితిని ఎప్పకటికప్పుడు అక్కడికి వెళ్లిన వారితో చర్చించారు
గర్భిణి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం..
బీబ్రా గ్రామంలో ఉన్న గర్భిణి నేర్పల్లి సరస్వతిని ఆస్పత్రికి తరలించేందుకు వరంగల్ నుంచి 22 సభ్యులతో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం దహెగాంకు చేరుకుంది. నాలుగు బోట్ల సాయంతో మెడికల్ సిబ్బంది గ్రామానికి బయలుదేరారు.
గనులపై ఆందోళన..
రామకృష్ణాపూర్ రామాలయం సమీపంలో నివాసం ఉంటున్న అంబాల రాము ఆర్కే 5 గనిలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్పందన, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. గని మేనేజర్ అబ్దుల్ ఖాదర్, సంక్షేమ అధికారి రణధీర్, టీబీజీకేఎస్ నేతలు మహేందర్‌రెడ్డి, నీలం సదయ్య కార్మికుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే నస్పూర్ షిర్కేలో నివాసం ఉంటున్న చిలుక సతీశ్ శ్రీరాంపూర్ ఓసీపీలో ఈపీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే ఆపరేషన్‌లో పాల్గొన్న రెస్క్యూ సభ్యులెవ్వరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రెస్క్యూ స్టేషన్ నుంచి వీరిని పంపిన అధికారులు జాకెట్లు ఇచ్చి పంపారా లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment