* ద.కొరియా తీరంలో నౌక మునక
* నలుగురి మృతి, 292 మంది గల్లంతు
సియోల్: దక్షిణ కొరియాలోని దక్షిణ తీరంలో ఘోరమైన ప్రమాదం సంభవించింది. 459 మంది తో ప్రయాణిస్తున్న నౌకలో ప్రమాదం తలెత్తి బుధవారం మెల్లమెల్లగా మునిగిపోయింది. ఇది మునగడానికి గంటల సమయం పట్టడంతో ఈలోగా హెలికాప్టర్లు, ఇతర నౌకల్లో అక్కడకు చేరుకున్న సహాయక సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయినా ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 55 మంది గాయాలతో బయటపడ్డారు. మరో 292 మంది జాడ లేదు. ఈ ప్రమాదం 1912లో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక ఉదంతాన్ని గుర్తుకుతెచ్చింది. నాటి ఘటనలోనూ నౌక కొన్ని గంటలపాటు మునగ్గా, లైఫ్‌బోట్ల సాయంతో పలువురిని కాపాడారు. ఆ ప్రమాదంలో 1,500 మంది దాకా చనిపోయారు.
తాజా ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. జాడ తెలియని వారిలో చాలామంది ఓడలోనే చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 146 మీటర్ల పొడవైన ఈ ఓడ ద.కొరియా వాయవ్య ప్రాంతంలోని ఇంచియాన్, జెజు దీవి మధ్య వారానికి రెండు సార్లు ప్రయాణిస్తుంది. ఆ క్రమంలో మంగళవారం రాత్రి ఇంచియాన్‌ను నుంచి బయలుదేరిన ఈ ఓడ 14 గంటల పాటు ప్రయాణించి పర్యాటక దీవి జెజు చేరాల్సి ఉంది. అయితే మరో మూడుగంటల్లో గమ్యాన్ని చేరుతుందనగా బ్యాంగ్‌పుంగ్ దీవికి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.
ఓడలో16 నుంచి 17 ఏళ్ల వయసున్న 325 మంది హైస్కూల్ విద్యార్థులు, 15 మంది టీచర్లు, 89 మంది సాధారణ ప్రయాణికులు, 30 మంది సిబ్బంది ఉన్నారని ద.కొరియా భద్రత మంత్రి కంగ్ యంగ్ యు చెప్పారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళా సిబ్బంది, ఒక హైస్కూల్ బాలుడు ఉన్నారు. 164 మందిని కాపాడామన్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం సహాయక చర్యలపైనే దృష్టి పెట్టామని చెప్పారు. నౌక మునిగిపోవడానికి గల కారణాలు తర్వాత అన్వేషిస్తామని అధికారులు చెప్పారు. 37 మీటర్ల లోతున్న సముద్రంలో బురద ఎక్కువగా ఉండడంతో నీటి లోపల అన్వేషణకు కష్టతరంగా ఉందన్నారు.
మరో ‘టైటానిక్’ ప్రమాదం
Published Thu, Apr 17 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM
Advertisement
Advertisement