ఐ మిస్ యూ ... అంటూ ఎస్ఎంఎస్లు
ఓ వైపు పిల్లలు, పెద్దలు రక్షించండి, కాపాడండి అంటూ అర్తనాదాలు... మరో వైపు కళ్ల వెంట దారాపాతంగా కారుతున్న కన్నీరు. మృత్యువు తమను కబళించేందుకు సిద్ధంగా ఉందని తెలుసు... ఏ క్షణానైన మరణం తన కౌగిట్లోకి తమను బలవంతంగా లాక్కుపోతుంది. ఆ తరుణంలో ఆ చిన్నారి విద్యార్థులకు తల్లితండ్రులు, కుటుంబసభ్యులు గుర్తుకు వచ్చారు. అంతే ఇక ఆలస్యం చేయలేదు. తమ వద్ద ఉన్న సెల్ ఫోన్లు బయటకు తీశారు. తర్వాత క్షణం ఏం జరుగుతోందో తెలియని ఆ విద్యార్థులు తల్లితండ్రులపై ప్రేమ, ప్రమాదంలో చిక్కుకున్నామనే భయం, జీవితం ఇక లేదనే నిరాశలతో సమ్మిళితమైన సంక్షిప్త సందేశాల (ఎస్ఎంఎస్)ను తమ తమ తల్లితండ్రులకు పంపారు.
ఐ లవ్ యూ మమ్, ఐ లవ్ యూ డాడ్ , ఐ మిస్ యూ... జీవితంలో మరోసారి ఈ సందేశం పంపేందుకు అవకాశం రాకపోవచ్చు అంటూ షిన్ యంగ్ జిన్ అనే విద్యార్థి తన తల్లితండ్రులకు ఎస్ఎంఎస్ పంపగా, తాను ప్రయాణిస్తున్న నౌక ఓ పక్కకు ఒరిగిపోయింది... తమను రక్షించండి అంటూ మరో విద్యార్థి కిమ్ వూంగ్ కి తన సోదరుడిని ఎస్ఎంఎస్ ద్వారా వేడుకున్నాడు. ఆ ఎస్ఎంఎస్లు గురువారం దేశవ్యాప్తంగా వివిధ మీడియాలు సంస్థలు తమ తమ పత్రికలలో ప్రచురించాయి. విహార యాత్రకు వెళ్లి విషాద యాత్రగా మారిన తరుణంలో కన్న బిడ్డలు జాడ తెలియక ఆయా కుటుంబాలు విద్యార్థులు పంపిన సందేశాలను చూసి రోధిస్తున్న తీరు దేశవ్యాప్తంగా ప్రజలను శోక సంద్రంలో ముంచింది.
దాదాపు 459 మంది (అత్యధిక మంది విద్యార్థులు)తో విహార యాత్రకు బయలుదేరిన ఫెర్రీ (నౌక) బుధవారం ఉదయం దక్షిణ కొరియాలోని దక్షిణ తీరంలో ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఫెర్రీ క్రమక్రమంగా నీటీలో మునిగిపోయింది. ఆ దుర్ఘటనపై సమాచారం అందుకున్న దక్షిణ కొరియా ఉన్నతాధికారులు వెంటనే తీర గస్తీ దళం, సైన్యాన్ని రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టింది. ఆ ప్రమాదంలో నలుగురు మరణించగా, 55 మంది గాయాలతో బయటపడ్డారు. మరో 292 మంది జాడా ఇంత వరకు తెలియరాలేదు. కొరియాలో సంభవించిన ఫెర్రీ దుర్ఘటన 1912లో ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. అనాటి నౌక దుర్ఘటనలో పలువురుని సైన్యం కాపాడిన 1500 మంది జల సమాధి అయిన సంగతి తెలిసిందే.