
సాక్షి, కామారెడ్డి: అడవిలో షికారుకెళ్లి గుట్టల మధ్య ఇరుక్కుపోయిన రెడ్డిపేటకు చెందిన చాడ రాజు సురక్షితంగా బయటపడ్డాడు. దాదాపు 43 గంటలుగా గుహలోనే తలకిందులుగా ఉన్న రాజును.. పోలీసులు, గ్రామస్తులు 18 గంటల పాటు శ్రమించి గుహ నుంచి బయటకు తెచ్చి, ప్రాణాలు కాపాడారు. డ్రిల్లింగ్ మిషన్స్, జిలిటెన్ స్టిక్స్‌తో బండలను పేల్చుతూ, నాలుగు జేసీబీలతో మట్టిని బండరాళ్లను తొలగించుకుంటూ పక్కా ప్లాన్ ప్రకారం రెస్క్యూ టీమ్ ఆపరేషన్‌ను విజయవంతం చేసింది. రాజును అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
కాగా, రెడ్డిపేటకు చెందిన చాడ రాజు, మహేశ్‌లు మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో సింగరాయపల్లి అటవీ ప్రాంతంలోకి షికారు కెళ్లారు. ఈ క్రమంలో గుట్టపై పెద్ద బండరాళ్ల మధ్య ఇద్దరూ ఇరుక్కుపోయారు. మహేశ్ ఎట్టకేలకు మంగళవారం పొద్దుపోయాక బయటకు వచ్చాడు. కానీ చాడ రాజు అందులోనే చిక్కుకుపోవడంతో మహేశ్ కూడా రాత్రంతా అక్కడే ఉన్నాడు.
బుధవారం మధ్యాహ్నం వరకు రాజుకు మహేశ్ నీళ్లు, ఆహారం తీసుకెళ్లి ఇచ్చాడు. అప్పటికీ అతను బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ అధికారులు.. రెడ్డిపేట, సింగరాయపల్లి గ్రామస్తులతో కలిసి రాజును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.