సాక్షి, కామారెడ్డి: పేకాట ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని మృతుడి బంధువులు ఆరోపిస్తుండగా.. తామెమరినీ కొట్టలేదని పోలీసులు పేర్కొంటున్నారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో ఈ నెల 4న (దీపావళి పండుగ రోజు) కొందరు పేకాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ తొమ్మిది మంది పోలీసులకు చిక్కారు. అందులో భూమబోయి (55) అనే వ్యక్తి అక్కడే పడిపోయి అస్వస్థతకు గురయ్యాడు. అతడిని బాన్సువాడ ఆస్పత్రికి, అక్కడి నుంచి నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అయితే పోలీసులు కొట్టడం మూలంగానే తలకు గాయమై భూమబోయి అస్వస్థతకు గురయ్యాడని బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తూ 5వ తేదీన పోలీసు స్టేషన్‌కు తరలివచ్చి ఆందోళనకు దిగారు. రోజంతా అక్కడే ఆందోళన చేశారు. తామెవరినీ కొట్టలేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందిన భూమబోయి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో మృతదేహాన్ని ఇవ్వాలన్నా, పోస్టుమార్టం చేయాలన్నా ఎఫ్‌ఐఆర్ నమోదై ఉండాలని అక్కడి అధికారులు పేర్కొన్నారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులు కొట్టడం మూలంగానే చనిపోయాడని ఫిర్యాదు చేయడాని కి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు, మృతుడి బంధువుల మధ్య గురు, శుక్రవారాల్లో రెండు రో జుల పాటు చర్చలు జరిగాయి.
పోలీసుల తప్పిదం ఏమీలేదని, కొట్టలేదని పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరికి నియోజక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు తలదూర్చి మృతుడి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇవ్వడంతో వారు శాంతించినట్టు సమాచారం. అనారోగ్యంతో చనిపోయినట్టు ఫిర్యాదు ఇవ్వడానికి మృతుడి బంధువులు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వివాదం సద్దుమణిగింది.
పోలీసులు కొట్టారన్నది అవాస్తవం
శాంతాపూర్ గ్రామంలో పేకాడుతున్నారన్న సమాచారంతో ఈ నెల 4న పోలీసు పార్టీ గ్రామానికి వెళ్లింది. అక్కడ పేకాడుతున్న వారిని పట్టుకున్నారు. అందులో భూమబోయి ఉన్నారు. ఆయనకు ఏదో అనారోగ్య సమస్య ఉండడంతో పడిపోయారు. అతడిని ఆస్పత్రికి తరలించారు. పేకాడుతున్న వారిలో ఏ ఒక్కరినీ పోలీసులు కొట్టలేదు. భూమబోయి మరణానికి పోలీసులు కారణం కాదు.
– శోభన్, సీఐ, బిచ్కుంద
గుండెపోటుతోనే మరణించాడు
కామారెడ్డి అర్బన్: శాంతాపూర్ గ్రామానికి చెందిన భూమబోయి(55) గుండెపోటు కారణంగా మృతి చెందారని ఎస్పీ శ్వేత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన డెత్ సమ్మరీలో భూమబోయి గుండెపోటుతో మరణించినట్టు ఉందని పేర్కొన్నారు. మృతుడు భూమబోయి వైద్య చరిత్ర, పేకాట వీడియోగ్రఫీ వివరాలు, అక్కడి సంఘటన వివరాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment