బస్‌డిపోలో గోడ దూకేందుకు ప్రయత్నిస్తున్న ఎలుగుబంటి, గుడ్డేలుగును వలవేసి పట్టుకున్న రెస్క్యూటీం
సాక్షి, జనగామ: అది జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయం.. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయం.. కార్యాలయం సమీపంలో ఓ నల్లటి ఆకారం... ఏదో జంతువు మాదిరిగా అటూ ఇటూ తిరుగుతోంది.. అది గమనించిన కొంత మంది యువకులు దగ్గరగా వెళ్లి చూస్తే ఎలుగుబంటి.. వారు భయభయంగానే దానిని తరిమివేసేందుకు ప్రయత్నించారు.. అది నేరుగా ఆర్టీసీ డిపోలో చొరబడి ఓ చెట్టెక్కి కూర్చొంది. విషయం తెలుసుకున్న ఆర్టీసీ, పోలీసు, అటవీశాఖల అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎలుగుబంటి కిందకు దిగే ప్రయత్నం చేయడంతో చెట్టుచుట్టూ ముళ్లకంపను వేశారు. పెద్ద ఎత్తున జనాలు గుమిగూడటంతో అది మరింత పైకి వెళ్లింది. చివరకు నాలుగు మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన అధికారులు ఎలాగోలా భల్లూకాన్ని బంధించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఎలా వచ్చింది...
చంపక్‌హిల్స్ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటి పసరమడ్ల, శామీర్‌పేట గ్రామాల మీదుగా 2.30 గంటలకు జనగామ పట్టణానికి చేరుకుంది. రోడ్డుపై వస్తున్న ఎలుగుబంటిని చూసిన కొమురవెల్లి స్పెషల్ ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రయాణికులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. డీసీసీ కార్యాలయం సమీపంలోని కుర్మవాడలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఎలుగుబంటిని ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు యువకులు కర్రలతో బెదిరించారు. దీంతో అది పరుగులు పెడుతూ ఆర్టీసీ బస్ డిపోలోకి చొరబడింది. గుడ్డేలుగును చూసి అందులో ఉన్న పలువురు సిబ్బంది లగెత్తారు. డిపోలోని ప్రహరీ పక్కనే వరంగల్ రోడ్డును ఆనుకుని ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కింది.
6 గంటలకు పారెస్ట్ అధికారులకుసమాచారం..
ఉదయం ఆరు గంటల సమయంలో ఫారెస్ట్ అధికారులకు గుడ్డేలుగు వచ్చిన సమాచారాన్ని అధికారులు అందించారు. మత్తుమందు.. డాక్టర్.. రెస్క్యూ టీం.. బోను.. వలలను వెంట బెట్టుకుని తొమ్మిది గంటలకు జనగామకు చేరుకున్నారు. జూసంరక్షణ పశువైద్యాధికారి ప్రవీణ్ కుమార్ గన్ సహాయంతో వరుసగా రెండుసార్లు మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. పదిహేను నిమిషాల తర్వాత కూడా గుడ్డేలుగు స్పృహలోనే ఉండడంతో.. మరో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఇరవై నిమిషాలు నిరీక్షించినా.. గుడ్డేలుగు కొంతమేర తప్పటడుగులు వేసినా.. మరుక్షణమే తేరుకుంది. అప్పటికే డిపో లోపలి భాగంతో పాటు వరంగల్ హైవే పై చెట్టుకు రెండు వైపులా వలలు వేసి సిద్ధంగా ఉంచారు.
చెట్టు పై నుంచి కిందకు ఎంతకూ రాకపోవడంతో గుడ్డేలుగును కర్రల సహాయంతో కిందకు నెట్టేసే ప్రయత్నం చేయడంతో.. వారిపైకి వచ్చే ప్రయత్నం చేసి.. మళ్లీ పైకి వెళ్లింది. ఇరవై నిమిషాల తర్వాత మెళ్లగా చెట్టు దిగే ప్రయత్నంలో వలలో పడేలా శతవిధాలా ప్రయత్నం చేశారు. చెట్టుపై నుంచి బస్‌డిపో గోడపై ఉన్న ఫెన్సింగ్ తీగలను చొచ్చుకుని..అందులో ప్రవేశించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫారెస్ట్ సిబ్బందితో పాటు ఆర్టీసీ సివిల్ ఇంజినీర్ బాబాపైకి గుడ్డేలుగు పరుగులు పెట్టడంతో వణికిపోయారు. తప్పించుకుందామనుకునే లోపే... గుడ్డేలుగు వారి పైకి వచ్చేసినంత పని చేసింది. ఆ సమయంలోనే అక్కడే న్న రోడ్డు రోలర్‌కు గుడ్డేలుగు బలంగా తాకడంతో... వారు తృటిలో ప్రా ణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్వల్ప గా యంతో ఇబ్బందులు పడ్డ గుడ్డేలుగు.. డిపోలోని సిబ్బంది రెస్ట్ తీసుకునే గది వెనకకు వచ్చి చేరింది. వలతో అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు.
గంటన్నర పాటు ముప్పు తిప్పలు..
డిపోలో చొరబడ్డ గుడ్డేలుగును పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ముప్పుతిప్పలు పడ్డారు. మూడు మత్తు ఇంజక్షన్లు ఇచ్చినా.. అటు వైపు వెళ్లిన వారిపైకి వచ్చేందుకు ప్రయత్నించిం ది. ప్రహరీ దూకి భవానీనగర్ వైపు వెళ్లేందుకు ఒకటికి రెండు సార్లు ప్రయత్నించి విఫలమైంది. గుడ్డేలుగును పట్టుకునే విజువల్స్‌ను కవరేజ్ చేస్తున్న మీడియాపైకి సైతం రంకెలు వేయడంతో పరుగులు పెట్టారు. రెండుసార్లు వలలో చిక్కినట్టే చిక్కుకుని.. సంకెళ్లను తెంపుకుని బయటకు వచ్చింది. అతికష్టం మీద...11.05 నిమిషాలకు గుడ్డేలుగును పట్టుకుని.. బోనులో బంధించారు. అనంతరం మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన ప్రదేశంలో.. ప్రాథమిక పరీక్షలు చేసి...ఏటూరునాగారం– తాడ్వాయి అటవీ ప్రాంతానికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ అర్బన్, జనగామ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రామలింగం పర్యవేక్షించగా, ఎఫ్‌ఆర్‌ఓలు శ్రీనివాస్‌కుమార్, మంగీలాల్ రేంజ్ ఆఫీసర్ పున్నంచందర్, కంపౌండర్ ఆకేష్, రిస్క్ టీం నాగేశ్వరావు, స్వామి, క్రిష్ణ ఉన్నారు.
అడవిలో ఆహారం లేకనే
అడవులు అంతరించి పోతుండడంతో మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తున్నాయని డీఎఫ్‌ఓ రామలింగం అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుమారు 12 సంవత్సరాల వయస్సు కలిగి.. 80 కేజీలు ఉంటుందన్నారు. అడవుల్లో తాగునీటి కొరత లేకుండా సాసర్ కుండీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి గాయాలు లేకుండా.. యాక్టివ్‌గా ఉండడంతో.. జనావాసాలు లేని తాడ్వాయి– ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో వదిలి పెడతామన్నారు. చెట్టు పైనుంచి సురక్షితంగా కిందకు దింపేందుకే సమయం ఎక్కువగా తీసుకున్నామన్నారు.
-డీఎఫ్‌ఓ రామలింగం
Comments
Please login to add a commentAdd a comment