
12 ఏజెన్సీల ఉన్నతాధికారులతో భేటీకానున్న రేవంత్‌రెడ్డి
హాజరుకానున్న జాతీయ, అంతర్జాతీయ నిపుణులు
ఇకపై ఏం చేయాలనే విషయమై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు నెల రోజులుగా జరుగుతున్న సహాయక చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో వ్యూహం మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం శాసనసభ కమిటీ హాల్‌లో సహాయక చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న 12 ఏజెన్సీల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఈ సమావేశానికి పిలిచింది.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) మాజీ డీజీ/ఆర్మీ మాజీ ఈఎన్‌సీ జనరల్ హర్పాల్ సింగ్, సొరంగాలకు సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ నిపుణుడు క్రిస్ కూపర్, బీఆర్‌ఓ అదనపు డీజీ కేపీ పురుషోత్తం, మరో సొరంగాల నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రాలను సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ భేటీకి రప్పిస్తోంది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటి? ఎంత పురోగతి సాధించారు? ఇంకా తీసుకోవాల్సిన చర్యలేమిటి?
గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు ఇంకేం చేయాలి? అనే అంశాలపై ఆయా శాఖలు/సంస్థల అధికారులు ఈ సమీక్షలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అవసరమైతే సహాయక చర్యలను సోమవారం ఒక రోజు నిలుపుదల చేసి ఈ కీలక సమావేశానికి హాజరు కావాలని వారిని ప్రభుత్వం కోరింది. గత నెల రోజులుగా 650 మంది సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేయగా గల్లంతైన 8 మంది కార్మికుల్లో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు.
సొరంగం కుప్పకూలిన ఫాల్ట్ జోన్‌లోని మట్టి, బండ రాళ్ల శిథిలాల కింద మిగిలిన ఏడుగురు నలిగిపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతుండగా ఆ ప్రాంతంలో తవ్వకాలు నిర్వహిస్తే మళ్లీ సొరంగం కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆచితూచి తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొననున్నారు.
సహాయక చర్యలకు రూ.5 కోట్లు విడుదల
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న సహా యక చర్యలకు రూ. 5 కోట్లను మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశా రు. మరోవైపు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జీరో పాయింట్ వద్ద 40 మీటర్ల పరిధిలో సహాయక చర్యలు చేపట్టడం ప్రమాదకరమని అధికారులు తేల్చారు.
ఆ ప్రాంతంలో సిమెంట్ సెగ్మెంట్స్ కుంగినట్లు నిర్ధారణ కు వచ్చి ‘డీ1’వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇక అక్కడ సహాయక చర్యలు కష్టమేన ని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆచూకీ లభించని ఏడుగురి గుర్తింపుపై నీలినీడలు కమ్ముకున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment