సిట్టింగ్ సీటును నిలుపుకునేందుకు బీఆర్‌ఎస్ ముమ్మర యత్నాలు
ప్రచారానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వం
అసంతృప్త నేతలను బుజ్జగిస్తూ ప్రచార పర్వంలోకి
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలు
జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’పట్టభద్రుల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్లలో పట్టు సాధించేందుకు విస్తృతంగా ప్రచారం సాగిస్తోంది. ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక వ్యూహాన్ని బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు.
అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇప్పటికే పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉన్న జిల్లాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ప్రచారం చేసిన కేటీఆర్ బుధవారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.
ఎన్నికల ప్రచారం ఈ నెల 25న ముగియనుండటంతో సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనే ఆయన ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇక నాగర్‌కర్నూలు నుంచి బీఆర్‌ఎస్ తరపున లోక్‌సభ అభ్యరి్థగా పోటీ చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ప్రతి ఓటరునూ కలిసి..
శాసన మండలి ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ స్థానం నుంచి బీఆర్‌ఎస్ వరుసగా నాలుగు పర్యాయాలు గెలవడంతో ప్రస్తుత ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచార గడువు, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయానికి బీఆర్‌ఎస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది.
మండలాల వారీగా పట్టభద్రులు నియోజకవర్గం ఓటరు జాబితాను సమన్వయకర్తలకు అందజేసి, క్షేత్ర స్థాయిలో ప్రతీ ఓటరును పార్టీ కేడర్ కలిసేవిధంగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ వైఫల్యాలు, ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల జారీలో వైఫల్యం, పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి విద్యార్హతలు, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి తదితరాలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతీ ఓటును ఒడిసి పట్టేందుకు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటరును ప్రత్యక్షంగా కలవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
అసంతృప్త నేతలకు బుజ్జగింపు
ఏనుగుల రాకేశ్‌రెడ్డి అభ్యరి్థత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలతో కేటీఆర్ స్వయంగా మాట్లాడి బుజ్జగిస్తున్నారు. ఈ ఉప ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో విభేదాలు వీడి కలిసి పనిచేయాలని కోరుతున్నారు. త్వరలో ఏర్పాటయ్యే పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో ప్రాధాన్యతను ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యరి్థత్వం ఆశించిన వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మంగళవారం కేటీఆర్‌ను కలిశారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.
కేటీఆర్, హరీశ్ ప్రచార షెడ్యూలు ఇదే
కేటీఆర్ ఈ నెల 22న ములుగు, నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశి్చమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. హరీశ్‌రావు ఈ నెల 23న భూపాలపల్లి, వర్దన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, 24న సత్తుపల్లి, వైరా, మధుర, పాలేరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment