జీవితాంతం కొడంగల్‌కు రుణపడి ఉంటా | Telangana: Revanth Reddy casts vote in Mahabubnagar MLC bypoll | Sakshi
Sakshi News home page

జీవితాంతం కొడంగల్‌కు రుణపడి ఉంటా

Published Fri, Mar 29 2024 4:55 AM | Last Updated on Fri, Mar 29 2024 4:55 AM

Telangana: Revanth Reddy casts vote in Mahabubnagar MLC bypoll - Sakshi

నేను ఏ స్థాయిలో ఉన్నా ఈ ప్రాంత బిడ్డనే: సీఎం రేవంత్‌రెడ్డి

త్వరలో కొడంగల్‌కు సిమెంట్‌ ఫ్యాక్టరీలు.. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వెల్లడి

కొడంగల్‌లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటేసిన రేవంత్‌

కోస్గి/కొడంగల్‌: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. తాను ఏ స్థాయిలో ఉన్నా ఈ ప్రాంతం బిడ్డనేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తన ప్రతి కష్టంలోనూ కొడంగల్‌ ప్రజలు అండగా నిలిచారని.. వారు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని పేర్కొన్నారు. కొడంగల్‌ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంతో చెప్పారు. తన కోసం ఎంతో చేసిన ఈ ప్రాంతాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. రేవంత్‌రెడ్డి గురువారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేయడానికి కొడంగల్‌కు వచ్చారు.

ఎక్స్‌ అఫీషియో హోదాలో కొడంగల్‌ ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన ఓటు వేశారు. అనంతరం లాహోటీ కాలనీలోని తన నివాసంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లా డుతూ... త్వరలో కొడంగల్‌కు సిమెంట్‌ పరిశ్రమలు రానున్నాయన్నారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపురాయి గనులు ఉన్నాయని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తే భూముల విలువ పెరుగుతుందని చెప్పారు. ‘కొడంగల్‌కు ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమలు ఏర్పాటు చేయడం సులభతరం అవుతుంది. భూములు కోల్పోతున్న వారికి న్యాయమైన ధరను ప్రభుత్వం చెల్లిస్తుంది. పట్టా భూములకు ఇచ్చే ధరను అసైన్‌మెంట్‌ భూములకూ ఇస్తాం’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

ఏప్రిల్‌ 8న కొడంగల్‌కు మళ్లీ వస్తానన్నారు. కోస్గిలో పాలిటెక్నిక్‌ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, కొడంగల్‌ మండలం అప్పాయిపల్లికి ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల, ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాల, పారామెడికల్‌ కళాశాలను మంజూరు చేసినట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో 50 వేలకు పైగా మెజారిటీ రావాలన్నారు.

బూత్, మండలాలు, నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏప్రిల్‌ 6న తుక్కుగూడలో సమర శంఖారావం సభకు నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వంశీచంద్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్‌ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement