ఉప ఎన్నికపై దృష్టి పెట్టండి: కేసీఆర్‌ | BRS Chief KCR Says Party Leaders To Focus On The By-elections, More Details Inside | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికపై దృష్టి పెట్టండి: కేసీఆర్‌

Sep 4 2025 5:55 AM | Updated on Sep 4 2025 11:02 AM

BRS Chief KCR says Party Leaders to Focus on the by-election

పార్టీ నేతలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశం 

ఎర్రవల్లి నివాసంలో కేటీఆర్‌ తదితరులతో భేటీ

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించాలని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నాయకులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. 

ఎర్రవల్లి నివాసంలో బుధవారం పార్టీ అధినేత కేసీఆర్‌తో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ తరహా ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. 

ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం, దానిని పార్టీకి అనువుగా మలుచుకోవాల్సిన తీరు.. తదితరాలపై దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు వచ్చిన మణుగూరు ప్రాంత నాయకులు, కార్యకర్తలు కేసీఆర్‌ను కలిశారు. కాగా కవిత రాజీనామా, ప్రెస్‌మీట్‌కు సంబంధించి అంశాలపై కేసీఆర్‌ ఎలాంటి ప్రస్తావన చేయలేదని సమాచారం.  

బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల భేటీ.. 
జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో బుధవారం తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్‌ రాజు, ఎల్‌.రమణ, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, పార్టీ నేతలు ముఠా జైసింహ, ఆజం ఆలీలు ఈ భేటీలో పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని డివిజన్‌ల అధ్యక్షులు, కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

నియోజకవర్గం పరిధిలోని ఓటరు జాబితాను డివిజన్‌లు, బూత్‌ల వారీగా లోతుగా పరిశీలించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా, డివిజన్లు, బూత్‌ల వారీగా మైనారిటీ విభాగం కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు కోరారు. త్వరలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన మరోమారు సమావేశం జరుగుతుందని ముఖ్యనేతలు వెల్లడించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement