నంద్యాలకు తాయిలాల పరంపర
నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునే అధికార టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది.
ఉప ఎన్నిక నేపథ్యంలో అపారప్రేమ
– ప్రతి కుటుంబానికీ రేషన్ కార్డు ఇచ్చేందుకు చర్యలు
– ఇప్పటికే 2,131 కార్డులు మంజూరు
– 980 పింఛన్ల కేటాయింపు
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునే అధికార టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లను ఎరగా వేస్తోంది. ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు మంజూరు చేస్తామని.. దరఖాస్తులను ఈపీడీఎస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నంద్యాలకు సంబంధించి రేషన్‌కార్డుల కోసం 2,414 దరఖాస్తులను ఈపీడీఎస్‌లో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటికే 2,131 కార్డులు మంజూరయ్యాయి. వీటిని ప్రింట్ తీసి పంపిణీ చేయడానికి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. నంద్యాల మండలానికి 1,697.. గోస్పాడు మండలానికి 434 ప్రకారం కార్డులు మంజూరయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలనే లక్ష్యంతో పాలకులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గానికి 980 పింఛన్లు మంజూరయ్యాయి.
రూ.1000కే దీపం గ్యాస్ కనెక‌్షన్ల పంపిణీని నంద్యాల నియోజకవర్గంలో ఇప్పటికే ముమ్మరం చేశారు. తాజాగా పక్కాఇళ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఏకంగా జీఓ జారీ చేయడం గమనార్హం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలకు వెళ్లకుండా ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. ఇటీవల జరిగిన శాసనమండలి, పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల్లో విద్యావంతులు టీడీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో నంద్యాలకు ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.
పంపిణీలో ఎవరిది పైచేయి
నంద్యాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున బరిలో నిలిచేందుకు ఒక వైపు శిల్పా మోహన్‌రెడ్డి, మరోవైపు భూమా కటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లు ఎవరి నేతృత్వంలో పంపిణీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మా ద్వారానే పంపిణీ చేయాలని రెండు గ్రూపులు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.