ఓటమి భయంతోనే అభివృద్ధి మంత్రం
ఓటమి భయంతోనే అభివృద్ధి మంత్రం
Published Tue, Jul 18 2017 12:13 AM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM
- టీడీపీ పాలనలో ఒరిగిందేమీ లేదు
- ఫ్యాక‌్షన్ నేతలను దూరంగా పెట్టండి
- నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి
జూలేపల్లె(గోస్పాడు): ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే టీడీపీ అభివృద్ధి మంత్రం జపిస్తోందని నంద్యాల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మండలంలోని జూలేపల్లెలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఎవరికీ ప్రాధాన్యత లేదని, కష్టపడి పని చేసినా గుర్తించే వారు లేరని అన్నారు. నంద్యాల నియోజకవర్గం ఎంతో మంది ప్రముఖ నేతలను ఎదిగేలా చేసిందని గుర్తు చేశారు. అయితే.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా ఫ్యాక‌్షన్ నాయకులు ఇక్కడ రాజకీయాలు చేసేలా ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ్యాక‌్షన్ నాయకులను ఆళ్లగడ్డకే పరిమితం చేయాలని గతంలో తాము కోరినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగ భృతి, రైతులకు, మహిళలకు రుణమాఫీ విషయంలో చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి చేయకపోగా, నంద్యాలలో మాత్రం ఉప ఎన్నిక కారణంగా అభివృద్ధి పేరిట హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతో ప్రజలను ప్రలోభపెడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీని గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు.
రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఏ పథకాలూ అమలు చేయడం లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ఎక్కడెక్కడి నుంచో టీడీపీ నాయకులు నంద్యాల వస్తున్నారని, ఇంతకుముందు అభివృద్ధి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. శిల్పా మోహన్‌రెడ్డి సొంత నిధులతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వంగూరి భాస్కరరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ప్రహ్లాదరెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, పార్థసారథిరెడ్డి, హరినాథరెడ్డి, రామనాథరెడ్డి, నాగేశ్వరరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, దేశం సుధాకర్‌రెడ్డి, ప్రసాద్, సాల్మన్, కోటిరెడ్డి, పుల్లయ్య, రామసుబ్బారెడ్డి, నారాయణ, శేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement