నంద్యాలను నందనవనం చేస్తా
నంద్యాలను నందనవనం చేస్తా
Published Tue, Sep 19 2017 11:38 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
– టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకెళ్లాలి
– పొదుపు మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
– ప్రతి ఒక్కరు నెలకు రూ.10 వేలు సంపాదించేలా కృషి
– నంద్యాల ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా
– ముఖ్యమంత్రి చంద్రబాబు
నంద్యాల : నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నందనవనం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం పట్టణంలోని టెక్కె మార్కెట్‌యార్డులో నిర్వహించిన పొదుపు మహిళల ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉప ఎన్నిక సమయంలో నంద్యాలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానన్నారు. నంద్యాల అభివృద్ధి కోసం 285 పనులు ఆమోదించి.. రూ.1,680 కోట్లు మంజూరు చేశానన్నారు. పట్టణంలో, గ్రామాల్లో సీసీ రోడ్లు, చామకాల్వ, కుందూ వెడల్పు పనులు, రోడ్ల విస్తరణ, 13వేల గృహాల పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఈ పనుల పర్యవేక్షణ కోసమే నంద్యాలకు వచ్చానని చెప్పారు. నంద్యాల ప్రజలు మూడున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేసి గెలిపించారని, వారి ఆదరణను మరిచిపోలేనని అన్నారు.
పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని కష్టపడి పని చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి ఇంటికీ రూ.200లకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించబోతున్నామన్నారు. గతంలో చనిపోయిన వారి పేరుమీద, నిరక్షరాస్యుల పెన్షన్లను నాయకులు మింగేసేవారని, కానీ ఈ రోజు టెక్నాలజీతో అవినీతి లేకుండా చేశామని అన్నారు. పొదుపు మహిళలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తానన్నారు. ప్రతి ఒక్కరికీ రూ.10వేలు ఆదాయం వచ్చేలా కృషి చేస్తానన్నారు. 85శాతం ప్రజలను సంతృప్తి పరచడమే లక్ష్యమన్నారు. వచ్చేనెల 7వ తేదీన తిరిగి నంద్యాలకు వస్తానని, ఆరోజు పట్టణంలో విత్తనహబ్‌కు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. దీని వల్ల నంద్యాల రైతులకే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల వారికి నాణ్యమైన విత్తనాలు ఇక్కడి నుంచే సరఫరా అవుతాయన్నారు.
కార్యక్రమంలో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అఖిలప్రియ, అమర్‌నాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు భూమాబ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్, పార్టీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఇంతియాజ్‌అహమ్మద్, సూరజ్ రామిరెడ్డి, నౌమాన్, శాంతిరాముడు, మాండ్ర శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో సమీక్షా సమావేశం రద్దు
సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉండేది. అయితే సమయం లేనందున సమీక్ష సమావేశాన్ని రద్దు చేసి నేరుగా పొదుపు మహిళల ముఖాముఖికి సీఎం హాజరయ్యారు. చంద్రబాబు మున్సిపల్ కార్యాలయానికి వస్తారని అధికారులు కార్యాలయానికి రంగులు వేసి ముస్తాబు చేశారు.
Advertisement
Advertisement