వైఎస్సార్‌సీపీ పోటీ చేయడం వల్లే అభివృద్ధి
- ఉప ఎన్నికలో పోటీకి పెట్టకుంటే నంద్యాలను పట్టించుకునేవారు కాదు
- మాజీ ఎంపీ, పార్టీ జిల్లా పరిశీలకుడు అనంత వెంకటరామిరెడ్డి
నంద్యాలఅర్బన్: ఉప ఎన్నికలోవైఎస్సార్సీపీ పోటీ చేయకపోతే ప్రభుత్వం నంద్యాల అభివృద్ధి గురించి పట్టించుకునేది కాదని వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు తన మూడేళ్ల పాలనలో నంద్యాల అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్సార్‌సీపీ పోటీ పెట్టడం వల్ల ఓటమి భయంతో నంద్యాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా సింగనమలకు చెందిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివారెడ్డితో కలిసి శనివారం అనంత వెంకటరామిరెడ్డి 16వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకు నంద్యాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు నమ్మవద్దని అనంత వెంకటరామిరెడ్డి ప్రజలకు సూచించారు.
కడప ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ ప్రాంత అభివృద్ధికి రూ.280కోట్లు మంజూరు చేసి పునాది రాళ్లు వేశారని చెప్పిన ఆయన ఇప్పటి వరకు అందులో ఒక్క పని కూడా ముందుకు సాగలేదని గుర్తు చేశారు. పని ఉన్నంత వరకు ఒక రకంగా పని అయిపోయిన తర్వాత మరోరకంగా ప్రవర్తించడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. ఉప ఎన్నిక అనంతరం నంద్యాల వైపు ప్రభుత్వ పెద్దలు కన్నెత్తి కూడా చూడరన్నారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన 9 పథకాలు జనామోదం పొందడంతో చంద్రబాబుకు దిమ్మతిరిగిందన్నారు. 2019 సాధారణ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సీఎం మోసాలను ప్రజలు పసిగట్టారు...
ముఖ్యమంత్రి మోసపూరిత ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారని సింగనమల్ల సాంబశివారెడ్డి అన్నారు. గోపాల్‌నగర్, సుందరయ్య కాలనీల్లో ప్రచారానికి జనం నుంచి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. వీరి వెంట స్థానిక నాయకులు మోహన్ లింగప్రసాద్, సాయిరాంరెడ్డి, జమత్‌వలి, సంపత్, బాలిరెడ్డి, తిరుపతి, రాంబాబు, శ్రీనివాసులు, అనంతపురం జిల్లా నాయకులు నాగేశ్వరరెడ్డి, రాఘవరెడ్డి, రామాంజులురెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మీసాల రంగన్న, తదితరులు పాల్గొన్నారు.