ఎన్నికల ఖర్చు వివరాలివ్వండి
ఎన్నికల ఖర్చు వివరాలివ్వండి
Published Wed, Aug 30 2017 1:05 AM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM
- షాడో అబ్జర్వేషన్ రిజిష్టర్‌తో సరిపోకపోతే నోటీసులు
- జేసీ ప్రసన్న వెంకటేష్
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నికలో చేసిన ఖర్చు వివరాలను ఓట్ల లెక్కింపు తేదీ నుంచి నెల రోజుల్లో సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అభ్యర్థులను ఆదేశించారు. మంగళవారం తన చాంబరులో జేసీ విలేకరులో మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారిగా తనకు ఇది మొదటి ఎన్నికని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, విమర్శలు దరిచేరకుండా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు బాగా సహకరించారన్నారు. ఎన్నికల నియమావలి, పెయిడ్ న్యూస్ తదితర వాటిపై నిష్పక్షపాతంగా వ్యవహించామన్నారు.
అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు షాడో అబ్జర్వేషన్ రిజిష్టర్ నిర్వహించారని, ఇందులో అభ్యర్థి చేసిన ప్రతి ఖర్చును నమోదు చేసి ఉంటారన్నారు. వీటికి అభ్యర్థులు చూపించే లెక్కలకు సరిపోలక పోతే నోటీసులు ఇస్తామన్నారు. నిబంధనల ప్రకారం రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయరాదన్నారు. పోలింగ్ సిబ్బందికి రోజుకు టీఏ, డీఏ కింద అదనంగా రూ.300 ఇస్తున్నామని, ఇప్పటికే పీఓ, ఏపీఓలకు అదనపు టీఏ, డీఏ చెల్లించామని, ఇతర పోలింగ్ సిబ్బంది మాత్రం తీసుకోలేదని, వీరు నంద్యాల తహసీల్దారును కలసి అదనపు డీఏ పొందవచ్చని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై రెవెన్యూ, పౌరసరఫరాల అంశాలపై దృష్టి సారిస్తామన్నారు.
కలెక్టర్, జేసీలకు జిల్లా అధికారుల అభినందనలు
నంద్యాల ఉప ఎన్నికను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్‌ను.. జేసీ–2 రామస్వామి, ప్రత్యేక కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి తదితరులు వేరువేరుగా కలసి బొకేలు సమర్పించి అభినందించారు. అదే విధంగా జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌బాబు, కార్యదర్శి గిరికుమార్‌రెడ్డి తదితరులు కలెక్టర్, జేసీలను కలిసి ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు.
Advertisement