సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహాల్లో భాగంగా బుధవారం హాలియాలో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. టీఆర్‌ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యే ఈ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సుమారు రెండు లక్షల మందిని సమీకరించడం లక్ష్యంగా టీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు వారం రోజుల క్రితం బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించడంతో తక్కువ వ్యవధిలో భారీ సభను నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
దివంగత శాసన సభ్యులు నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఈ స్థానాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో టీఆర్‌ఎస్ పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్క ల్లపల్లి రవీందర్‌రావు, మాజీ విప్ కర్నె ప్రభాకర్ తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తు న్నారు. హాలియాలో అలీనగర్ సమీపంలో నల్లగొండ రహదారి వెంట ఏర్పాటుచేసిప ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది.
సభ వెనుక బహుముఖ వ్యూహం
నాగార్జునసాగర్ ఉపఎన్నిక సన్నాహాల్లో భాగంగా టీఆర్‌ఎస్ బుధవారం బహిరంగ సభ నిర్వహిస్తున్న ప్పటికీ పార్టీ అధినేత మదిలో ఇతర వ్యూహాలు కూడా ఉన్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో బుధవారం జరిగే సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రస్థానం, విధానంతో పాటు పాలనాపరమైన అంశాలపై కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గం, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు కేసీఆర్ ప్రసంగంలో ప్రధానంగా చోటు చేసుకునే అవకాశముందని పార్టీ నేతలు అంచనా వేస్తు న్నారు. రాబోయే రోజుల్లో పార్టీ, ప్రభుత్వపరంగా దూకుడుగా వెళ్తామనే సంకేతం ఈ సభ ద్వారా పార్టీ యంత్రాంగానికి ఇచ్చే అవకాశముంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గత ఆరున్నరేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిని వివరించడంతో పాటు కొత్తగా పలు వరాలు కూడా ఇచ్చే అవకాశముంది. శాసనమండలి పట్టభద్రుల కోటా టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ఈ సభ నుంచి కేసీఆర్ పిలుపునిస్తారు.
ఎన్నిక ఎప్పుడొచ్చినా... ‘సమర’ సన్నద్దత
తొలుత తిరుపతి లోక్‌సభ స్థానంతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి కూడా మార్చిలో ఉప ఎన్నిక జరుగుతుందని టీఆర్‌ఎస్ భావించింది. అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక ఉంటుందని తాజాగా అంచనా వేస్తోంది. అయితే ఏ సమయంలో ఉప ఎన్నిక జరిగినా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దంగా వుంచేందుకు టీఆర్‌ఎస్ గత ఏడాది డిసెంబర్ నుంచే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే మండల, నియోజకవర్గ స్థాయిలో సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు పలు పర్యాయాలు అంతర్గత సర్వేలు కూడా నిర్వహించింది. పార్టీ నేతల నుంచి అందిన అంతర్గత నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌తో పాటు, ఇతర పార్టీల బలాబలాలను కూడా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అంచనా వేస్తూ వస్తున్నారు. రెండు రోజులుగా బహిరంగ సభ సన్నాహాల్లో భాగంగా మరోమారు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించారు.
మండలాల వారీగా ఇన్‌చార్జిలు
సాగర్ నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల వారీగా టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జిలను నియమించి ఉప ఎన్నికకు సన్నద్దమవుతోంది. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్‌రావు పర్యవేక్షణలో మండల ఇన్‌చార్జిలు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. మందుల సామేలు (త్రిపురారం), కర్నె ప్రభాకర్ (నిడమానూరు), భరత్ కుమార్ గుప్తా (హాలియా), రవీందర్‌రావు (నాగార్జునసాగర్), సందీప్‌రెడ్డి (పెద్దఊర), ఒ.నర్సింహారెడ్డి (గుర్రంపోడు) ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. శాసనమండలి పట్టభద్రుల ఎన్నిక, సాగర్ ఉప ఎన్నిక కోసం పార్టీ స్థానిక నేతలను సమన్వయం చేయడంపై టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిలు దృష్టి కేంద్రీకరించారు.
అభ్యర్థి ఎంపిక ఇప్పట్లో లేనట్లే!
టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరవుతున్న హాలియా బహిరంగ సభలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసే పార్టీ అభ్యర్థిపై ఎలాంటి ప్రకటన ఉండే సూచనలు కనిపించడం లేదు. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, న్యాయవాది డీసీ కోటిరెడ్డి, దివంగత శాసనసభ్యులు నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరితో పాటు మన్నె రంజిత్‌యాదవ్, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ వంటి స్థానిక యువనేతలు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అభ్యర్థి ప్రకటనపై తొందరపడకుండా... సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే యోచనలో పార్టీ అధినేత కే.చంద్రశేఖర్‌రావు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment