
టీటీవీ దినకరన్
రాబోయే ఉప ఎన్నికల్లో మా సత్తా చాటి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని..
చెన్నై: ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) పార్టీ అధ్యక్షుడు టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. అనర్హతకు గురైన ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లబోమని వెల్లడించారు. రాబోయే ఉప ఎన్నికల్లో మా సత్తా చాటి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని వ్యాఖ్యానించారు.
టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమిళనాడు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా గ్రూపు కట్టడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో వారికి చుక్కెదురైంది. అనర్హత సబబేనని హైకోర్టు తీర్పునివ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్లడానికి టీటీవీ దినకరన్ వర్గీయులు సంశయించారు. ఉప ఎన్నికలలోనే తేల్చుకోవాలని నిశ్చయించుకున్నారు.