ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తీన్మార్‌ మల్లన్న గెలుపు | Teenmar Mallanna victory in the MLC by-election | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తీన్మార్‌ మల్లన్న గెలుపు

Published Sat, Jun 8 2024 4:38 AM | Last Updated on Sat, Jun 8 2024 4:38 AM

శుక్రవారం రాత్రి 12.45 గంటలకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హరిచందన నుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న మల్లన్న

శుక్రవారం రాత్రి 12.45 గంటలకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హరిచందన నుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న మల్లన్న

పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 50 మంది ఎలిమినేట్‌

మిగిలిన ఇద్దరిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంటే ఆధిక్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి  

ఎన్నికల సంఘం వివరణ కోసం లేఖ రాసిన ఆర్‌ఓ హరిచందన  

ఈసీ నుంచి స్పష్టత రావడంతో అధికారికంగా ప్రకటించిన ఆర్‌ఓ

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా  గెలుపునకు సరిపడా కోటా రాకపోయినప్పటికీ తీన్మార్‌ మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉండడంతో ఆయన్నే విజేతగా ప్రకటించారు.  గత నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌ జరగ్గా, , నల్లగొండలో ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మూడు రోజులపాటు నిరి్వరామంగా కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. రెండోరోజు గురువారం రాత్రి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.  

మొదటి ప్రాధాన్యతతో రాని మెజారిటీ  
మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికీ గెలుపు టార్గెట్‌ కోటా అయిన 1,55,095 ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు పోల్‌ కాగా, అందులో 3,10,189 ఓట్లు చెల్లుబాటు అయినట్టు అధికారులు ప్రకటించారు. 25,824 ఓట్లు చెల్లలేదు. చెల్లుబాటు అయిన  ఓట్లలో సగానికిపైగా అంటే 1,55,095 ఓట్లు గెలుపునకు టార్గెట్‌ కోటాగా నిర్ణయించారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా తీన్మార్‌ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. 

బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు 29,697 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులందరికి కలిపి 10,118 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో అత్యధికంగా ఓట్లు వచ్చిన మల్లన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంటే 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయినా గెలుపు కోటా 1,55,095 ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను గురువారం సాయంత్రం నుంచి లెక్కించారు.  

రెండు ప్రాధాన్యతలోనూ దక్కని కోటా ఓట్లు   
రెండో ప్రాధాన్యత ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్‌ చేసి వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థులకు (ఓటర్లు రెండో ప్రాధాన్యతను ఎవరికి ఇచ్చారో వారికి) కలుపుతూ లెక్కించారు. 48 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ తర్వాత తీన్మార్‌ మల్లన్నకు 1,24,899 ఓట్లు , రాకేష్‌రెడ్డికి 1,0,5,524 ఓట్లు , ప్రేమేందర్‌రెడ్డికి 43,096  ఓట్లకు చేరుకున్నారు. అయినా  గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో నాలుగోస్థానంలో ఉన్న స్వతంత్ర పాలకూరి అశోక్‌ను ఎలిమినేట్‌ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారో లెక్కించారు.

అప్పటికీ  గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాలేదు. దీంతో మూడోస్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని ఎలిమినేట్‌ చేసి ఆయన ఓట్లు లెక్కించారు. అయినా కూడా గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు.  ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన 52 మంది అభ్యర్థుల్లో 50మందిని ఎలిమినేట్‌ చేశారు. అందులో ముందుగా నిర్ణయించిన గెలుపు టార్గెట్‌ ఓట్లు తీన్మార్‌ మల్లన్న, రాకేశ్‌రెడ్డి లకు రాలేదు. 

ఎన్నికల సంఘం వివరణకు లేఖ రాసిన ఆర్‌ఓ 
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో  గెలుపునకు అవసరమైన టార్గెట్‌ కోటా ఓట్లు (1,55,095) ఎవరికీ రాకపోవడం, మెజారిటీలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను విజేతగా ప్రకటించాలా? లేదంటే సమీప ప్రత్యర్థి రాకేశ్‌రెడ్డికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత టార్గెట్‌ రీచ్‌ అయ్యే వరకు వేచి ఉండాలా అని,  ఎన్నికల సంఘానికి రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందన లేఖ రాశారు. శుక్రవారం అర్థరాత్రి దాటాక ఈసీ నుంచి అత్యధిక ఓట్లు పొందిన అభ్యరి్థని విజేతగా ప్రకటించాలని సమాచారం అందింది. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను విజేతగా ప్రకటిస్తూ ఆర్‌ఓ హరిచందన ధ్రువీకరణపత్రం అందజేశారు.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement