ఉప చిచ్చు!
ఉప చిచ్చు!
Published Tue, Apr 18 2017 12:21 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
నంద్యాల సీటుపై పేచీ
– తనకే ఇవ్వాలంటున్న భూమా చిన్న కుమార్తె
– భూమా బ్రహ్మానందరెడ్డి వైపు అధిష్టానం మొగ్గు
– సెంటిమెంట్‌పై అధికార పార్టీ పునరాలోచన
- వేరు కుంపటి యోచనలో శిల్పా
- తెరపైకి కొత్త రాజకీయ సమీకరణాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల వ్యవహారం అధికార పార్టీలో రోజుకో కొత్త చిచ్చు రేపుతోంది. ఉప ఎన్నికల్లో అసెంబ్లీ సీటు ఎవరికి ఇవ్వాలనే అంశంపై కథ రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న, మొన్నటి వరకు భూమా బ్రహ్మానందరెడ్డికి సీటు ఖాయమని సాగిన చర్చ.. తాజాగా కొత్త మలుపు తీసుకుంది. అసెంబ్లీ బరిలో భూమా నాగిరెడ్డి కుటుంబానికి చెందిన నాగమౌనికకే పెద్దపీట వేయాలనే చర్చ మొదలయ్యింది. తద్వారా సెంటిమెంట్ కూడా వర్క్‌అవుట్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సీటు తనకే ఇవ్వాలని భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె నాగమౌనిక కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ అధిష్టానం మాత్రం భూమా బ్రహ్మానందరెడ్డి వైపే ఇప్పటి వరకు మొగ్గు చూపుతోంది. సెంటిమెంట్ వర్క్ అవుట్ కాదేమోనన్న ఆందోళన ఆ పార్టీని వెన్నాడుతోంది.
సీటుపై మడత పేచీ...
వాస్తవానికి భూమా బ్రహ్మానందరెడ్డికే ఉప ఎన్నికల్లో సీటు ఖరారైందని మొదట్లో ప్రచారం జరిగింది. దీంతో రోడ్ల విస్తరణ సహా వివిధ పథకాల అమలు తీరుపై భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో పర్యటించడం మొదలుపెట్టారు. కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే శిల్పా కుటుంబం నుంచి మద్దతు దొరక్కపోవడంతో పాటు నాగమౌనిక కూడా సీటు ఆశించడంతో ఆ పార్టీలో చర్చ మొదలయ్యింది. మరణించిన భూమా నాగిరెడ్డి కుటుంబానికి చెందిన రెండవ కుమార్తె నాగమౌనికకు సీటు ఇస్తేనే సెంటిమెంటు వర్క్‌అవుట్ అవుతుందని, ఇతరులకు ఇస్తే కాదన్న అభిప్రాయం బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో కూడా తాజాగా పునరాలోచన ప్రారంభమైనట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి సీటు ఇవ్వని పక్షంలో తన దారి తాను చూసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
నిజంగా సెంటిమెంట్ ఉందా?
సాధారణంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే నంద్యాల విషయానికి వచ్చే సరికి ఇది కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన భూమా నాగిరెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి మంత్రి పదవి కూడా ఆశించారు. అయితే ఆయనకు మంత్రి దక్కలేదు. పైగా గుండెపోటుతో మరణించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన వ్యక్తి మరణించడంతో ఆ సీటు తమ పార్టీ అభ్యర్థికే ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. అయితే భూమా కుటుంబం నుంచి ఒకరిని టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో సెంటిమెంట్ వర్క్‌అవుట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. పైగా పార్టీ మారిన కుటుంబానికి చెందిన వ్యక్తినే మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలన్న మీమాంస నంద్యాల నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీనికి తోడు బలమైన వర్గమున్న శిల్పామోహన్‌రెడ్డి సహకరించకపోగా పోటీలో నిలవాలని భావిస్తుండటం అధికార పార్టీని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. మొత్తం మీద అధికార పార్టీలో నంద్యాల ఉప ఎన్నికల వ్యవహారంతో కొత్త రాజకీయ సమీకరణాలు ప్రారంభమయ్యాయి.
Advertisement