సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సమన్వయానికి ప్రత్యేకంగా కమిటీ వేయాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో చర్చించిన తర్వాత కమిటీని నియమించనున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని మంగళవారం జరిగిన పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో తీర్మానించారు. అలాగే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో 15న చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి అసెంబ్లీ ఎదుటనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.
17న విమోచన దినోత్సవంతో పాటు, ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు నుంచి వచ్చేనెల 2న మహాత్మాగాంధీ జయంతి దాకా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. కాగా 16 లోక్‌సభ నియోజకవర్గాలకు నియమించిన కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా పార్టీ ఇన్‌చార్జిలతో బుధవారం సంజయ్ ఇతర ముఖ్యనేతలు భేటీ కావాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: దేశ రాజకీయాల పేరిట కేసీఆర్ కొత్త డ్రామాలు: బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment